శ్రీగిరిపై ఉగాది మహోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-04-11T08:58:56+05:30 IST

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు శనివారం ప్రారంభం అయ్యాయి. ఉదయం ఆలయ ప్రాంగణంలోని స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలయ్యాయి.

శ్రీగిరిపై ఉగాది మహోత్సవాలు ప్రారంభం

శ్రీశైలం, ఏప్రిల్‌ 10: శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు శనివారం ప్రారంభం అయ్యాయి. ఉదయం ఆలయ ప్రాంగణంలోని స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటిరోజు స్వామిఅమ్మవార్లకు భృంగివాహన సేవ చేశారు. అర్ధనారీశ్వర రూపానికి మూలకారకుడైన భృంగి.. భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి సేవలో తరించారు. భృంగి వాహనంపై ఉత్సవమూర్తులను ఆశీనులనుజేసి సుగంధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం క్షేత్ర వీధుల్లో ఊరేగించారు.


గ్రామోత్సవం ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భ్రమరాంబదేవి మహలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్భుజాలు కలిగిన ఈదేవి పైరెండు చేతుల్లో పద్మాలను, కింది చేతుల్లో కుడివైపు అభయహస్తం, ఎడమవైపు వరముద్రతో దర్శనం ఇచ్చారు. ఈ స్వరూపాన్ని దర్శిస్తే శత్రుబాధలు తొలగి, సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతారు. ఉగాది మహోత్సవాల్లో రెండోరోజైన ఆదివారం స్వామిఅమ్మవార్లు  కైలాసవాహనంపై ఊరేగనున్నారు. అమ్మవారు మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. 

Updated Date - 2021-04-11T08:58:56+05:30 IST