నిబంధనలతో ఉగాది

ABN , First Publish Date - 2021-04-13T05:30:00+05:30 IST

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్లవనామ ఉగాది వేడుకలు నిరాడంబరంగా జరుపుకున్నారు. కరోనా ఉధృతి దృష్ట్యా ఈ ఏడాది ప్రజలు పండుగను ఇంట్లోనే జరుపుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. ఆలయాలకు భక్తుల తాకిడి తక్కువగా ఉంది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సామూహిక పంచాంగ శ్రవణాలు జరిపించారు. తక్కువ సంఖ్యలోనే ప్రజలు హాజరయ్యారు.

నిబంధనలతో ఉగాది
సిద్దిపేటలో పంచాంగ శ్రవణంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు

ప్లవనామ సంవత్సరానికి నిరాడంబరంగా ఆహ్వానం 

కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ పంచాంగ శ్రవణం


ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్లవనామ ఉగాది వేడుకలు నిరాడంబరంగా జరుపుకున్నారు. కరోనా ఉధృతి దృష్ట్యా  ఈ ఏడాది ప్రజలు పండుగను ఇంట్లోనే జరుపుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. ఆలయాలకు భక్తుల తాకిడి తక్కువగా ఉంది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సామూహిక పంచాంగ శ్రవణాలు జరిపించారు. తక్కువ సంఖ్యలోనే ప్రజలు హాజరయ్యారు.


కొమురవెల్లి మల్లన్న ఆదాయం–2, వ్యయం–14

చేర్యాల, ఏప్రిల్‌ 13: కొమురవెల్లి మల్లిఖార్జునస్వామి ఆలయంలో ప్లవనామ ఉగాది వేడుకలు సంప్రదాయబద్దంగా నిర్వహించారు. వీరశైవాగమ పండితుడు అంగడిమఠం భువనేశ్వరయ్య పంచాగాన్ని పఠించారు. తొలుత మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాశులవారీగా ఫలితాలు వివరించారు. కొమురవెల్లి మల్లన్నకు  ఈ ఏడాది ఆదాయం–2, వ్యయం–14గా ఉందని, ఆలయం అభివృద్ధిబాటలో పయనిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి భక్తులను అనుమతించలేదు. ఏఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్‌, అర్చకసంఘం అధ్యక్షుడు పడిగన్నగారి ఆంజనేయులు, సూపరింటెండెంట్‌ నీల శేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.


మెదక్‌ జిల్లాలో పలుచోట్ల బండ్ల ఊరేగింపు

చిన్నశంకరంపేట/పాపన్నపేట/చిల్‌పచెడ్‌/నిజాంపేట/టేక్మాల్‌, ఏప్రిల్‌ 13: మెదక్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో ఉగాది సందర్భంగా సంప్రదాయబద్దంగా బండ్ల ఊరేగింపు నిర్వహించారు. చిన్నశంకరంపేటలోని అనంతపద్మనాభ గుట్ట, గజగట్లపల్లి తదితర గ్రామల్లో గుమ్మటాల బండ్లు ఊరేగించారు. పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగ్‌ రాజరాజేశ్వర ఆలయంలో జాతర బండ్ల ఊరేగింపు నిర్వహించారు. మిన్‌పూర్‌ గ్రామంలో గ్రామ దేవతలకు బోనాలు సమ్పపంచారు. చిల్‌పచెడ్‌ మండల పరిధిలోని ఫైజాబాద్‌, బండాపోతుగల్‌, చిల్‌పచెడ్‌ గ్రామాల్లో గ్రామ దేవతలకు బండ్ల ఊరేగింపు నిర్వహించారు. టేక్మాల్‌ మండలం ధన్నుర గ్రామ శివారులోని వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద బండ్ల ఊరేగింపు నిర్వహించారు. పల్వంచ, దాదాయిపల్లి, మల్కాపూర్‌, బర్దీపూర్‌, కుసంగితో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన బండ్లతో స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. చేగుంట మండలం కర్నాల్‌పల్లిలోనూ బండ్ల ఊరేగింపు నిర్వహించారు.

Updated Date - 2021-04-13T05:30:00+05:30 IST