దురాగతం

ABN , First Publish Date - 2021-02-16T07:06:50+05:30 IST

బెంగుళూరుకు చెందిన ఇరవైరెండేళ్ళ పర్యావరణ కార్యకర్త దిశ రవిని ఒక అంతర్జాతీయ కుట్రదారుగా, దేశద్రోహిగా నిర్థారించి ఢిల్లీపోలీసులు...

దురాగతం

బెంగుళూరుకు చెందిన ఇరవైరెండేళ్ళ పర్యావరణ కార్యకర్త దిశ రవిని ఒక అంతర్జాతీయ కుట్రదారుగా, దేశద్రోహిగా నిర్థారించి ఢిల్లీపోలీసులు అరెస్టుచేసిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. పాలకులు కొత్తగా తెరమీదకు తెచ్చిన ‘టూల్‌కిట్‌ కుట్ర’ సిద్ధాంతంలో భాగంగా జరిగిన తొలి అరెస్టు ఇది. తమకు ప్రీతిపాత్రమైన రంగాల్లో పనిచేస్తున్న యువత ఆయా రంగాల్లో పాలకులనుంచి ఎదురవుతున్న సవాళ్ళను సంఘటితంగా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తే ఇలాగే జైలుకుపోక తప్పదన్న హెచ్చరిక ఇందులో ఉంది. ఆమె చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందని అంటున్న ఢిల్లీ పోలీసులు బెంగుళూరు శివార్లలో ఉన్న ఇంటినుంచి దిశను ఢిల్లీ తరలించడానికి అన్ని నియమ నిబంధనలనూ కాలరాశారు. వారికి ఏమాత్రం అధికారం, అవకాశం ఉన్నా ఏకంగా గ్రీటా థెన్‌బర్గ్‌నే అరెస్టుచేసి జైల్లోకి తోసేవారేమో అంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. 


ఉద్యమిస్తున్న రైతులకు అండగా నిలిచినందుకు ఈ పర్యావరణ ప్రేమికురాలు దేశానికి శత్రువైంది. ఆమె ప్రధాన భాగస్వామిగా తయారైందని అంటున్న ఈ డాక్యుమెంట్‌ ఏకంగా రాజ్యం పునాదులనే కుదిపేస్తుందని పాలకులు ఆందోళన చెందుతున్నారు. రైతు ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం ఎలా కూడగట్టాలో చెబుతున్న సదరు ‘టూల్‌కిట్‌’ భారతభూభాగంలోకి చొచ్చుకొచ్చిన చైనా సైన్యం కంటే ప్రమాదమా? అని కొందరు నిలదీస్తున్నారు. సిక్కు రైతులు అధికంగా ఉన్న ఈ ఉద్యమం వెనుక ఖలిస్థానీ శక్తులున్నాయని అధికారపక్ష నాయకులు ఆదినుంచీ ఆరోపిస్తూనే ఉన్నారు. నెలలపాటు నిరసనలను శాంతియుతంగా నిర్వహించి రైతులు అప్రదిష్టలేకుండా చూసుకున్నప్పటికీ, పాలకులు హింస గురించిన అనుమానాలూ వెలిబుచ్చుతూనే ఉన్నారు. ట్రాక్టర్‌ ర్యాలీ హింస వెనుక ప్రభుత్వ పన్నాగం ఉన్నదన్న ఆరోపణలు అటుంచితే, ఆ దుర్ఘటన ఆధారంగా ఉద్యమాన్ని భూస్థాపితం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. సదరు ‘టూల్‌కిట్‌’లో రెండు మూడులైన్లు మాత్రమే ఎడిట్‌ చేశానని న్యాయస్థానంలో కన్నీళ్ళు పెట్టుకున్నది దిశ. ఆ ‘టూల్‌కిట్‌’లో ఏమున్నది, దానివల్ల ఒరిగే నష్టమెంత అన్నకంటే, దీని ఆధారంగా రైతు ఉద్యమ సమర్థకులను భయపెట్టడం ప్రభుత్వానికి ప్రధానం. ఈ టూల్‌కిట్‌లోని అంశాలు దేశద్రోహ ఆరోపణలు చేయదగ్గ స్థాయిలో ఉన్నాయా, రేప్పొద్దున్న న్యాయస్థానాల్లో సదరు ఆరోపణలను రుజువుచేయగలమా అన్నది కూడా పాలకులకు అనవసరం. రాజ్యమే ల్యాప్‌టాపుల్లోకి రహస్యంగా దూరుతున్న ‘భీమా కోరేగావ్‌’ కేసులో ఏమి జరుగుతున్నదో చూస్తూనే ఉన్నాం. న్యాయస్థానాలు సైతం ఈ తరహా అరెస్టుల విషయంలో పోలీసుల అడ్డగోలు చర్యలను ప్రశ్నించడం లేదు. ఒక రాష్ట్రంనుంచి అక్కడి పోలీసులకు తెలియ


చేయకుండా, అక్కడి న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టకుండా ఇలా ఎత్తుకురావడమేమిటని ఢిల్లీ పోలీసులను ప్రశ్నించకుండానే నిందితులను కస్టడీకీ అనుమతించడం, నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేయడం జరిగిపోతోంది. అసమ్మతిని, నిరసనను సహించలేని వారి ఏలుబడిలో మానవహక్కులనుంచి ఆహారభద్రత వరకూ దేనిని అడిగినా దేశద్రోహి అనిపించుకోవాల్సి వస్తున్నది. విదేశీ ఉద్యమకారులు, కార్యకర్తలు ఇక్కడి ప్రజాపోరాటాలపై చేస్తున్న వ్యాఖ్యలను మన కళాకారులు, క్రీడాకారులు శక్తిమేర తిప్పికొడుతూనే ఉన్నారు. ఆయా అంశాలమీద వీరికి ఏమేరకు అవగాహన ఉన్నదో లేదో తెలియదు కానీ, ప్రభుత్వం ఒత్తిడిమేరకే ఇది జరుగుతున్నదని మిగతా ప్రపంచం భావిస్తోంది. ఇప్పుడు గ్రీటా థన్‌బర్గ్‌తో చేతులు కలిపి, అంతర్జాతీయ కుట్రలో భాగస్వామి వయ్యావంటూ దిశపై పాలకులు ఇలా విరుచుకుపడటం మరింత అప్రదిష్టకాదా? ఢిల్లీలో తాను పనిచేస్తున్న ఫ్యాక్టరీలో మహిళాకార్మికులపై జరుగుతున్న అఘాయిత్యాలను బయటపెట్టిన నవ్‌దీప్‌కౌర్‌ అనే దళిత యువతి రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించడంతో జైలుపాలై, పోలీసు అత్యాచారాలకు గురవుతున్న విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ సోదరి కుమార్తె మీనా హారిస్‌ ఇటీవలే పోస్టు చేశారు. నిరసన, అసమ్మతి అణచివేత విషయంలో పాలకులు వైఖరి మార్చుకోనిపక్షంలో దేశం అంతర్జాతీయంగా మరింత పరువు కోల్పోవలసి వస్తుంది.

Updated Date - 2021-02-16T07:06:50+05:30 IST