కాపాడు తల్లీ

ABN , First Publish Date - 2020-07-13T10:39:36+05:30 IST

సికింద్రాబాద్‌లో ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని సురిటి అప్పయ్య అనే ..

కాపాడు తల్లీ

సికింద్రాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌లో ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని సురిటి అప్పయ్య అనే మిలిటరీ డోలీ మొక్కు కారణంగా వందల సంవత్సరాల క్రితం కలరా మహమ్మారి శాంతించిందని చెబుతారు. దాంతో సికింద్రాబాద్‌లో ఉజ్జయినీ మహాకాళి అమ్మవారు వెలిసి, దేశ విదేశాల్లోని భక్తుల కొంగు బంగారంగా విలసిల్లింది. తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా భక్తులు సమర్పించే బోనాలను స్వీకరిస్తూ వస్తోంది. అమ్మవారి కృప ఉంటే తమకు ఎటువంటి కీడు జరగదని ఆబాల గోపాలం గాఢంగా నమ్ముతుంటారు. ఆ విశ్వాసమే... కరోనా కాలంలోనూ కొంత మంది భక్తులను ఆలయాల వైపు తీసుకొస్తోంది.


ప్రజలు తమ ఇళ్లలోనే బోనాల పండుగను జరుపుకోవాలని ప్రభుత్వం ప్రకటించినా కొందరు వస్తూనే ఉన్నారు. భారీ పోలీసు బందోబస్తు, అడుగడుగునా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో భక్తులు ఉజ్జయినీ మహాకాళి ఆలయానికి రాలేకపోయారు. అయితే.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని రెజిమెంటల్‌బజార్‌, శివాజీనగర్‌ తదితర ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలకు భక్తులు వచ్చా రు. అమ్మవారికి బోనాలు సమర్పించి, తమకు, యావత్‌ సమాజానికి శుభం చేకూర్చాలని, ప్రపంచం నుంచి కొవిడ్‌ మహమ్మారిని తరిమికొట్టాలని మొక్కులు తీర్చుకున్నారు. 

Updated Date - 2020-07-13T10:39:36+05:30 IST