Abn logo
Oct 26 2021 @ 23:49PM

వారి దోపిడీతోనే హుజూరాబాద్‌ ఉపఎన్నిక వచ్చింది

దేశరాజుపల్లిలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

- పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

కమలాపూర్‌, అక్టోబరు 26 : సీఎం కేసీఆర్‌, మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ఇద్దరు అవినీతి పరులని, వారి దోపిడీ వల్లే హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వచ్చిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్ది ఆరోపించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని ఉప్పల్‌, దేశరాజుపల్లి, కానిపర్తి, శంభునిపల్లి, కమలాపూర్‌ తదితర గ్రామాలలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరు వెంకట నర్సింగరావు గెలుపు కోసం సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్కతో కలసి ఆయన ఎన్నికల ప్రచా రం మంగళవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌, మంత్రి ఈటల పంచాయితీ పెట్టుకొని, అక్రమంగా సంపాదించిన సొమ్మును రోజూ మద్యం, ఓట్ల కోసం పంచుతున్నారన్నారు. వారు ఇద్దరు ప్రజలను ఓట్లు అడగడానికి అనర్హులు అని, దీనిని ప్రజలు ఆలోచించాలన్నారు. ఆరుసార్లు హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ గెలిచి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఈటలకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అన్నివర్గాల ప్రజలను మోసం చేస్తోందన్నారు. కేసీఆర్‌ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. కేసీఆర్‌ నోరుతెరిస్తే అన్ని అబద్ధాలనే పలుకుతున్నాడని విమర్శించారు. కేంద్రంలో మోదీ సర్కారు సంవత్సరానికి 2 కోట్ల కొత్త ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది యువతకు ఉన్న ఉద్యోగాలు పోగొట్టాడని విమర్శించారు. 

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల వల్లనే పెరిగాయని మండిపడ్డారు. భారతదేశం మొత్తం హుజూరాబాద్‌ ప్రజలు ఇచ్చే తీర్పు కోసం ఎదురు చూస్తోందన్నారు. బీజేపీకి ఓటువేస్తే పెరిగిన ధరలు సమర్థించినట్లుగా తప్పుడు సం కేతం పోతుందన్నారు. టీఆర్‌ఎ్‌సకు ఓటువేస్తే దోపిడీని సమర్థించినట్లు తప్పడు సందేశం పోతుందన్నారు. బీజేపీకి, టీఆర్‌ఎ్‌సకు ఉపఎన్నికలో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ ఎన్నికలో చేతి గుర్తుకు ఓటువేసి, కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట నర్సింగారావును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కేంద్ర మాజీమంత్రి బలరాంనాయక్‌, అజ్మతుల్లాఖాన్‌, ములుగు ఎమ్మెల్యే సీతక్క, నాయిని రాజేందర్‌రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, నమిండ్ల శ్రీనివాస్‌, బొమ్మనపల్లి అశోక్‌రెడ్డి, చరణ్‌పటేల్‌, రవీందర్‌, రమే్‌షగౌడ్‌, బిక్షపతి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.