రాష్ట్రంలో యూకే స్ట్రెయిన్‌!

ABN , First Publish Date - 2021-04-06T07:36:56+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎక్కడినుంచి.. ఎవరినుంచి సోకుతుందో తెలియనంతగా వైరస్‌ వ్యాప్తి ఉంది.

రాష్ట్రంలో యూకే స్ట్రెయిన్‌!

  • హైదరాబాద్‌లో ఓ ల్యాబ్‌లో గుర్తింపు
  • ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, 
  • ఫంక్షన్లు, విందు వినోదాలతో వ్యాప్తి
  • గుడ్‌ ఫ్రైడే ప్రార్థనల్లో 81 మందికి 
  • యాదాద్రిలో మరో 13 మందికి 
  • మంచిర్యాలలో తండ్రి, కొడుకు మృతి
  • 1,097 కొత్త కేసులు, ఆరుగురు మృతి
  • పెరుగుతున్న వెంటిలేటర్‌ రోగులు
  • గాంధీలో మరో 12 మంది మృతి
  • వెల్లడించిన మెడ్రిక్సివ్‌ జర్నల్‌
  • కరోనా వేగానికి కారణమిదేనా..?

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎక్కడినుంచి.. ఎవరినుంచి సోకుతుందో తెలియనంతగా వైరస్‌ వ్యాప్తి ఉంది. ఒక్కోచోట పదుల సంఖ్యలో పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. సెకండ్‌ వేవ్‌ ఇంత వేగంగా ఉండటానికి యూకే స్ట్రెయిన్‌ ఒక కారణమని తెలుస్తోంది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో 93 నమూనాలను పరీక్షించి, విశ్లేషించగా.. ఏకంగా 12 నమూనాల్లో యూకే స్ట్రెయిన్‌ను గుర్తించారు. ఈ విషయాన్ని మెడ్రిక్సివ్‌ జర్నల్‌ గత నెల 27వ తేదీన ప్రచురించింది. మరోవైపు యూకే స్ట్రెయిన్‌ వేగం 60 శాతం అధికమని పలు అధ్యయనాల్లో తేలింది. ఆర్‌నాట్‌ (వైరస్‌ పునరుత్పత్తి సంఖ్య) కూడా 20 శాతం ఎక్కువని వెల్లడైంది. ఈ నేపథ్యంలో వ్యాప్తి పెరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


వరుసగా వైరస్‌ ఔట్‌ బ్రేక్స్‌

హైదరాబాద్‌లోని వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయం ప్లానింగ్‌ సెక్షన్‌లో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. మరో సెక్షన్‌లో ఇద్దరికి కరోనా సోకింది. ఆ కార్యాలయంలో చాలామంది కొవిడ్‌ బారినపడ్డారు. మార్క్‌ఫెడ్‌ కార్యాలయంలో తొలుత ఇద్దరు అధికారులకు, అనంతరం వారి కుటుంబ సభ్యులు, పిల్లలకూ సోకింది. తదుపరి మరికొందరు సిబ్బందికి పాజిటివ్‌గా తేలింది. ఆబిడ్స్‌ ఎస్బీఐ కార్యాలయంలో ఒక్కసారిగా చాలామందికి వైరస్‌ నిర్ధారణ అయింది. నిజామాబాద్‌ జిల్లాల్లో ఇటీవల వివాహానికి హాజరైనవారిలో 40 మందికిపైగా కొవిడ్‌ బారినపడ్డారు.  రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఇటువంటి ‘‘వైరస్‌ ఔట్‌ బ్రేక్స్‌’’ భారీగా వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ఫంక్షన్లు, వారాంతాల్లో జరుపుకొనే పార్టీలతో పాటు యూకే స్ట్రెయిన్‌ వ్యాప్తి మొదలు కావడమేనని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా క్లోజ్డ్‌ స్పేస్‌లో, సిబ్బంది దగ్గరగా ఉంటూ పనిచేసే కార్యాలయ వాతావరణంలో  వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. క్లోజ్డ్‌ స్పేస్‌లో వైరస్‌ వ్యాప్తి నాలుగు రెట్లు ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బహిరంగ ప్రదేశాలతో పోల్చితే ఇలాంటిచోట వైరస్‌ లోడ్‌ కూడా ఎక్కువగా ఉన్నట్లు తేలింది.


సామూహిక కార్యక్రమాలతో..  

కరోనా ఫస్ట్‌ వేవ్‌కు భిన్నంగా సెకండ్‌ వేవ్‌ ఉంది. అప్పట్లో క్లోజ్డ్‌ సర్కిల్స్‌లో ఒకరికి వస్తే.. సన్నిహితంగా ఉన్నవారందరికీ వైరస్‌ సోకలేదు. కానీ ఇప్పుడు కార్యాలయాలు, ఫంక్షన్లు, విందు వినోదాల సందర్భంలో.. ఒకరికి వైరస్‌ ఉంటే 20-30 మందికి వ్యాపిస్తోంది. సామూహిక కార్యాక్రమాల ద్వారానే 30 శాతం ‘‘ఔట్‌ బ్రేక్‌’’లు వచ్చినట్లు స్పెయిన్‌లో చేసిన అధ్యయనంలో తేలింది. చైనాలో 308 చోట్ల ఔట్‌ బ్రేక్స్‌ నమోదైతే.. 80 శాతం క్లోజ్డ్‌ స్పేస్‌ వల్లే వచ్చినట్లు వెల్లడైంది. ప్రస్తుతం మనదగ్గర కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. 


జాగ్రత్తలతో అప్రమత్తంగా వ్యవహరించండి

వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండటానికి లోడ్‌ ఎక్కువగా ఉండటమే కారణమని వైద్య నిపుణులంటున్నారు. క్లోజ్డ్‌ స్పేస్‌లో పనిచేయాల్సి వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

తప్పించుకోలేని విధంగా ఎక్కువమంది ఉంటే ఆ గదికి వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలి.

అటువంటిచోట ఎక్కువ సమయం గడపకుండా ఉండాలి.

గుంపులుగా ఉన్నదగ్గర మాట్లాడాల్సి వస్తే మాస్క్‌ పెట్టుకోవాలి. వీలైతే భౌతిక దూరం పాటించాలి.


బాధితుల్లో అధికులు యువతే..

దేశంలో, రాష్ట్రంలో వైరస్‌ ఉధృతికి కొత్త స్ట్రెయిన్‌లే కారణమని చెప్పవచ్చు. కరోనా ఫస్ట్‌ వేవ్‌లో వ్యాప్తి రేటు ఒక శాతం ఉంటే, ప్రసుతం 6-10 రెట్లు ఉంది. అప్పుడు తీవ్ర స్థాయికి వెళ్లడానికి 4-5 నెలలు పడితే ఇప్పుడు 3 వారాల్లోనే అన్ని కేసులు వచ్చాయి. అంతేకాక యువత ఎక్కువగా వైరస్‌ బారినపడుతున్నారు. వారిలోనూ లక్షణాలు కనిపిస్తున్నవారు ఎక్కువగా ఉంటున్నారు. వైరస్‌ రూపాంతరం చెందింది అనేందుకు ఇది ఓ ఉదాహరణ.

                                                                                 డాక్టర్‌ బుర్రి రంగారెడ్డి, ప్రెసిడెంట్‌, 

ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా

Updated Date - 2021-04-06T07:36:56+05:30 IST