క్వారంటైన్ ఉల్లంఘిస్తే 1000 పౌండ్ల జరిమానా: బ్రిటన్ హెచ్చరిక

ABN , First Publish Date - 2020-09-30T02:52:29+05:30 IST

ఇంగ్లండ్‌లో రెండో దశ కరోనా వైరస్ వ్యాపి నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాప్తిని తగ్గించి వైరస్‌ను నియంత్రించేందుకు కఠిన చర్యలు

క్వారంటైన్ ఉల్లంఘిస్తే 1000 పౌండ్ల జరిమానా: బ్రిటన్ హెచ్చరిక

లండన్: ఇంగ్లండ్‌లో రెండో దశ కరోనా వైరస్ వ్యాపి నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాప్తిని తగ్గించి వైరస్‌ను నియంత్రించేందుకు కఠిన చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కరోనా బాధితులు క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే 1000 పౌండ్ల జరిమానా తప్పదని హెచ్చరించింది.


ఈ సరికొత్త నిబంధనలు నేటి (29) నుంచే అమల్లోకి రానున్నట్టు తెలిపింది. అలాగే, బార్లు, పబ్బులు, లౌడ్ స్పీకర్లలో మ్యూజిక్ వినడాన్ని నిషేధించింది. పాటలు పాడేందుకు కానీ, డ్యాన్స్ చేసేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. 


కరోనా సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు క్వారంటైన్‌కు వెళ్లకపోవడం ఇప్పుడు చట్టవిరుద్ధమని ప్రభుత్వం తెలిపింది. సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లకుండా తప్పించుకునేందుకు పాజిటివ్ రోగుల పేర్లను ఉద్దేశపూర్వకంగా చెప్పకుండా తప్పించుకోవాలనుకోవడం కూడా నేరమేనని పేర్కొంది.


నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) నిర్వహిస్తున్న ‘టెస్ట్ అండ్ ట్రేస్’లో వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన వారు బాధ్యత తీసుకుని సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లాలని సూచించింది. దీనిని ఉల్లంఘించిన వారికి 1000 పౌండ్ల జరిమానా తప్పదని హోంశాఖ కార్యదర్శి ప్రీతిపాటిల్  హెచ్చరించారు.


నిబంధనను ఉల్లంఘిస్తే నేరుగా పోలీసులే రంగంలోకి దిగి చట్టాన్ని అమలు చేస్తారని పేర్కొన్నారు. అలాగే, క్వారంటన్‌లో ఉండి ఉపాధి కోల్పోయిన వారికి ‘టెస్ట్ అండ్ ట్రేస్’ పథకంలో భాగంగా 500 పౌండ్ల ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.


Updated Date - 2020-09-30T02:52:29+05:30 IST