గుండెకు పుండు

ABN , First Publish Date - 2020-05-22T05:39:38+05:30 IST

దేశం కాలికి పుండు పడింది నడిచీ నడిచీ పుండు పడింది దేశం గదుల్లోనో, వూళ్ళలోనో ఇరుక్కుపోయిందంటున్నారు అది పచ్చి అబద్ధం...

గుండెకు పుండు

దేశం కాలికి పుండు పడింది

నడిచీ నడిచీ పుండు పడింది

దేశం గదుల్లోనో, వూళ్ళలోనో 

ఇరుక్కుపోయిందంటున్నారు

అది పచ్చి అబద్ధం

దేశం ఇంకా గూటి కోసం

            నడుస్తోంది

నెత్తిన తరాల బీదరికాన్నీ

చంకన మరో తరం 

      ఆకలినీ మోసుకెళ్తోంది


పట్టాల గీతలకూ, విశాల దారులకూ

ఆకలి గీతాన్ని అద్దుతూ

ఎదురయ్యే ఎండమావుల్లో 

ఇంటి దాహాన్ని తీర్చుకుంటోంది

ప్రగతి చక్రాల వీధులను

మురికి పాదాలతో ఊడుస్తూ

అప్రగతి ఆనవాళ్లు

బయటపెడుతోంది


ఇవి తిరిగే చక్రాలకు 

మాత్రమే దారులని

కదిలే కాళ్లకు తెలియదు

ఆకలితో పోరాటమూ,

నీడకై ఆరాటమూ

చట్టాల మడతల్లోని పరిచ్ఛేదనాల్ని

తొక్కుకుంటూ 

అడుగులు వేపిస్తోంది


పొట్ట పగిలిన రాజ్యాంగం

సమానత్వ ప్రకరణల్ని

వెతుక్కుంటోంది

***

మనిషిని అంతం చేసే రోగమేదో

కొంగులతో, తుండులతో

ముఖాల్ని కప్పేస్తూ 

నడిపిస్తోంది


మనిషి గుండెల్లో

ఏ క్రిమి జొరబడిందో ఏమో

దేశం గుండెకు పుండు పడింది సాక్ష్యంగా 

దేశం కాలికీ పుండు పడింది

శ్రీ వశిష్ఠ సోమేపల్లి

విజయపురి కాలనీ, గుంటూరు

Updated Date - 2020-05-22T05:39:38+05:30 IST