తేల్చని కేంద్రం!

ABN , First Publish Date - 2021-11-24T08:40:00+05:30 IST

బియ్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు ఢిల్లీ వచ్చిన రాష్ట్ర మంత్రులకు కేంద్రం నుంచి నిర్దిష్టమైన హామీ ఏదీ లభించలేదు.

తేల్చని కేంద్రం!

  • ఉప్పుడు బియ్యం తీసుకునేది లేదని మరోసారి స్పష్టీకరణ
  • వానా కాలం పంట సేకరణపై 26న తుది నిర్ణయమని వెల్లడి
  • అపాయింట్‌మెంట్‌ లేకుండానే కృషి భవన్‌కు కేటీఆర్‌ బృందం
  • నాలుగు గంటలపాటు అక్కడే నిరీక్షణ.. పలుమార్లు పీయూష్‌కు ఫోన్‌
  • అపాయింట్‌మెంట్‌ ఖరారు కాకుండా ఎందుకు వచ్చారన్న కేంద్ర మంత్రి
  • చివరకు, రాత్రి ఏడు గంటల సమయంలో కేటీఆర్‌ బృందంతో భేటీ
  • వంద లక్షల టన్నులకుపైగా బియ్యం కొనాలని విన్నవించిన కేటీఆర్‌
  • ఉప్పుడు బియ్యం చరిత్ర ఇక కనుమరుగంటూ సీఎంవో ప్రకటన
  • వార్షిక టార్గెట్‌పై కేసీఆర్‌ డిమాండ్‌కు అభినందన దక్కిందని వ్యాఖ్య


న్యూఢిల్లీ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): బియ్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు ఢిల్లీ వచ్చిన రాష్ట్ర మంత్రులకు కేంద్రం నుంచి నిర్దిష్టమైన హామీ ఏదీ లభించలేదు. ఇకపై ఉప్పుడు బియ్యం కొనేది లేదని మరోసారి కరాఖండిగా తేల్చి చెప్పింది. వానాకాలం పంటలో ఎంత కొంటామనే విషయంపై ఎటూ తేల్చలేదు. రెండు సీజన్లలో కలిపి 100-120 లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా బియ్యం భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై ఈనెల 26న మరోసారి సమావేశమై కోటాపై తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రితో సమావేశం ముగిసిన తర్వాత కేటీఆర్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మీడియాతో మాట్లాడకుండా నిష్క్రమించడం గమనార్హం. సమావేశపు వివరాలను తాము సీఎం కేసీఆర్‌కు వివరించిన తర్వాత మీడియాతో మాట్లాడతామని కేటీఆర్‌ తెలిపారు. కాగా, మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలుసుకోవడానికి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యాలయమైన కృషి భవన్లో మంత్రి కేటీఆర్‌ బృందం నాలుగు గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఇందుకు కారణం.. 


అపాయింట్‌మెంట్‌ లేకుండా రావడమే! మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కృషి భవన్‌కు వచ్చిన మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, ఎంపీలు కే కేశవ రావు, నామా నాగేశ్వర రావు తదితరులు రాత్రి 7 గంటలకు గానీ పీయూష్‌ గోయల్‌ను కలుసుకోలేకపోయారు. తొలుత పీయూష్‌ గోయల్‌ అపాయింట్‌మెంట్‌ కోరగా.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మంత్రి అందుబాటులో ఉంటారని మంత్రి కార్యాలయ వర్గాలు కేటీఆర్‌కు సమాచారం ఇచ్చాయి. అయినా, నిర్దిష్టమైన సమయానికి అపాయింట్‌మెంట్‌ ఖరారు కాలేదు. కేంద్ర మంత్రి కార్యాలయానికి వెళ్లి కూర్చుంటే కేంద్రంపై కొంత ఒత్తిడి పెరుగుతుందన్న ఉద్దేశంతో వచ్చామని టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పారు. ఇందులో భాగంగానే, కేటీఆర్‌ బృందం కేంద్ర ఆహార శాఖకు చెందిన పలువురు అధికారులతో సమావేశమైంది. ఆ సమయంలో 25 నిమిషాలపాటు బియ్యం కొనుగోలుపై అధికారులకు కేటీఆర్‌ వివరించారు. అనంతరం, అమెరికా వర్తక ప్రతినిధుల బృందంతో చర్చల్లో తలమునకలై ఉన్న పీయూష్‌ గోయల్‌కు కేటీఆర్‌ పలు సార్లు ఫోన్‌ చేయాల్సి వచ్చింది. మొదటిసారి ఫోన్‌ చేసినప్పుడు.. ‘అపాయింట్‌మెంట్‌ ఖరారు కాకుండా ఎందుకు వచ్చారు? నేను కార్యాలయానికి వచ్చిన తర్వాత మీకు సమాచారం ఇస్తానని చెప్పాను కదా!’’ అని పీయూష్‌ అన్నట్లు సమాచారం. 


రెండోసారి ఫోన్‌ చేసినప్పుడు అరగంటలో వస్తానని సమాధానం ఇచ్చారు. చివరికి, సాయంత్రం 6.45గంటలకు కేటీఆర్‌ బృందంతో పీయూష్‌ సమావేశమయ్యారు. రాత్రి 7.50 గంటలకు వీరి భేటీ ముగిసింది. సమావేశం మఽధ్యలో ఒకసారి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌తో పీయూష్‌, కేటీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. సమావేశం ముగిసిన తర్వాత అదే కార్యాలయంలో ఉన్న తోమర్‌ను ఇద్దరూ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం, అర్ధరాత్రి సమయంలో సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసిం ది. ‘‘రాష్ట్రంలో ఇప్పటికే సాగైన వానాకాలం ధాన్యం కొనుగోలు చేయాలని, రానున్న యాసంగి కొనుగోలుపై ముందుగానే స్పష్టత ఇవ్వాలని కేంద్ర మంత్రులను కేటీఆర్‌ బృందం కోరింది. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించింది. అయినా, కేంద్రం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. వచ్చే యాసంగిలో ఉప్పుడు బియ్యం కొనేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పింది. ముడి బియ్యాన్ని ఎంత కొంటామనే విషయాన్ని 26న స్పష్టం చేస్తామని వివరించింది. 


సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ మేరకు ధాన్యం కొనుగోలు పరిమితిని మరింతగా పెంచుతామని మాత్రం హామీ ఇచ్చింది’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఏటా వార్షిక ధాన్యం కొనుగోలు టార్గెట్‌ను ముందుగానే వెల్లడించాలన్న కేసీఆర్‌ డిమాండ్‌కు కేంద్రం సానుకూలంగా స్పందించిందని, ఇది దేశ రైతాంగానికి అంతటికీ వర్తింపజేయాల్సిన విలువైన సూచనగా అభినందించిందని తెలిపింది. ఇకనుంచి వార్షిక ధాన్యం కొనుగోలు వివరాలను ముందుగానే ప్రకటిస్తామని, వచ్చే ఏడాది నుంచే దీనిని అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపింది. నూతన విధానాన్ని ఒక్క తెలంగాణకే కాకుండా అన్ని రాష్ట్రాలకూ వర్తింపజేస్తామని కేంద్రం తెలిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇచ్చే వరకూ రాష్ట్ర రైతాంగం యాసంగి విషయంలో వేచి చూడాలని ఆ ప్రకటనలో ప్రభుత్వం అభిప్రాయపడింది. ఉప్పుడు బియ్యం ఒక చరిత్రలో కనుమరుగు కాబోతోందని తెలిపింది. రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణంపైనా కేంద్రం స్పష్టతకు వచ్చిందని, 62.13 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తుంటే, 58.66 లక్షల ఎకరాలుగా కేంద్రం ధ్రువీకరించిందని ఆ ప్రకటనలో ప్రభుత్వం వివరించింది.


మూడు వినతులతో..

గత ఏడాది మిగిలిన 5.25 లక్షల టన్నుల పారా బాయిల్డ్‌ బియ్యాన్ని సేకరించాలని, ఈ ఏడాది రాష్ట్రంలో ఉత్పత్తి కాను న్న ధాన్యంలో 90ు సేకరించడంతోపాటు మొత్తం ఏడాది కోటా ఒకేసారి ఖరారు చేయాలన్న మూ డు వినతులతో కేటీఆర్‌ బృందం కేంద్ర మంత్రిని కలిసింది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 40 లక్షల టన్నులే కాకుండా పంజాబ్‌ తరహాలో ఉత్పత్తి అవుతున్న దాంట్లో 90ు బియ్యాన్ని సేకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా సీజన్లకు కనీస మద్దతు ధరలు ప్రకటిస్తున్న విధంగా ఏడాది ముందే సేకరించే బియ్యం కోటాను ఖరారు చేయాలని ప్రతిపాదించారు.


రైల్వే రాయితీలను పునరుద్ధరించాలి: కేటీఆర్‌ 

హైదరాబాద్‌:  కరోనా కారణంగా రైళ్లలో సీనియర్‌ సిటిజన్లకు తొలగించిన రాయితీలను వెంటనే పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్‌ కోరారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైన మార్చి-2020 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4కోట్ల మంది సీనియర్‌ సిటిజన్లు ప్రయాణ రాయితీ కోల్పోయారన్న విషయం మంగళవారం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. 

Updated Date - 2021-11-24T08:40:00+05:30 IST