ప్రోత్సాహకం ఏదీ?

ABN , First Publish Date - 2021-10-10T06:04:29+05:30 IST

గ్రామం మొత్తం ఏకమై ఒక్కరిని సర్పంచ్‌గా ఎన్నుకుంటే ఆ పంచాయతీకి ప్రోత్సాహక నిధులు ఇస్తామని ప్రజా ప్రతినిధులు ప్రకటించారు. స్నేహపూరితమైన వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరగాలని ప్రభుత్వాలు ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నాయి.

ప్రోత్సాహకం ఏదీ?
గ్రామ పంచాయతీ

- ఏకగ్రీవ పంచాయతీలకు అందని నిధులు 

- జిల్లాలో 41 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

- ప్రోత్సాహకం కింద రావాల్సినవి రూ.4.10 కోట్లు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

గ్రామం మొత్తం ఏకమై ఒక్కరిని సర్పంచ్‌గా ఎన్నుకుంటే ఆ పంచాయతీకి ప్రోత్సాహక నిధులు ఇస్తామని ప్రజా ప్రతినిధులు ప్రకటించారు. స్నేహపూరితమైన వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరగాలని ప్రభుత్వాలు ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నాయి. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహక నిధులు ఇస్తామనే ప్రకటనతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా 253 గ్రామ పంచాయతీలకు మూడు విడుతలుగా నిర్వహించిన ఎన్నికల్లో 41 గ్రామ పంచాయతీలు ఎకగ్రీవం అయ్యాయి. ఎకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు మంత్రి కేటీఆర్‌ తన నియోజకవర్గ నిధుల నుంచి రూ.15 లక్షలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆర్థిక సంఘం నిధులతో పల్లెల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఏదో సమయంలో నిధులు విడుదల అవుతాయని ఎకగ్రీవ పంచాయతీ పాలకవర్గాలు రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇటీవల పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రోత్సాహక నిధులపై శాసనసభలో చేసిన ప్రకటనతో నిధుల పట్ల అయోమయం ఏర్పడింది.  రాజకీయాలకు అతీతంగా విభేదాలను పక్కనపెట్టి ఎకగ్రీవంగా ఏర్పడిన పాలకవర్గాలకు నిరాశే ఎదురైంది. పంచాయతీల నిధులు సరిపోక నిర్వహణ వ్యయంతో సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారు.

నిధుల కోసం ఎదురు చూపులు

జిల్లాలో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలు 41 ఉండగా ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.4.10 కోట్లు రావాల్సి ఉంది. గతంలో ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం రూ. 7 లక్షలు అందజేస్తే దీనిని తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. సిరిసిల్ల నియోజకవర్గంలో 18 ఎకగ్రీవ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీనికి అదనంగా ఎమ్మెల్యే నిధులు కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే నిధుల కేటాయింపులు కొంత మేరకు అశాజనకంగానే ఉన్నా రూ.10 లక్షల నిధుల కోసం ఎదురు చూడక తప్పడం లేదు. నిధులు వస్తాయని నమ్మకంతో సర్పంచ్‌లు వివిధ పనులు చేస్తున్నారు. మరో వైపు సీసీ రోడ్డు, వైకుంఠధామాలు, పకృతి వనాలు, డంపిగ్‌ యార్డులు, ఇతర అభివృద్ధి పనులకు సర్పంచ్‌లు అప్పులు చేసి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. 

ఏకగ్రీవ పంచాయతీలు ఇవే

సిరిసిల్ల జిల్లాలో ఏకగ్రీవ పంచాయతీల్ల్లో బోయినపల్లి మండలంలో కోరెం, చందుర్తి మండలంలో దేవునితండా, కట్టలింగంపేట, కొత్తపేట, ఇల్లంతకుంట మండలంలో చిక్కుడువానిపల్లె, గుండెపల్లి, కిష్టారావుపల్లి, పెద్దలింగాపూర్‌, రామోజీపేట, సోమారంపేట, గంభీరావుపేట మండలంలో లక్ష్మీపూర్‌, రాజుపేట, పొన్నాలపల్లి, కోనరావుపేట మండలంలో అజ్మీర తండా, గోవిందరావుపేట తండా, జై సేవాలాల్‌ భూక్య తండా, జై సేవాలాల్‌ ఊరు తండా, కమ్మరిపేట తండా, ముస్తాబాద్‌ మండలంలో గన్నవానిపల్లె, రుద్రంగి మండలంలో అడ్డబోరు తండా, బడి తండా, చింతమాని తండా, డేగావత్‌ తండా, రూపులానాయక్‌ తండా, సర్పంచ్‌ తండా, వీరుని తండా, తంగళ్లపల్లి మండలంలో చింతల్‌ఠాణా, నర్సింహూలపల్లె, వీర్నపల్లి మండలంలో మద్దిమల్ల తండా బాబాయి చెరువు తండా, భూక్య తండా, లాల్‌ సింగ్‌ తండా, శాంతినగర్‌, ఎర్రగడ్డతండా, వేములవాడ రూరల్‌ మండలంలో తుర్కాశినగర్‌, ఎల్లారెడ్డిపేట మండలంలో బుగ్గ రాజేశ్వర్‌ తండా, గుంటపల్లి చెరువు తండా, దేవుని గుట్ట తండా, అగ్రహారం, హరిదాస్‌నగర్‌, గ్రామ పంచాయతీలు పూర్తి పాలకవర్గంతో సహా ఏకగ్రీవమై ప్రోత్సాహకానికి అర్హతగా నిలిచాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిధులు విడుదల చేయాలని ఏకగ్రీవ సర్పంచ్‌లు కోరుతున్నారు.

Updated Date - 2021-10-10T06:04:29+05:30 IST