చీకటి పడిందా.. కట్‌!

ABN , First Publish Date - 2021-10-12T04:27:39+05:30 IST

జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో చీకటి పడితే చాలు అత్యవసరం పేరుతో అప్రకటిత విద్యుత్‌ కోతలు విధించేస్తున్నారు. నిత్యం సాయంత్రం 6 గంటల నుంచి 7.30 వరకు సరఫరా నిలిపివేస్తున్నారు. శుక్రవారం ఏకంగా రాత్రి 8 నుంచి 12 గంటల వరకు సరఫరా నిలిపివేయడంతో జనం అవస్థలు పడ్డారు.

చీకటి పడిందా.. కట్‌!
ఈదుపురంలోని సబ్‌ స్టేషన్‌

- పల్లెల్లో అప్రకటిత విద్యుత్‌ కోతలు

- అవస్థలు పడుతున్న ప్రజలు

(ఇచ్ఛాపురం రూరల్‌)

జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో చీకటి పడితే చాలు అత్యవసరం పేరుతో అప్రకటిత విద్యుత్‌ కోతలు విధించేస్తున్నారు. నిత్యం సాయంత్రం 6 గంటల నుంచి 7.30 వరకు సరఫరా నిలిపివేస్తున్నారు. శుక్రవారం ఏకంగా రాత్రి 8 నుంచి 12 గంటల వరకు సరఫరా నిలిపివేయడంతో జనం అవస్థలు పడ్డారు. సాధారణంగా వేసవిలో విద్యుత్‌ వాడకం ఎక్కువ. ప్రస్తుతం వర్షాకాలమైనా.. పగటి పూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. దీంతో వినియోగం ఎక్కువవుతోంది.  డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి లేక అత్యవసర లోడ్‌ ఉపశమనం(ఈఎల్‌ఆర్‌) పేరుతో కేంద్ర కార్యాలయం నుంచే కోతలు విధించాలని ఆదేశాలొస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఇంజినీర్లు, సిబ్బందికి సైతం ఎలాంటి సమాచారం ఉండటం లేదు. ఒకవైపు డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు విజృంభిస్తుండటం, మరోవైపు దోమల బెడదతో రాత్రివేళ జనం బెంబేలెత్తుతున్నారు.  

ఇతర రంగాలపై ప్రభావం 

జిల్లావ్యాప్తంగా 7.67 లక్షల గృహవిద్యుత్‌ కనెక్షన్లు, 82 వేల వాణిజ్య కనెక్షన్లు, మరో 27 వేల వ్యవసాయ సర్వీసులు ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్లకు కొన్ని ప్రాంతాల్లో ఉదయం 5.45 నుంచి 2.45 గంటల వరకు, మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం 8.45 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు 9 గంటలపాటు నిరంతర సరఫరా అందించాలి. ప్రస్తుతం వరి, కూరగాయలు ఇతర పంటలకు నీటి తడి అందించాలి. కానీ విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేకపోవడంతో సాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యుత్‌ కోతలతో వ్యాపారాలు కూడా సన్నగిల్లుతున్నాయని వ్యాపారవేత్తలు పేర్కొంటున్నారు. 

ఎందుకిలా..

ఇటీవల కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడటంతో ఉష్టోగ్రతలు తగ్గుముఖం పట్టి విద్యుత్‌ వాడకం కూడా తగ్గింది. కానీ గత 15 రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వెంటనే ఽథర్మల్‌, జల విద్యుత్‌ కేంద్రాలు ఆపరేట్‌ చేసే పరిస్థితి లేనందున అత్యవసరం పేరిట కోతలు తప్పడం లేదు. జిల్లావ్యాప్తంగా ఈఎల్‌ఆర్‌ అమలు చేస్తుండటంతో గ్రామీణ ప్రాంతాలకు కూడా రాత్రి సమయంలో గంట నుంచి మూడు గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నారు. జిల్లాలో ఏప్రిల్‌, మే నెలల్లో రోజుకు అత్యధికంగా 4 మిలియన్‌ యూనిట్లు వినియోగం జరిగింది. ప్రస్తుతం 5 మిలియన్‌ యూనిట్లు వినియోగిస్తున్నారు. ఉత్పత్తి కూడా తగ్గడంతో సమస్య నెలకొందని విద్యుత్‌ శాఖాధికారులు చెబుతున్నారు.  

వినియోగం పెరగడం వల్లనే: 

జిల్లాలో ప్రస్తుతం విద్యుత్తు ఉత్పత్తి కంటే వినియోగం ఎక్కువగా ఉండటంతో గ్రిడ్‌లలో అంతరాయం వల్ల పై నుంచి సరఫరా ఆగుతోంది. మరో నాలుగు, ఐదు రోజుల్లో సమస్య తీరనుంది.

- ఎల్‌.మహేంద్రనాథ్‌, విద్యుత్‌ ఎస్‌ఈ, శ్రీకాకుళం


Updated Date - 2021-10-12T04:27:39+05:30 IST