అనుమతి లేని గృహాలు..అక్రమ లే అవుట్లు

ABN , First Publish Date - 2020-09-19T05:30:00+05:30 IST

రోజురోజుకు విస్తరిస్తున్న జగిత్యాల పట్టణంలో ఓవైపు అనుమతి లేని గృహ నిర్మాణాలు, మరోవైపు అక్రమ లే అవుట్లు వెరసి జగిత్యాల

అనుమతి లేని గృహాలు..అక్రమ లే అవుట్లు

రహదారులు ఆక్రమించుకుని నిర్మాణాలు

సెట్‌బ్యాక్‌ లేకుండా కట్టడాలు

వర్షాలకు నీట మునుగుతున్న కాలనీలు


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: రోజురోజుకు విస్తరిస్తున్న జగిత్యాల పట్టణంలో ఓవైపు అనుమతి లేని గృహ నిర్మాణాలు, మరోవైపు అక్రమ లే అవుట్లు వెరసి జగిత్యాల జిల్లా కేంద్రంలో కొద్దిపాటి వర్షానికి ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. శివారు ప్రాంతాలు విస్తరిస్తుండగా, కొత్త గృహ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అయితే అనుమతి లేకుండానే నిర్మాణాలు చేపడుతూ ఉండగా కొందరు సెట్‌బ్యాక్‌ నిర్మాణాలు చేపడుతుండగా మరికొందరు దర్జాగా రహదారులు ఆక్రమించుకునే కట్టడాలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు పట్టణంలో భవన నిర్మాణాల తీరును పరిశీలించాల్సిన అధికారులు మామూలుగా తీసుకోవడం, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లా కేంద్రమైన జగిత్యాలలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.


అనుమతి లేకుండా దాదాపు ఏడు వేల గృహాలు

జిల్లా కేంద్రమైన జగిత్యాలలో మాస్టర్‌ ప్లాన్‌ అమలు కాకపోగా, శివారు ప్రాంతాల్లో విచ్చలవిడిగా నిర్మాణాలు చేపడుతున్నారు. గోవిందుపల్లె, ధరూర్‌, కృష్ణానగర్‌, హౌసింగ్‌ బోర్డు, తిప్పన్నపేట, శంకులపల్లె, గొల్లపల్లి రోడ్డు ఇలా ఒక్కటేమిటి చాలా చోట్ల అనుమతులు లేకుండానే గృహ నిర్మాణాలు సాగుతున్నాయి. బలం ఉన్నోడిదే రాజ్యం అన్నట్లు కొందరు కౌన్సిలర్లు బిల్డర్‌లుగా అవతారమెత్తగా, ఓ కౌన్సిలర్‌ భర్త అయితే ఏకంగా రోడ్డు ఆక్రమించుకుని భవన నిర్మాణం చేపట్టారు. అధికార పార్టీ నేతలు కావడంతో అధికారులు చేసేదేమీ లేక నిమ్మకుండిపోతున్నారు. కొత్తగా నిర్మిస్తున్న కాలనీల్లో కనీసం కొందరు 20 ఫీట్ల రోడ్డు కూడా పెట్టడం లేదు. ఇంకొందరు 18 ఫీట్లు, మరికొందరు 15 ఫీట్లు రోడ్డు ఉంచి నిర్మాణాలు చేస్తున్నారు. వాటికి కూడా రోడ్లు, మురికి కాలువలు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జగిత్యాల పట్టణంలో 19,850 గృహాలకు అనుమతి ఉంది. అలాగే ఇటీవల కొన్ని శివారు ప్రాంతాలు బల్దియాలో విలీనం కాగా, దీంతో మొత్తం అనుమతి ఉన్న గృహాల సంఖ్య 21,100లకు చేరుకుంది. దాదాపు అనుమతి లేకుండా 5 వేల నుంచి 7 వేల వరకు గృహాలు ఉంటాయి. వీటిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. శివారు ప్రాంతాల్లో ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో వారు గృహ నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.


పట్టించుకోని అధికారులు

జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నిర్మాణాలు సాగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో బిల్డర్లు, ఇంటి నిర్మాణదారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల క్రితం జగిత్యాలలో భారీ వర్షం కురియగా, గోవిందుపల్లె శివారు ప్రాంతం పూర్తిగా జలమయమైంది. ఇళ్లల్లోకి నీరు చేరి ఇంటి ముందు పెట్టిన కార్లు వర్షానికి కొట్టుకుపోయాయి. పశువులు కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం అక్రమ లే అవుట్లు, అనధికార గృహ నిర్మాణాలు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు రోడ్లను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు. ఇంకొందరు సెట్‌బ్యాక్‌ లేకుండానే నిర్మాణాలు చేపట్టారు. వీటిపై బల్దియా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు చేపడితే రానున్న రోజుల్లో జగిత్యాల బల్దియాలో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 


అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం..బోగ శ్రావణి, చైర్‌ పర్సన్‌, జగిత్యాల

జగిత్యాల పట్టణం రోజురోజుకు విస్తరిస్తోంది. కొన్ని చోట్ల అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరిగాయి. మరికొన్ని చోట్ల నాలాలు కనబడకుండాపోయాయి. వాటన్నింటినీ తొలగిస్తాం. అనుమతి లేని నిర్మాణాల జాబితా రూపొందిస్తున్నాం. వారంతా ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టుకుని క్రమబద్ధీకరించుకోవాలి. లేదంటే చర్యలు తప్పవు.

Updated Date - 2020-09-19T05:30:00+05:30 IST