అందుబాటులో లేని ఈ-శ్రమ్‌

ABN , First Publish Date - 2021-10-22T06:06:52+05:30 IST

దేశవ్యాప్తంగా ఉన్న అసం ఘటిత రంగ కార్మికులకు ప్రత్యేక డేటా బేస్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్‌ వెబ్‌పోర్టల్‌ ను ఆగస్టు 26న ప్రారంభించింది.

అందుబాటులో లేని ఈ-శ్రమ్‌
జిల్లా కార్మిక శాఖ కార్యాలయం

- అసంఘటిత కార్మికుల కోసం వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం

- ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 2 లక్షల ఉచిత బీమా

- రెండు నెలలైనా అవగాహన కల్పించని కార్మికశాఖ

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

దేశవ్యాప్తంగా ఉన్న అసం ఘటిత రంగ కార్మికులకు ప్రత్యేక డేటా బేస్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్‌ వెబ్‌పోర్టల్‌ ను ఆగస్టు 26న ప్రారంభించింది. దీనిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాల్సిన కార్మికశాఖ పూర్తిస్థాయి లో స్పందించడంలేదు. పోర్టల్‌ను ప్రారంభించి దాదా పు రెండు నెలలు కావస్తున్నా జిల్లాలో రిజిస్ట్రేషన్లు అంతంత మాత్రంగానే జరిగాయి. పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతం, వ్యవసాయిక ప్రాంతం కావ డంతో అనేక మంది కార్మికులు, అసంఘటిత కార్మి కులు పెద్దమొత్తంలో జీవిస్తున్నారు. ఈ-శ్రమ్‌ పోర్ట ల్‌ ద్వారా ఇప్పటివరకు కేవలం 1,881 మంది మాత్ర మే నమోదు చేసుకున్నారు. దీనిపై కార్మికశాఖ అవ గాహన కార్యక్రమాలు నిర్వహించని కారణంగా ఈ పథకం గురించి అసంఘటిత కార్మికులకు తెలియ కుండాపోతున్నది. ఇప్పటికైనా సంబంధిత శాఖ వారు తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ పోర్టల్‌ ద్వారా నమోదు చేసుకునే అసంఘ టిత కార్మికులకు ప్రభుత్వపరంగా పలు ప్రయోజనా లను కల్పించనున్నది. ప్రమాదవశాత్తు మరణించే వారికి, శాశ్వతంగా అంగవైకల్యం పొందిన వారికి రూ.2లక్షల బీమా సహాయాన్ని అందించడంతో పాటు అంగవైకల్యం పొందిన వారికి రూ.లక్ష సహా యాన్ని అందించనున్నారు. ఇతరత్రా ప్రయోజనాలు కూడా కల్పించనున్నారు. ఈ-శ్రమ్‌ వెబ్‌ పోర్టల్‌ ద్వారా ఎలాంటి రుసుంలు చెల్లించకుండానే ఉచితం గానే రిజిష్టర్‌ చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ కల్పించింది. దేశ వ్యాప్తంగా డిసెంబర్‌ 31 నాటికి 38 కోట్ల మంది కార్మికులను ఇందులో చేర్చాలని లక్ష్యం గా పెట్టుకున్నది. 

అసంఘటిత కార్మికులు ఎవరంటే...

- వ్యవసాయ అనుబంధ విభాగాల్లో ఉపాధి పొందే చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యానాలు, నర్సరీలు, పాడి పరిశ్రమలపై ఆధారపడి బతికేవారు. ఉమ్మడి వ్యవసాయదారులు, మత్స్యకారులు.

- భవన, ఇతర నిర్మాణ రంగాల్లో పనిచేసే తాపీ, తవ్వకం, రాళ్లు కొట్టే పని, సెంట్రింగ్‌, రాడ్‌ బెండింగ్‌, ప్లంబింగ్‌, కార్పెంటర్‌, శానిటరీ, పెయింటింగ్‌, టైల్స్‌ పని, ఎలక్ర్టిషీయన్‌, వెల్డింగ్‌, ఇటుక, సున్నం బట్టీల కార్మికులు, రిగ్గర్లు, కాంక్ట్రీట్‌ మిక్సర్‌, బావుల తవ్వకం, పూడికతీత వంటి పనులు చేసే వారు.

- టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ, డ్రెస్‌ మేకర్స్‌, ఆటోమొబైల్‌, రవాణా రంగాల్లో పనిచేసే డ్రైవర్లు, హెల్పర్లు, చేనేత, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరి, క్షౌరవృత్తి, బ్యూటీ పార్లర్లలో పని చేసే వారు, చర్మకారులు, రజకులు

- స్వయం ఉపాధి పొందే వీధి, తోపుడు బళ్ల వ్యాపారులు, ఇంటి వద్ద వస్తువులు తయారు చేసేవారు. చిరు వ్యాపారులు, కల్లు గీత కార్మికులు, కళాకారులు, రిక్షా కార్మికులు, బీడీ కార్మికులు, చెత్త ఏరే వారు.

- సేవా రంగంలో ఉండే వారిలో ఇళ్లలో పాచి పనులు చేసే వారు, కొరియర్‌ బాయ్స్‌, ఇంటి వద్ద రోగులకు సేవలందించే వారు. కమిషన్‌ మీద వస్తువులు సరఫరా చేసే వారు.

- ఉపాధి కూలీలు, ఆశా కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాలు, అంగన్‌వాడీ ఆయాలు, టీచర్లు, మధ్యాహ్నా భోజన వర్కర్లు, విద్యావాలంటీర్లు, గ్రామ, వార్డు వాలంటీర్లు.

- హమాలీలు, దుకాణాలు, ఇతర సంస్థల్లో పని చేసేవారు. ఆహార పరిశ్రమ, బేకరి, పాల ఉత్పత్తులు, ఫాస్ట్‌ఫుడ్‌ తయారీదారులు, వలస కార్మికులు.

ఎవరెవరు అర్హులంటే..

తప్పనిసరిగా పైన పేర్కొన్న అసంఘటిత రంగంలో కార్మికులై ఉండి 16 నుంచి 59 సంవత్సరాలలోపు వయసున్న వారు ఇందులో చేరవచ్చు. ఆదాయ పన్ను చెల్లించని వారు, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సదుపాయాలు పొందుతున్న వాళ్లు అనర్హులు.

ఎక్కడ, ఎలా నమోదు చేసుకోవాలి...

 సమీప మీ సేవా కేంద్రాలు, గ్రామల్లోగల కామన్‌ సర్వీస్‌ సెంటర్లు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, కార్మిక కార్యాలయాల్లో నమోదు చేసుకోవచ్చు. సొంతంగా కూడా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వెంటనే యూఏఎన్‌తో కూడిన ఈ-శ్రమ్‌ కార్డు జారీ చేస్తారు. ఈ-కేవైసీ కలిగిన ఆధార్‌ కార్డు, ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్‌ నంబర్‌, బ్యాంకు ఖాతా, దాని ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లతో నమోదు కేంద్రాలకు వెళ్లాలి. ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దాని ద్వారా నమోదు చేసుకోవాలి. ఫోన్‌ నంబర్‌ లేని వారు బయోమెట్రిక్‌ వేలిముద్ర/ ఐరిస్‌ స్కానింగ్‌ ద్వారా నమోదు చేయించుకోవచ్చు.

ఇవీ ప్రయోజనాలు..

- ఈ-శ్రమ్‌లో చేరిన ప్రతి కార్మికుడికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు నంబర్‌ (యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌-యూఏఎన్‌) ఇస్తారు. ఈ కార్డులుంటేనే ప్రభుత్వ సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు వర్తిస్తాయి.

- ఇప్పటి వరకు కొన్ని పథకాలు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తున్నాయి. ఆ కుటుంబంలో అదనంగా ఒకరిద్దరు అసంఘటిత రంగ కార్మికులుంటే నష్టపోతున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఇందులో నమోదైన ప్రతి కార్మికుడికి ఒక ఏడాది పాటు ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కింద ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వతంగా అంగవైకల్యం పొందినా రూ.2లక్షల బీమా వర్తిస్తుంది. అంగవైకల్యం పొందితే లక్ష రూపాయల వరకు బీమా ఉచితంగా వర్తిస్తుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు, కరోనా వంటి పాండమిక్‌ వచ్చినప్పుడు కొంత సహాయాన్ని అందించనున్నారు. దీని ద్వారా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సి అవసరం లేదని కార్మిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. 

Updated Date - 2021-10-22T06:06:52+05:30 IST