కేఎల్‌ఐ లిఫ్టునకు తప్పనున్న ముప్పు

ABN , First Publish Date - 2021-04-11T08:14:59+05:30 IST

నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలం ఎల్లూరులోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్టులో తలెత్తే ఇబ్బందులను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో ఇరిగేషన్‌ శాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.

కేఎల్‌ఐ లిఫ్టునకు తప్పనున్న ముప్పు

  • అప్రోచ్‌ కెనాల్‌ వద్ద షట్టర్‌ బిగింపునకు ప్రభుత్వం నిర్ణయం.. 
  • వర్షాకాలంలోగా పనులు పూర్తి చేయాలని కేసీఆర్‌ ఆదేశం

నాగర్‌కర్నూల్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలం ఎల్లూరులోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్టులో తలెత్తే ఇబ్బందులను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో ఇరిగేషన్‌ శాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. కృష్ణానది ఎగువ పరీవాహక ప్రాం తంలో వరదలు వచ్చినప్పుడల్లా కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్‌ (కేఎల్‌ఐ)లో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో శాశ్వత ప్రాతిపదికన సమస్యకు ముగింపు పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రస్తుతం దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఎ లాంటి సమస్యలు ఉత్పన్నమైనా ఆ ప్రభావం వ్యవసా య రంగంతో పాటు మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరాపై పడుతున్న విషయం తెలిసిందే. 


2014 అక్టోబరు 2న మొదటి లిఫ్టులో వరద నీరు చేరి ఐదు మోటార్లు నీట మునగడంతో కోట్ల రూపాయల నష్టం సంభవించింది. నిరుడు అక్టోబరు 16న కూడా ఇదే సమస్య తలెత్తింది. కేఎల్‌ఐ నిర్మాణం సమయంలోనే అప్రోచ్‌ కెనాల్‌ వద్ద సెట్టర్‌ బిగించాలని ఇంజనీరింగ్‌ అధికారులు చేసి న సూచనలను కాంట్రాక్టర్లు పెడచెవిన పెట్టిన కారణంగానే రెండుసార్లు పంపుహౌస్‌ మునిగి కోట్ల రూపాయల వృథా కావడంతో పాటు పంటలు ఎండిపోయా యి. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసిన అధికారులు అప్రోచ్‌ కెనాల్‌లో షట్ట ర్‌ బిగింపు ద్వారానే ముంపు సమస్యను అధిగమించవచ్చని ప్రభుత్వానికి సూచించారు. దీంతో దాదాపు రూ. 25 కోట్ల అంచనా వ్యయంతో షట్టర్‌ బిగించేందుకు అ ధికారులు సమాయత్తమవుతున్నారు. వర్షాకాలం లోగా పనులు పూర్తిచేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అయితే ఏడు జిల్లాలకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా చేసే గ్రిడ్‌ ఎల్లూరులో ఉండడంతో షట్టర్‌ బిగింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ కాలువ ద్వారా కృష్ణా జలాలను ఎల్లూరు రిజర్వాయర్‌కు తరలించేందుకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు.

Updated Date - 2021-04-11T08:14:59+05:30 IST