అనిశ్చితీ - చింత

ABN , First Publish Date - 2020-08-03T06:00:17+05:30 IST

కొన్ని క్షణాలకి రెక్కలొచ్చి యెటో వొక వైపు యెగిరి పోకూడదని ప్రతినరమ్మీదా పేపర్‌వెయిట్‌ లాంటిదేదో అదిమి పెట్టి వుంచేస్తా...

అనిశ్చితీ - చింత

1

యి కొన్ని క్షణాలకి రెక్కలొచ్చి యెటో వొక వైపు యెగిరి పోకూడదని ప్రతినరమ్మీదా పేపర్‌వెయిట్‌ లాంటిదేదో అదిమి పెట్టి వుంచేస్తా. ఆ frozen క్షణంలోని వెయ్యో చితుకు యెగసి పడుతుంది నిప్పురవ్వలా.

తప్పించుకోలేవు రవంత అశాంతిని కూడా-

యెవరికీ తెలియని నుడికారమేదో సుడులు తిరిగి,

చెట్టు మోయలేని యెండుటాకు కంటే, పక్షి వెలివేసిన యీక కంటే  అతితేలిగ్గా రాలిపోయే మనిషి  ప్రాణం యిప్పటి కవిత్వ లిపి అంతా.

అనిశ్చితాల అనిర్ణయాల ఆకస్మిక మరణ వార్తల నడుమ నీ భాషలేవీ మిగలవుగా, బేల చూపులు తప్ప!


2

భయం యెక్కడో పుట్టేది కాదు. పుట్టినప్పటి నుంచీ నువ్వూ నేనూ ప్రియంగా పెంచుకుంటున్న విషప్పురుగు అది. డైనోసార్‌ కంటే పురాతనం. ఆదిమత్వం కంటే సనాతనం యీ భయం.

వూరూ పేరు లేని క్రిమిలోంచి యీ క్షణం మనిద్దరం పంచు కుంటున్న యెడారి.

యిది కాకుంటే యింకోటేదో అయి, అది నీలో పురుడు పోసుకుంటుంది.

వస్తు వ్యామోహాల లౌక్య సంభాషణల క్షణక్షణ పాతాళాల దిగువ మెట్ల మీద నువ్వు దేన్నీ ప్రేమించలేవుగా, నిన్ను తప్ప!


3

యెంతమంది ప్రవక్తలు అభయమిచ్చారో నీకు- కరగని సముద్రాల కరుణా, క్షమా, బతుకు ప్రేమా... నీ లివింగ్‌ రూమ్‌ని అలంకరించే విగ్రహాలే యీ పూట. నీ తాళం చేతుల గుత్తి పక్కన వొదిగి, వొదిగి నీ వైపే చూసే భరోసా చెయ్యి. నీ అక్వేరియమ్‌ శ్మశానంలో రంగురంగుల భ్రమల చేప పిల్లలు.

అకారణ ప్రళయాల అనవసర వైపరీత్యాల అసంతృప్తదారుల సందిగ్ధంలో నువ్వు దేనికీ కరగవుగా, భయానికి తప్ప!


4

బంధాల గాజు ముక్కల మీద అటూ యిటూ మసలుతూనే వుంటావ్‌. అనామక పావురమై యెగురుతూ యెటో వెళ్లిపోవా లనుందని లోకానికి చెప్తూ వుంటావ్‌, లోకానికి పంజరాల కానుకలిస్తూ- పావురాన్ని కబళించే కౌగిలి పంజా నువ్వే అయి చెలరేగిపోతావ్‌. యింకా నీ చుట్టూ యే వానలు కురు స్తాయి దయగా. యింకా నీ చుట్టూ యే వెన్నెలలు కాస్తాయి చల్లగా.

విఫల ప్రేమల వికట రేఖల వికార గోళాల నడుమ నువ్వు దేనికీ చేతులు చాచవుగా, కోరికలకు తప్ప!


5

యీ క్షణాలన్నీ దాటేశాక

యిక యెదురుచూడాలి-

చూడాలి, చూడాలి

నువ్వేమిటో!

యేమిటో?!

నీ చర్మం కింద దాక్కున్నదే,

అదేమిటో!

యేమిటో?!

అఫ్సర్‌


Updated Date - 2020-08-03T06:00:17+05:30 IST