మారని తీరు !

ABN , First Publish Date - 2021-08-13T09:09:59+05:30 IST

పార్లమెంటు వర్షాకాల సమావేశాలను అర్ధంతరంగా ముగించినందుకు నిరసనగా, గురువారం విపక్షాలు విజయ్‌చౌక్‌ నుంచి పార్లమెంటు వరకూ నిరసన ప్రదర్శన చేశాయి...

మారని తీరు !

పార్లమెంటు వర్షాకాల సమావేశాలను అర్ధంతరంగా ముగించినందుకు నిరసనగా, గురువారం విపక్షాలు విజయ్‌చౌక్‌ నుంచి పార్లమెంటు వరకూ నిరసన ప్రదర్శన చేశాయి. విపక్షాలను సభలో నోరెత్తనీయలేదనీ, ఆ ఆవేదననూ, అధికారపక్షం అప్రజాస్వామిక వైఖరిని ప్రజలకు మీ ద్వారా తెలియచేసుకుంటున్నామని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ మీడియాతో అన్నారు. నీలంరంగు దుస్తులు ధరించిన కొందరు వ్యక్తులు బయటనుంచి వచ్చి నిండుసభలో విపక్ష ఎంపీలమీద భౌతికదాడి చేశారని వాపోయారు. మహిళా ఎంపీలమీద కూడా నిస్సిగ్గుగా విరుచుకుపడ్డారని శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ అన్నారు. సభలో ఏ అంశాన్నీ చర్చించే ఉద్దేశం ప్రభుత్వానికి లేనందున గందరగోళం సృష్టించి, కీలకమైన బిల్లులు అనేకం ఆమోదింపచేసుకుందని విపక్షనాయకుల ఆరోపణ. 


ఉభయపక్షాలూ వర్షాకాల సమావేశాలు రెండురోజుల ముందే ముగిసిపోవడానికి కారకులు మీరేనని పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. తమపై భౌతికదాడి జరిగిందన్న విపక్షనేతల ఆరోపణను పూర్వపక్షం చేసేందుకు ప్రభుత్వం రాజ్యసభలో బుధవారం చోటుచేసుకున్న దృశ్యాలు కొన్నింటిని విడుదల చేసింది. విపక్ష నాయకులు మహిళా మార్షల్స్‌ పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించారని ఎనిమిదిమంది మంత్రులు ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఎవరు అవమానించారన్నది ఓ నాలుగైదు దృశ్యాల ఆధారంగా నిర్థారించలేము కానీ, రాజ్యసభ పరిణామాలు కచ్చితంగా అవాంఛనీయమైనవే. లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌ ఆవేదనలో అర్థం ఉన్నది. కరోనా సహా ప్రజలను కుదిపేస్తున్న సమస్యలు అనేకం చుట్టుముట్టిన స్థితిలో చర్చ సజావుగా సాగించాలన్న ఆలోచన ఎవరికీ లేకపోయింది. తమదే పై చేయి కావాలన్న ప్రయత్నంలో విలువైన సభాసమయం వృథా అయింది. సభను నియమానుసారంగా నడిపే పేరిట విపక్షాల ప్రతిపాదనలను కాదనడం ఉపరితలంలో ఎవరికీ కనిపించదు కానీ, వాటి అల్లరి మాత్రం అందరి దృష్టిలో పడుతుంది. ఇటువంటి సందర్భాల్లో ప్రతిపక్షం కాస్త తగ్గి, అధికారపక్షం వలలో పడకుండా జాగ్రత్తపడాలి. తప్పు ఎవరిదైనా కావచ్చును కానీ, ప్రజలకు మరింత జవాబుదారీగా ఉండవలసింది అధికారపక్షమే. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చేందుకూ, భయాలు, అనుమానాలను నివృత్తిచేసేందుకూ చర్చ ఉపకరిస్తుంది. ప్రజలకోసం తాను ఎంతగా శ్రమిస్తున్నదీ ప్రభుత్వం చెప్పుకోవచ్చు. సభను సాగనివ్వడం, ప్రజలకు జవాబుదారీగా ఉండటమనే విషయంలో అధికార, విపక్షాలకు కట్టుబాటులేకపోయింది. మొత్తంగా 24గంటలు కూడా పనిచేయకుండా, ఐదోవంతు సమయాన్ని మాత్రమే సద్వినియోగం చేసి, రెండు దశాబ్దాలకాలంలో మూడోస్థానంలో నిలిచి రికార్డు సృష్టించాయి ఈ వర్షాకాల సమావేశాలు. మహమ్మారి మూడోమారు ముంచుకొస్తూ, ఆర్థికం ఇంకా తేరుకోని స్థితిలో చర్చలూ చర్యల ద్వారా తమ నాయకులు దేశాన్ని గాడినపెడతారని ప్రజలు ఆశిస్తారు. సంక్షోభకాలంలో కూడా ఇంతటి బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తారని వారు అనుకొనివుండరు.


తృణమూల్ నాయకుడు ఒకరు గుర్తుచేసినట్టుగా, ఉభయసభలూ మొత్తంగా ముప్పైఐదుకు మించి బిల్లులు ఆమోదించినప్పటికీ, ఓబీసీ బిల్లు తరహాలో మిగతావి కొన్ని అయినా ఎందుకు చర్చకు నోచుకోలేదన్నది ప్రశ్న. ప్రతీపార్టీ, ప్రతీ ఎంపీ ఈ బిల్లు తమకు ముఖ్యమైనదనీ, రాజకీయంగా ఉపకరించేదిగా భావించినందున చక్కని చర్చ జరిగి, ఇతరత్రా డిమాండ్లు సైతం ప్రస్తావనకు వచ్చాయి. మిగతా బిల్లుల విషయంలో ఉభయపక్షాలకూ ఈ పట్టింపు లేకపోయింది. పెగాసస్‌పై అనేక దేశాలు విచారణకు ఆదేశించినా భారత ప్రభుత్వానిది మాత్రం ఆదినుంచీ అదే వైఖరి. కరోనా సెకండ్‌వేవ్‌ వేలాదిమందిని తుడిచిపెట్టేసినప్పటికీ, వందల్లోనే లెక్కలు చూపుతూ, ఆక్సిజన్‌ అందని చావు ఒక్కటీ లేదని పాలకులు నిర్లజ్జగా బుకాయించేసిన నేపథ్యంలో, ఆర్జేడీ సభ్యుడు మనోజ్‌ ఝా భావోద్వేగపూరిత ‘మాఫీనామా’ ప్రసంగం ఒక్కటే విశేషంగా చెప్పుకోగలిగేది.

Updated Date - 2021-08-13T09:09:59+05:30 IST