ప్రమాదాల ‘హై’వేగం!

ABN , First Publish Date - 2021-08-25T05:45:19+05:30 IST

జిల్లాలో సుదీర్ఘ జాతీయ రహదారి ఉంది. పైడిభీమవరం నుంచి ఇచ్ఛాపురం వరకూ 197 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. రోజుకు సగటున ఆరు వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటా యని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా హైవే విస్తరణ పనులు జరుగుతున్నాయి.

ప్రమాదాల ‘హై’వేగం!



జాతీయ రహదారిపై కానరాని వేగ నియంత్రణ చర్యలు

వరుసగా రోడ్డు ప్రమాదాలు

భారీగా ప్రాణ నష్టం

దృష్టిపెట్టని నిఘా యంత్రాంగం

(పలాస)

జిల్లాలో సుదీర్ఘ జాతీయ రహదారి ఉంది. పైడిభీమవరం నుంచి ఇచ్ఛాపురం వరకూ 197 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. రోజుకు సగటున ఆరు వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటా యని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా హైవే విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడే డైవర్షన్‌ రూట్లతో అస్తవ్యస్తంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కరోనా లాక్‌డౌన్‌ తరువాత చాలా మంది రహదారులపై రావడం మానే శారు. అత్యవసరమైతే తప్పించి రాకపోకలు తగ్గించారు. ఈ సమ యంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గాల్సి ఉన్నా...రోజురోజుకూ పెరుగుతుండడంపై పోలీస్‌ యంత్రాంగం సైతం విస్మయం వ్యక్తం చేస్తోంది. పలాస మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సాయుధ విభాగానికి చెందిన పోలీసులు దుర్మరణం చెందడంతో హైవే నిఘా వ్యవస్థ తీరు చర్చకు వచ్చింది. ప్రతీ 80 కిలోమీ టర్లకు ఒక వేగనియంత్రణ గన్‌, 40 కిలోమీటర్లకు ఒక హైవే పెట్రోలింగ్‌ వాహనం నిత్యం నిఘా పెడుతున్నా ప్రమాదాలు ఎందుకు నియంత్రణలోకి రావడం లేదన్న ప్రశ్న ఉత్పన్నమ వుతోంది. వాయువేగంతో వెళ్తున్న వాహనాలను నియంత్రించలేక పోతున్నారన్నది స్పష్టమవుతోంది.

 గతంతో పోల్చుకుంటే..

గతంలో పోల్చుకుంటే ఇటీవల హైవేపై పెట్రోలింగ్‌ సిబ్బంది చర్యలు తగ్గుముఖం పట్టాయి. ప్రమాదాలు జరిగిన తరువాత సహాయ చర్యలకే పరిమితమవుతున్నారన్న అపవాదు ఉంది. వేగంగా వెళ్తున్న వాహనాలపై నియంత్రణ కొరవడింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీలను పంపించడం, నిషేధిత వస్తువుల రవాణాకు అడ్డుకట్ట వేయడం వంటి వాటికే పరిమితమవుతున్నారు.  వీరికి వేగ నియంత్రణ అధికారం కూడా ఇచ్చినట్లయితే ప్రమాదాలు తగ్గడానికి అవకాశం ఉంది. గతంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవే నిర్వహించి స్టాప్‌ పాయింట్లు ఏర్పాటుచేసేవారు. లారీ డ్రైవర్లకు అవగాహన కల్పించేవారు. అర్ధరాత్రి దాటిన తరువాత వాహనాల రాకపోకలను నియంత్రించేవారు. వాహనదారులకు రెస్ట్‌ పాయింట్ల వద్దకు తీసుకెళ్లి ఉదయం తిరిగి  పంపించేవారు. అర్ధరాత్రి దాటిన తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో  వెళ్లే వాహన డ్రైవర్లకు ముఖంపై నీళ్లు చల్లి వారికి నిద్ర రాకుండా అప్రమత్తం చేసేవారు. కానీ గత రెండేళ్లుగా ఇవేవీ లేకపోవడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి 80 కిలోమీటర్లకు వేగ నియంత్రణ గన్‌, హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది పహరా ఉంచినట్లయితే ప్రమాదాలు అరికట్టవచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 ప్రమాద జోన్లు అధికం

పలాస-మందస మండలం పరిధిలోని హైవేలో ప్రమాదాల జోన్‌ ప్రాంతాలు అధికం. ఈ ప్రాంతంలో రోడ్డు జారుడు బల్ల మాదిరిగా ఉంటుంది. అతి వేగంతో వెళ్లే వాహనాలు నియంత్రించడం చాలా కష్టం. అందువల్లే ఏటా ఇక్కడ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మనుషులు మృత్యువాత పడుతున్నారు. పలాస మండలం గరుడఖండి నుంచి మందస మండలం కొత్తపల్లి వరకూ గత ఐదేళ్లలో ప్రమాదాలు భారీగానే జరిగాయి. రెప్పపాటులో జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకూ 50 మంది వరకూ మృత్యువాత పడి ఉంటారు. రంగోయి సమీపంలో ఇటీవల పోలీసు వాహన ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. వేగంగా వెళ్తున్న క్రమంలో వాహనం టైర్లు ప్రమాదవశాత్తు పేలిపోవడంతో డివైడర్‌ను ఢీకొట్టి ఆవలివైపు వున్న లారీకిందకు వెళ్లిపోవడంతో భారీ నష్టం జరిగింది. వేగాన్ని నియంత్రించి ఉంటే కేవలం డివైడర్‌ను ఢీకొట్టి చిన్నపాటి దెబ్బలతో అందరూ బయటపడేవారు. 

ప్రత్యేక దృష్టి

రోడ్డు ప్రమాదాల నియంత్రణపై పోలీస్‌ శాఖ ప్రత్యేకంగా దృష్టిసారిం చింది. జిల్లావ్యాప్తంగా 11 హైవే వాహనాలు పర్యవేక్షిస్తున్నాయి. కాశీబుగ్గ సబ్‌ డివిజన్‌ పరిధిలోనే ఐదు వాహనాలు ఉన్నాయి. వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. వేగ నియంత్రణ, హెల్మెట్‌ ధారణపై స్పష్టమైన ఆదేశాలిచ్చాం. నిబంధనలు అతిక్రమించిన వారి నుంచి అపరాధరుసుం వసూలు చేస్తున్నాం. ప్రజల సహకారంతోనే ప్రమాదాల నియంత్రణ సాధ్యం. 

-శివరామిరెడ్డి, డీఎస్పీ, కాశీబుగ్గ




Updated Date - 2021-08-25T05:45:19+05:30 IST