Abn logo
Mar 23 2021 @ 00:34AM

అప్రజాస్వామికం

ఢిల్లీలో ప్రభుత్వం అంటే గవర్నరే అని తీర్మానించేసిన బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. ఇది ఢిల్లీ ప్రజలను అవమానించడమేనని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అన్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపించినవారి నుంచి అధికారాలు లాక్కొని, వారు ఘోరంగా ఓడించిన వారికి వాటిని కట్టబెట్టడం ఈ బిల్లు లక్ష్యం కనుక, ప్రజలకు ఇంతకంటే అవమానం ఉంటుందా? అని ప్రశ్నించారాయన. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికీ, కేంద్రం నియమించే లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు మధ్య అధికార విభజనకు ఈ బిల్లు ఉపకరిస్తున్నది కనుక దీనికి రాజకీయాలు అంటగట్టడం సరికాదని కేంద్రం హితవు చెబుతున్నది. దేశరాజధానిని నడిపించే విషయంలో అస్పష్టతకు తావుండరాదనీ, ఈ బిల్లు అంతిమంగా ప్రజలకే మేలు చేస్తుంది కనుక శుష్క రాజకీయాలు పక్కనబెట్టాలని అధికారపక్ష నేతలు చెబుతున్నారు. కానీ, విపక్షాలకు మాత్రం ఈ బిల్లులో ప్రజాశ్రేయస్సుకంటే రాజకీయమే ఎక్కువగా కనబడుతున్నది.


ఈ తీరున చట్టం చేసిన తరువాత ఇక ఢిల్లీలో ఎన్నికలు జరపడం అనవసరమని కొందరు అంటున్నారు. ప్రభుత్వం అంటే లెఫ్ట్‌నెంట్‌ గవర్నరేనని నిర్వచించి, నిర్థారించిన తరువాత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండి ఏం ప్రయోజనం? అన్నది ప్రశ్న. ఇకపై, ప్రజాప్రభుత్వం తీసుకొనే ప్రతీ నిర్ణయాన్నీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ఆమోదించాల్సి ఉంటుంది. అన్ని నిర్ణయాలూ, అన్ని ఫైళ్ళూ ఆయన వద్దకు పోవాల్సిందే. కీలకమైన నిర్ణయాలు తీసుకొనేముందు ఎల్‌జీ అనుమతి కావాలి. ఇన్ని సంకెళ్ళతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ప్రజలకోసం ప్రత్యేకంగా చేయగలిగే అవకాశమేమీ ఉండదనీ, ప్రజాస్వామ్యం అన్నమాటకు బీజేపీ ఇలా విలువలేకుండా చేసిందనీ ఆప్‌ విమర్శ. మూడేళ్ళక్రితం సుప్రీంకోర్టు ఆదేశించిన మేరకు ఈ బిల్లు తయారైందని కేంద్రం అంటున్నది కానీ, సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలు కానీ, తీర్పు సారాంశం కానీ ఈ బిల్లులో ప్రతిఫలించలేదని విపక్షాల వాదన. మిగతా రాష్ట్రాల గవర్నర్లకు, ఢిల్లీలో కేంద్రప్రభుత్వ ప్రతినిధిగా ఉండే లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు తేడా లేకపోలేదని సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. మంత్రివర్గం తన నిర్ణయాలను ఆయనకు తెలియచేయాల్సిందేనని చెబుతూనే, పోలీసు, ప్రజాభద్రత, భూ సంబంధ అంశాల్లో మాత్రమే ఆయన ఆమోదం అవసరమని నిర్థారించింది. అంటే, ఇవి మినహా మిగతా విషయాల్లో చట్టాలు చేసేందుకు ఢిల్లీ అసెంబ్లీకి సర్వాధికారాలూ ఉన్నాయి. అలాగే, ఎల్‌జి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదనీ, ఆయన మంత్రిమండలి సలహాలూ సూచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు అన్నది. ఇరుగుపొరుగు రాష్ట్రాలతోనో, కేంద్రంతోనో ఘర్షణ తెస్తాయనుకున్నవీ, సున్నితమైన అంశాలు ఇమిడివున్నవీ, ప్రభుత్వ స్తోమతకు మించి ఆర్థికభారం కలిగించేవీ తుది నిర్ణయం కోసం రాష్ట్రపతికి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నివేదించవచ్చునని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ నిర్ణయాధికారాన్ని ఆయన ప్రతీదానికీ యాంత్రికంగా వాడకూడదని కూడా అన్నది. కానీ, సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తి ఇప్పటిబిల్లులో ప్రతిఫలించలేదు. ఎల్‌జి అధికారాల పరిధిని ఇది అవధులు లేకుండా పెంచేసింది. సుప్రీంకోర్టుకు ముందు హైకోర్టు తన తీర్పులో పాలనాపరంగా ఆయనే సర్వాధికారి అనీ, ప్రభుత్వం తీసుకొనే ప్రతీ నిర్ణయం ఆయన ఆమోదం లేనిదే చెల్లదన్న రీతిలోనే కేంద్రం ఇప్పుడు తయారుచేసిన బిల్లు ఉంది.


ఈ బిల్లు చట్టమైతే, ఢిల్లీ ప్రతిపత్తి మునిసిపాలిటీతో సమానమని విశ్లేషకుల వాదన. కీలకమైన అంశాలు ఒకటిరెండు మీ దగ్గర పెట్టుకొని, మిగతా విషయాల్లో మాకు రాష్ట్రాలతో సమానంగా అధికారాలివ్వండని దీర్ఘకాలంగా పోరాడుతున్న కేజ్రీవాల్‌కు ఈ బిల్లు పెద్ద దెబ్బ. కేంద్రంలోనూ, ఢిల్లీలోనూ ఒకేపార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ముఖ్యమంత్రుల సణుగుడు వినిపించేది కానీ, మోదీ వర్సెస్‌ కేజ్రీవాల్ తరహాలో యుద్ధాలు జరగలేదు. బస్తీ క్లినిక్కులనుంచి వీధిబడుల్లో నియామకాల వరకూ అన్నీ తనగుప్పిట్లోనే పెట్టుకోవాలని ప్రతీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ప్రయత్నించడం, దీక్షలూ ధర్నాలతో కేజ్రీవాల్‌ పోరాడటమూ చూసిందే. తమను గెలిపిస్తే ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామని బీజేపీ గతంలో ఢిల్లీ ప్రజలకు వాగ్దానం చేసింది. అందుకు భిన్నంగా ఉన్న ఆ కాసిన్ని అధికారాలు కూడా లాక్కొని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నామమాత్రం చేస్తున్నది. ఢిల్లీలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం శాశ్వతమని కేంద్రం నిర్థారించుకున్నట్టుంది.