మానవాభివృద్ధిపై చిన్నచూపు!

ABN , First Publish Date - 2021-01-18T08:25:58+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం మానవాభివృద్ధికి ప్రాధాన్యమివ్వడంలేదా? విద్య, వైద్యం వంటి రంగాలను పెద్దగా పట్టించుకోవడంలేదా? అంటే..

మానవాభివృద్ధిపై చిన్నచూపు!

  • ఇందుకు చేస్తున్న వ్యయంలో అట్టడుగున తెలంగాణ
  • విద్య, వైద్య రంగాలపై తక్కువ వ్యయం చేస్తున్న రాష్ట్రం
  • అన్ని రాష్ట్రాల సరాసరి 24 శాతం.. తెలంగాణలో 16 శాతం
  • వ్యవసాయం, నీటి పారుదల తదితర రంగాలపైనే ఖర్చు
  • కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అంచనా నిధులు 58ు రావట్లేదు
  • 2015-21 మధ్య కాలంలోని బడ్జెట్లపై పీఆర్‌ఎస్‌ నివేదిక


హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం మానవాభివృద్ధికి ప్రాధాన్యమివ్వడంలేదా? విద్య, వైద్యం వంటి రంగాలను పెద్దగా పట్టించుకోవడంలేదా? అంటే.. పీఆర్‌ఎస్‌ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం ఇది నిజమేనని తెలుస్తోంది. మానవాభివృద్ధి కోసం నిధులను వ్యయం చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ అట్టడుగున ఉండటం దీనినే సూచిస్తోంది. మానవాభివృద్ధి విషయంలో అన్ని రాష్ట్రాల సరాసరి వ్యయం 24 శాతం ఉండగా,  తెలంగాణలో మాత్రం కేవలం 16 శాతం మాత్రమే ఉంది. దీంతో చిట్టచివరి స్థానంలో నిలిచింది. దేశంలోని ఆయా రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్‌లు, ఆదాయం, వ్యయం, ఆర్థిక పరిస్థితులపై పీఆర్‌ఎస్‌ సంస్థ ప్రత్యేక నివేదికను రూపొందించింది. 2015-21 మధ్య కాలానికి (ఆర్థిక సంవత్సరాలు) సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి నివేదికను తయారు చేసింది. డిసెంబరులో ఈ నివేదికను విడుదల చేసింది. కాగా, విద్య, వైద్యం వంటి వాటిని ప్రధానంగా పరిగణించే మానవాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తక్కువగా వ్యయం చేస్తోంది. ఇందుకు ఎక్కువగా నిధులు వ్యయం చేస్తూ ఢిల్లీ రాష్ట్రం మొదటి  స్థానం (42%)లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో అసోం (31%), మేఘాలయ (30%) ఉన్నాయి విద్యపై అన్ని రాష్ట్రాలు తమ బడ్జెట్‌లో చేస్తున్న సరాసరి వ్యయం 15.9% ఉండగా, తెలంగాణలో మాత్రం కేవలం 9.5 శాతమే ఉంది. ఈ రంగంలో అతి తక్కువ శాతం నిధులను వ్యయం చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. 


ఎకనామిక్‌ సెక్టార్‌కు ఎక్కువ నిధులు..

ఎకనామిక్‌ సెక్టార్‌పై మాత్రం తెలంగాణ రాష్ట్రం ఎక్కువ నిధులను వ్యయం చేస్తోంది. ఈ సెక్టార్లయిన వ్యవసాయం, నీటి పారుదల, గృహనిర్మాణం, ఇంధనం, నిర్మాణ రంగం, రోడ్లు, బ్రిడ్జీలు వంటి వాటిపై తెలంగాణ 38% నిధులను వ్యయం చేస్తోంది. ఛత్తీ్‌సగఢ్‌ 44%తో మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో మధ్యప్రదేశ్‌ (39%), మూడో స్థానంలో తెలంగాణ ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా 2020-21లో అన్ని రాష్ట్రాల ఆదాయ వనరులు దెబ్బతిన్నాయని, దాంతో ఎక్కువగా రుణాలపై ఆధారపడినట్టు నివేదిక పేర్కొంది. కాగా, 2015-21 వరకు సంబంధించి ఆయా రాష్ట్రాలు చేసిన వ్యయంలో సొంత ఆదాయం నుంచి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రం చేసే మొత్తం ఖర్చులో సుమారు 75% నిధులు సొంత ఆదాయ వనరుల ద్వారా సమకూరుతున్నవే. కేవలం 25% మాత్రమే కేంద్రం నుంచి వస్తున్న పన్నులు లేదా ఇతర గ్రాంట్ల ద్వారా వస్తున్నాయి. అయితే ఈ జాబితాలో ముందు వరుసలో ఢిల్లీ ప్రభుత్వం (86%) ఉంది. తర్వాత హరియాణ (76%)ఉంది. తెలంగాణ ఏటా చేస్తున్న వ్యయంలో 20ునిధులు అప్పుల ద్వారా తీసుకొస్తున్నవే ఉన్నాయి. రాష్ట్ర జీఎ్‌సడీపీతో పోలిస్తే.. తెలంగాణకు సుమారు 7.4% మేర వివిధ పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతోంది. 


ఈ విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల సరాసరి పన్నుల శాతం 6.3గా ఉంది. అంటే.. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పన్నుల ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తున్నట్టు అంచనా వేశారు. ఈ విషయంలో తెలంగాణతో సమానంగా ఛత్తీ్‌సగఢ్‌ మొదటి స్థానంలో ఉంది. కాగా, బడ్జెట్‌ స్వరూపాన్ని పెద్దగా చూపి.. దానిని అందుకోలేని రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. 2015-19 మధ్య కాలంలోని బడ్జెట్‌లను, వాస్తవ వ్యయాలను అంచనా వేసిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ తన బడ్జెట్‌లో చూపిన దానికంటే.. 20% తక్కువ వ్యయం చేసింది. ఈవిషయంలో మొదటి స్థానంలో (22%) అసోం, త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి. కాగా, కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పేరిట వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేసిన నిధుల్లో తెలంగాణకు 58ు రావడం లేదు. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉండడం విశేషం. అన్ని రాష్ట్రాల సరాసరి తగ్గుదల 23% ఉండగా, తెలంగాణలో మాతం ఇది ఏకంగా 58% ఉంది. 

Updated Date - 2021-01-18T08:25:58+05:30 IST