తగ్గని బిజెపి బలం

ABN , First Publish Date - 2021-05-04T09:33:45+05:30 IST

ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసిన తర్వాత, అనుకున్న విధంగా భారతీయ జనతా పార్టీ ఫలితాలు సాధించలేకపోయిందని...

తగ్గని బిజెపి బలం

ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసిన తర్వాత, అనుకున్న విధంగా భారతీయ జనతా పార్టీ ఫలితాలు సాధించలేకపోయిందని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ బెంగాల్‌లో బిజెపిని గెలిపించలేకపోయారని దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్న వారిలో కాంగ్రెస్, వామపక్షాలు, కుహనా లౌకికవాదులు ఎక్కువగా ఉన్నారనడంలో సందేహం లేదు. భారతీయ జనతా పార్టీ ఒక సైద్ధాంతిక పార్టీ అని, అది గెలుపోటములతో ప్రమేయం లేకుండా శాయశక్తులా ప్రజల మద్దతు సంపాదించేందుకు అహర్నిశలు కృషి చేస్తుందని ఎన్నిసార్లు చెప్పినా వారికి అర్థం కాదు. జనసంఘ్ హయాంలో కేవలం రెండు సీట్లు గెలిచినప్పుడు ఎంత ఉత్సాహంతో పార్టీ కార్యకర్తలు పనిచేశారో, ఇవాళ లోక్‌సభలో 300 సీట్లు ఉన్నా అంతే ఉత్సాహంతో పనిచేయడం, సైద్ధాంతిక బలమే తమ ఊపిరిగా భావించడం బిజెపి శైలి గురించి తెలిసినవారెవరైనా అర్థం చేసుకోగలరు.


బిజెపి అనుకున్న ఫలితాలు సాధించలేదని సంబరాలు చేసుకుంటున్న వామపక్షాల పరిస్థితి ఏమిటి? బెంగాల్‌ను దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఏలిన వామపక్షాలకు ఈసారి ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాకపోవడానికి కారణం ఏమిటి? అయిదున్నర దశాబ్దాల పాటు దేశరాజకీయాలను శాసించిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఎందుకు తిరస్కరించారు? దేశంలో తమ దుస్థితి గురించి ఆలోచించకుండా బిజెపి విజయపరంపరకు ప్రజలు కళ్లెం వేశారని, తమ పార్టీని మోదీ బెంగాల్‌లో గెలిపించలేకపోయారని సంతోష పడుతున్న ఈ గురివింద గింజలకు జ్ఞానోదయం ఎప్పుడు కలుగుతుంది?


కాని నిజంగా భారతీయ జనతా పార్టీని బెంగాల్ ప్రజలు తిరస్కరించారా? లేదని ఎన్నికల ఫలితాలను పరిశీలించిన వారెవరికైనా అర్థం అవుతుంది. బెంగాల్ ప్రజలు పూర్తిగా తిరస్కరించింది వామపక్షాలు, కాంగ్రెస్‌నే కాని బిజెపిని కాదు. బెంగాల్‌లో బిజెపి ఎప్పుడూ అధికారంలోకి లేదు. అయినప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 సీట్లు గెలుచుకున్న బిజెపికి బెంగాల్ ప్రజలు ఈ సారి 77 సీట్లు కట్టబెట్టారు. దాదాపు 38.13 శాతం ఓట్లు బిజెపికి లభించాయి, గత లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతంతో పోలిస్తే బిజెపికి కేవలం ఒకటిన్నర శాతమే తగ్గింది. బెంగాల్ ప్రజలు భారతీయ జనతా పార్టీని ప్రతిపక్ష పార్టీగా తీర్మానిస్తే అదే సిపిఐ(ఎం) 4.72 శాతం, కాంగ్రెస్ 2.94 శాతం ఓట్లు మాత్రమే సాధించి బెంగాల్ రాజకీయ రంగం నుంచి నిష్క్రమించే పరిస్థితిని కల్పించారు. ఒక రకంగా చెప్పాలంటే బెంగాల్‌లో కాంగ్రెస్, వామపక్షాలు మమతా బెనర్జీకి పాదాక్రాంతమై తమను తాము పూర్తిగా ధ్వంసం చేసుకున్నందువల్లే బిజెపిని అడ్డుకోగలిగాయి. ఈ పార్టీలు కనుక గట్టి పోటీ ఇచ్చి ఉంటే తృణమూల్ ఓట్లు చీలి బిజెపికి ప్రయోజనం చేకూరేదని ఎన్నికల గణాంక వివరాలు అధ్యయనం చేసిన వారెవరికైనా తెలుస్తుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కనీసం ప్రచారం కూడా చేయకపోవడం, వామపక్ష నేతలు క్వారంటైన్‌కు వెళ్లడంతో ఆ పార్టీలు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. ఈ రెండు పార్టీలు బిజెపి గెలుపును అడ్డుకోవడం కోసం తమను తాము ఆత్మహత్య చేసుకోవడం ఒకందుకు మంచిదే. దాని వల్ల కేవలం బిజెపికి మాత్రమే బలమైన ప్రతిపక్షంగా ప్రజలకోసం పోరాడేందుకు అవకాశం కలిగింది.


బెంగాల్‌లో గత కొద్ది సంవత్సరాల్లోనే బిజెపి స్థానిక బలాన్ని పెంచుకోగలిగింది. దాదాపు 80 శాతం పోలింగ్ బూత్‌లలో బిజెపి కార్యకర్తలు బాధ్యతలు నిర్వర్తించారు. కేడర్ బలం, ప్రజాబలం ఉన్నందువల్లే బిజెపి 38 శాతం ఓట్లతో ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఆవిర్భవించింది. పశ్చిమబెంగాల్ ప్రజల ముందు బిజెపి ఒక బలమైన అభివృద్ధి ఎజెండాను ప్రవేశపెట్టింది, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని, కుంభకోణాలను ప్రజలకు తెలియజేసింది. పారిశ్రామికీకరణ, నాణ్యమైన విద్య గురించి మాట్లాడింది. అయినప్పటికీ బిజెపిని మతతత్వ పార్టీగా చిత్రించారు. కానీ నిజానికి మతతత్వ ప్రచారం చేసింది తృణమూల్ కాంగ్రెస్. అందుకే ముస్లిం ఓట్లు పూర్తిగా మత ప్రాతిపదికన పడ్డాయి. అయిదు సంవత్సరాల క్రితం బెంగాల్‌లో ఉనికేలేని బిజెపి ఇవాళ ఆ రాష్ట్రంలో ఒక ప్రధాన పార్టీగా అవతరించింది. భవిష్యత్‌లో అధికారంలోకి రాగలమనే విశ్వాసం నింపుకున్నాం. ఇది బిజెపి ఘనత కాదా? పశ్చిమ బెంగాల్‌లో బిజెపి కోల్పోయింది ఏముంది? ఎలాంటి కుటుంబం లేని, ఆస్తులు పోగు చేసుకోవాల్సిన అవసరం లేని ఒక నిస్వార్థపరుడైన 70 ఏళ్ల నాయకుడు రాత్రింబగళ్లు ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రదేశాల సరసన నిలబెట్టాలని, ఆత్మగౌరవంతో జీవించేలా చేయాలని చేస్తున్న ప్రయత్నాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని రకరకాల కుటిలయత్నాలు చేశాయి. ఇంత ఉధృతంగా జరిగిన దుష్ట ప్రచారం తర్వాత కూడా ప్రజలు బెంగాల్‌లో వామపక్షాలు, కాంగ్రెస్‌ను నిర్మూలించి బిజెపిని ప్రదాన ప్రతిపక్షంగా నిర్ణయించాయి.


ఇక అస్సాంలో మళ్లీ బిజెపి అధికారంలోకి రావడం, 32 శాతం ఓట్లు సాధించడం సాధారణ విషయం కాదు. అస్సాంలో సిఏఏ పేరిట ప్రజలను విడదీసేందుకు కుట్రపూరిత దుష్ప్రచారం ఉధృతంగా సాగింది. ఈసారి మహా కూటమి పేరుతో కాంగ్రెస్‌ వివిధ, మత, విచ్ఛిన్న శక్తులతో చేతులు కలిపి పోటీ చేసింది. ఏడు పార్టీలు కలిసికట్టుగా బిజెపికి వ్యతిరేకంగా పోటీ చేసినప్పటికీప్రజలు బిజెపి హయాంలో జరిగిన అభివృద్ధికి సానుకూలంగాప్రతిస్పందించి బిజెపి, మిత్రపక్షాలకు స్పష్టమైన మెజారిటీని ఇచ్చారు. ఏ రాష్ట్రంలోనైనా ఒక సారి బిజెపి అధికారంలోకి వస్తే అది ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని అస్సాం ప్రజలు నిరూపించారు.


కేరళలో కూడా బిజెపి ఎప్పుడూ ఒక శక్తి కాదు. అక్కడ కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్, వామపక్షాల నేతృత్వంలోని కూటముల మధ్యే ప్రధాన పోటీ జరుగుతోంది. అక్కడ ఈసారి బిజెపికి ఒక్క సీటు రానప్పటికీ 11.6 శాతం ఓట్లు వచ్చాయి. గతంలో కంటే ఇది ఒక శాతం ఎక్కువే. పుదుచ్చేరిలో కూడా బిజెపికి నిన్నమొన్నటి వరకూ ఉనికి లేదు, కాని ఈసారి బిజెపికి దాదాపు 14 శాతం ఓట్లు లభించి మొట్టమొదటిసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధంచేసింది. తమిళనాడులో గత ఎన్నికల్లో బిజెపికి ఒక్క సీటు కూడా రాలేదు, కాని ఈసారి పోటీ చేసిన 20 సీట్లలో 4 సీట్లు లభించాయి. బిజెపి మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ సుప్రసిద్ధ నటుడు, మకల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ను ఓడించారు. 13 పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసి ఎన్డీఏను అడ్డుకునేందుకు రంగంలోకి దిగినప్పటికీ అనేక చోట్ల బిజెపి కేవలం వేయి ఓట్ల తేడాతోనే ఓడిపోయింది.


స్థూలంగా చూస్తే బిజెపి ఈఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గతంలో కంటే మెరుగైన ఫలితాలే సాధించింది కాని ఎక్కడా దెబ్బతినలేదు. ఓట్ల శాతం, సీట్ల శాతం పెంచుకొన్న బిజెపి బలం తగ్గినట్లా, పెరిగినట్లా? కాంగ్రెస్ జాతీయ పార్టీగా తన ఉనికి కోల్పోయే దుస్థితిలో పడింది. దేశ వ్యాప్తంగా మోదీని ఎదుర్కోగల నాయకుడు లేరని, ప్రాంతీయ పార్టీలు బిజెపి ఎదుర్కోవడం కోసం తమ ఇంటినే చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయని తేలిపోయింది. దేశ వ్యాప్తంగా తన ఉనికిని నిరూపించుకోగలిగిన బిజెపి ఇవాళ దేశంలో అన్ని పార్టీలకు సింహస్వప్నంగా మారినందువల్ల ప్రాంతీయ పార్టీ నేతలు తమ పదవులు కోల్పోకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ఘట్టం ముగిసినందువల్ల ఇవాళ కరోనాను ఎదుర్కొనేందుకు మోదీ చేస్తున్న గట్టి ప్రయత్నాలకు అన్ని పార్టీలు సహకరించి సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మోదీ నాయకత్వంలోనే దేశం ఏ సమస్య అయినా ఎదుర్కోగలదన్న విషయంలో సందేహం ఎవరికీ లేదు.


వై. సత్యకుమార్

బిజెపి జాతీయ కార్యదర్శి


Updated Date - 2021-05-04T09:33:45+05:30 IST