Abn logo
May 16 2020 @ 04:36AM

ఉపాధిహామీ, హారితహారం, పల్లెప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌, మే 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):ఉపాధిహామీ, హారితహారం, పల్లెప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కె శశాంక అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో ఉపాధిహామీ, పల్లెప్రగతి, హరితహారంపై అన్ని మండలాల ఎంపీడీవో,ఎంపీవో, ఏపీవో, టీఏలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రోజు పనులను పర్యవేక్షించాలని గ్రామాలలో ప్రజలు ఇజిఎస్‌ పనులకు ఎక్కువ సంఖ్యలో వెళ్లే విధంగా ప్రోత్సహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అధికారులు పనులలో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హరితహారంలో మొక్కలు నాటుటకు ఇద్దరు ఆర్డీవోలు డివిజన్‌ వారీగా అవసరమైన భూములు గుర్తించి సిద్ధం చేయాలని అన్నారు.


గ్రామాలలో, మండలాలలో, మున్సిపాలిటీలలో నర్సరీలు ఏర్పాటు, వాటిలో అవసరమైన మొక్కలు పెంచడానికి ముందస్తు ప్రణాళిక చేసుకోవాలని తెలిపారు. మొక్కలు ఒకటి నుంచి ఒకటిన్నర మీటర్లు ఉన్న వాటినే నాటాలని తెలిపారు. చొప్పదండి, ఇల్లందకుంట, గంగాధర, హుజురాబాద్‌, జమ్మికుంట, కరీంనగర్‌, కేశవపట్నం, మానకొండూర్‌, రామడుగు, తిమ్మాపూర్‌, వీణవంక వైకుంఠదామాలు ఇప్పటివరకు ప్రారంభం కాకపోవడంపై అధికారులను నిలదీశారు. గ్రామాలలో ప్రతిఇంటికి తప్పనిసరిగా సోక్‌ఫిట్స్‌ నిర్మించాలని జిల్లా వ్యాప్తంగా 92,768 అనుమతి ఉంటే 23507 సోక్‌ఫిట్స్‌ పూర్తి చేశారని, 9664 సోక్‌ఫిట్స్‌ వివిధ దశలలో ఉన్నాయని అన్నారు.


ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలో ఈజీఎస్‌ కింద ఇంకా 1,15,418 పనిదినాలకు పేమెంట్‌ చేయాల్సి ఉందని ఇందులో జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా గంగాధరలో 11,253, వీణవంకలో 10,382, మానకొండూర్‌లో 9758 ఉన్నాయన్నారు. ఈ మండలాలలో వీటికి సంబంధించిన మస్టర్స్‌ ఎక్కుడున్నాయో చూసి ఎంబీ రికార్డు చేసి రెండు రోజుల్లోగా పేమెంట్‌ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Advertisement
Advertisement