నిరుద్యోగ విప్లవం

ABN , First Publish Date - 2021-06-22T07:56:02+05:30 IST

ఎన్నెన్నో ఉద్యోగాలు..నిరుద్యోగులకు ఎంతెంతో మేలు!.. ఇలా తమకు హామీలెన్నో ఇచ్చి, జాబ్‌ క్యాలెండర్‌లో తుస్సుమనిపించిన వైసీపీ ప్రభుత్వంపై యువత భగ్గుమంది. సర్కారువారి ఘనమైన ‘ఉద్యోగాల విప్లవా’నికి నిరసనగా నిరుద్యోగ లోకం నిజంగా..

నిరుద్యోగ విప్లవం

జాబ్‌లెస్‌ క్యాలెండర్‌పై కన్నెర్ర

చెవిలో పూలు పెట్టొద్దు.. ఖాళీలన్నీ నింపాలి

రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల హెచ్చరిక

రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన యువజనం

ధర్నాలు, మానవహారాలతో ఉద్యమ సెగ

వర్సిటీలు వేదికగా విద్యార్థుల నిరసన

ఉద్రిక్తంగా మారిన కలెక్టరేట్ల ముట్టడి

ఏపీపీఎస్సీ వద్దకు తరలొచ్చిన నిరుద్యోగులు


‘ఉద్యోగాల విప్లవం’ పేరిట సర్కారు విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌పై నిరుద్యోగులు భగ్గుమన్నారు. ఇది ‘జాబ్‌లెస్‌’ క్యాలెండర్‌ అని ధ్వజమెత్తారు.   దీనిని తక్షణం రద్దు చేసి... మొత్తం ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో నిరుద్యోగులు రోడ్డెక్కారు. నినాదాలు, నిరసనలతో హోరెత్తించారు.


(ఆంధ్రజ్యోతి- న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఎన్నెన్నో ఉద్యోగాలు..నిరుద్యోగులకు ఎంతెంతో మేలు!.. ఇలా తమకు హామీలెన్నో ఇచ్చి, జాబ్‌ క్యాలెండర్‌లో తుస్సుమనిపించిన వైసీపీ ప్రభుత్వంపై యువత భగ్గుమంది. సర్కారువారి ఘనమైన ‘ఉద్యోగాల విప్లవా’నికి నిరసనగా నిరుద్యోగ లోకం నిజంగా విప్లవాన్నే మొదలుపెట్టింది. ఇస్తానన్న ఉద్యోగాలేవీ పెట్టని క్యాలెండర్‌ను రద్దుచేయాలంటూ రాష్ట్రమంతా నిరుద్యోగులు రోడ్డెక్కారు. కనికట్టులు ఇకనైనా మాని.. ఇచ్చిన మాటకు కట్టుబడాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్లు, పలు విశ్వవిద్యాలయాల వద్ద నిరసనలతో హోరెత్తించారు. ఠారెత్తించే ఎండల్లోనూ ధర్నాలు, ప్రదర్శనలు, మానవహారాలెన్నో నిర్మించారు. ఈ క్రమంలో సీఎం జగన్‌, రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా తగిలేలా పలుచోట్ల పదునైన నినాదాలు వినిపించారు. పలు విద్యార్థి, నిరుద్యోగ, యువజన సంఘాలు నేతృత్వం వహించిన ఈ ఆందోళనలపై పోలీసులు పెద్దఎత్తున విరుచుకుపడి అరెస్టులకు తెగబడ్డారు. 


జగన్‌ గోవిందా.. జాబ్‌ క్యాలెండర్‌ గోవిందా.. 

వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్‌ఎ్‌ఫఐ, ఏఐఎ్‌సఎఫ్‌ ఆధ్వర్యంలో అనంతపురం అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన హోరెత్తింది. ‘డౌన్‌ డౌన్‌ బ్లడీ గవర్నమెంట్‌’ అంటూ ముఖ్యమంత్రి జగన్‌, ప్రభుత్వానికి  వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పెద్ద పెట్టున నినదించారు. ‘జగన్మోహన్‌ రెడ్డి గోవిందా... జాబ్‌ క్యాలెండర్‌ గోవిందా.. రాష్ట్రప్రభుత్వం గోవిందా’ అంటూ నినాదాలు చేశారు. ఓ ఎస్‌ఎ్‌ఫఐ కార్యకర్త అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట అరగుండు చేయించుకొని నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థి నిరుద్యోగుల ఐక్యవేదిక, వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు టీబీ రామన్న ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు సప్తగిరి సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎస్కే యూనివర్సిటీలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి ఆధ్వర్యంలో విద్యార్థులు.. జగన్‌ చిత్రపటం చెవులకు ఇరువైపులా గులాబీలు పెట్టి తాళాలు కొడుతూ నిరసన తెలిపారు. 


మాతో ఆటలాడితే ఇబ్బంది మీకే..

ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీచేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టరేట్‌ ఎదుట ఎపీ అన్‌ఎంప్లాయీ్‌స యూనియన్‌ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది.  గ్రూపు-1, గ్రూపు-2లో ఖాళీగా ఉన్న 2వేల పోస్టులతో పాటు 6,500 పోలీస్‌ ఉద్యోగాలను క్యాలెండర్‌లో ప్రకటించి భర్తీ చేయాలని అదే జిల్లా దర్శిలో నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు. ఉద్యోగాలని చెప్పి ఉసూరుమనిపించారంటూ డీవైఎ్‌ఫఐ, ఎస్‌ఎ్‌ఫఐ, నిరుద్యోగ సంఘం, ఏబీవీపీ నేతలు, కార్యకర్తలు విజయవాడ ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. నిరుద్యోగులు రోడ్డుపైనే పడుకుని తమ నిరసన తెలిపారు.  150 మందిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. జాబ్‌ క్యాలెండర్‌ తమకు అన్యాయం చేసేలా ఉందంటూ డీవైఎ్‌ఫఐ, ఎస్‌ఎ్‌ఫఐ, నిరుద్యోగ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. అనంతరం జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా గల గాంధీ విగ్రహం వరకూ ర్యాలీగా వెళ్లి.. మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా నిరుద్యోగ సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం నిరుద్యోగ యువతతో ఆటలాడితే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సుమారు మూడు గంటలపాటు సాగిన నిరసన సాగింది. 


వాస్తవ పోస్టులు ప్రకటించాలి..

తూతూమంత్రంగా విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ను రద్దు చేయాలంటూ కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఏపీ నిరుద్యోగుల యువజన విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. మూసిఉన్న కలెక్టరేట్‌ గేటును తోసుకుని లోపలికి వెళ్లారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి సంఘాల నాయకులు తులసిరామ్‌, గోవిందు, అబ్దుల్లా, నగేశ్‌ మాట్లాడుతూ.. మార్పులుచేసి తిరిగి జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని, లేనిపక్షంలో భారీ ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు కోట్ల సుజాతమ్మ, గౌరు చరితారెడ్డి .. అక్కడకు చేరుకొని ఉద్యమిస్తున్న నిరుద్యోగులకు మద్దతు ప్రకటించారు. జాబ్‌లేని డాబు క్యాలెండర్‌ ఎందుకంటూ గుంటూరులోని ప్రాంతీయ గ్రంఽథాలయం వద్ద  నిరుద్యోగులు ఫ్లకార్డులు ప్రదర్శించారు. అరండల్‌పేట, శంకర్‌విలాస్‌ సెంటర్‌లో ఆందోళన చేస్తున్న ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎ్‌ఫఐ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6,500 పోలీసు పోస్టులతో మళ్లీ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలంటూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ భానుగుడి సెంటర్‌ వద్ద సుమారు రెండు గంటలపాటు నిరుద్యోగులు నిరసన చేపట్టారు. వాస్తవ పోస్టులతో తిరిగి జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించాలంటూ నెల్లూరులో నిరుద్యోగ జేఏసీ నాయకులు, డీవైఎ్‌ఫఐ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వోను కలిసి వినతిపత్రం అందించారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌ వద్ద భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యమించారు. అనంతరం కలెక్టర్‌కు, అక్కడకు వచ్చిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు వినతిపత్రాలు అందజేశారు.


సొమ్మసిల్లిన నిరుద్యోగి

మెగా డీఎస్సీ, భారీగా పోలీసు ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎ్‌ఫఐ విద్యార్థి సంఘాలు విజయనగరం కలెక్టరేట్‌ను ముట్టడించాయి. భారీఎత్తున తలపెట్టిన ధర్నాను భగ్నం చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఓ నిరుద్యోగి సొమ్మసిల్లిపడిపోయాడు. ఆందోళన చేస్తున్న 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 


రెండు వారాల డెడ్‌లైన్‌

విద్యార్థుల రౌండ్‌టేబుల్‌ హెచ్చరిక


విజయవాడ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ను రద్దుచేసి, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఏఐవైఎఫ్‌, ఏఐఎ్‌సఎఫ్‌, పీడీఎ్‌సయూ, టీఎన్‌ఎ్‌సఎఫ్‌, తెలుగు యువత, ఎన్‌ఎ్‌సయూఐ, ఎస్టీయూ సంఘాలు విజయవాడ దాసరి భవన్‌లో రౌండ్‌టేబుల్‌ నిర్వహించి.. ఈ మేరకు తీర్మానించాయి. రాష్ట్రంలో 2,35,794 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు ఆర్థిక శాఖ చెబుతుంటే, కేవలం 10,143 ఉద్యోగాల భర్తీకే క్యాలెండర్‌ విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందని నేతలు మండిపడ్డారు. రెండేళ్లలో 6,03,756 ఉద్యోగాలు ఇచ్చామని సీఎం ప్రకటించడం ఒక జోక్‌ అని ఎద్దేవా చేవారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ను రద్దు చేయడానికి 2వారాలు డెడ్‌లైన్‌ పెట్టారు. లేకపోతే భారీస్థాయిలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

Updated Date - 2021-06-22T07:56:02+05:30 IST