రామప్పను యునెస్కో గుర్తించడం సువర్ణావకాశం

ABN , First Publish Date - 2021-07-29T09:02:15+05:30 IST

రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఒకటిగా యునెస్కో గుర్తించడం గొప్పవిషయమని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అభిప్రాయపడింది. తెలంగాణ రాష్ట్రంలో

రామప్పను యునెస్కో గుర్తించడం సువర్ణావకాశం

దీన్ని వదులుకోవద్దు.. లేదంటే దేశమంతా నిందిస్తుంది

ప్రపంచ వారసత్వ కమిటీ సూచనల అమలుకు కమిటీ వేయండి

డిసెంబరు చివరికల్లా పనులన్నీ పూర్తి చేయాలి

వసతులు కల్పిస్తే పర్యాటకంగా అభివృద్ధి 

నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన


హైదరాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఒకటిగా యునెస్కో గుర్తించడం గొప్పవిషయమని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అభిప్రాయపడింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కొ గుర్తింపు పొందిన ఒకే ఒక ఆలయం రామప్ప అని, ఇది రాష్ట్రానికి సువర్ణావకాశమని పేర్కొంది. ఈ అవకాశాన్ని వదులుకోరాదని ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ వదులుకుంటే దేశం మొత్తం నిందిస్తుందని వ్యాఖ్యానించింది.  ప్రపంచ వారసత్వ కమిటీ సూచనలు అమలు చేసేందుకు ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎ్‌సఐ) సూపరింటెండెంట్‌ అధ్యక్షతన స్థానిక రెవెన్యూ ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ కమిటీ తొలి సమావేశం ఆగస్టు 4న నిర్వహించాలని, జాయింట్‌ సర్వే చేయడంతోపాటు రెగ్యులర్‌గా సమావేశాలు ఏర్పాటుచేసి తీసుకోవాల్సిన చర్యలపై నాలుగు వారాల్లోగా స్థాయి నివేదిక (స్టేటస్‌ రిపోర్టు) ఇవ్వాలని స్పష్టం చేసింది. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తిస్తూ యునెస్కో చేసిన ప్రకటనపై ప్రతికల్లో వచ్చిన కథనాలను చూసిన హైకోర్టు సుమోటో పిల్‌గా మలిచి విచారణకు వేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దీనిపై బుధవారం  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.


ప్రపంచ వారసత్వ కమిటీ 44వ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వానికి సూచించిన విధంగా ఈ ఏడాది డిసెంబరు చివరినాటికి సకల హంగులు సమకూర్చాలని స్పష్టం చేసింది. ఇందుకోసం సమర్థుడైన నోడల్‌ అధికారిని నియమించి, సమగ్ర నివేదిక రూపొందించాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్‌ రూపొందించి కోర్టు పరిశీలనకు ఇవ్వాలని తెలిపింది. రామప్ప ఆలయానికి మరమ్మత్తులు చేయడంతోపాటు పర్యాటకులకు తగిన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే మంచి పర్యాటక కేంద్రంగా మారుతుందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను అక్టోబరు 20కి వాయిదా వేసింది. 

Updated Date - 2021-07-29T09:02:15+05:30 IST