ఏడేళ్లలో తెలంగాణలో ఊహించని అభివృద్ధి

ABN , First Publish Date - 2021-07-23T06:35:04+05:30 IST

గడిచిన ఏడేళ్లలో తెలంగాణలో ఊహించని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసి చూపించారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

ఏడేళ్లలో తెలంగాణలో ఊహించని అభివృద్ధి
హుజూరాబాద్‌లో మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

- గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

- గొల్ల కురుమలకు పది రోజుల్లో గొర్రెల పంపిణీ పూర్తి చేస్తాం

-  మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

హుజూరాబాద్‌, జూలై 22: గడిచిన ఏడేళ్లలో తెలంగాణలో ఊహించని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసి చూపించారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. గురువారం హుజూరాబాద్‌లోని సిటీ సెంటర్‌లో మున్నూరుకాపు, రజక సంఘాల కులస్థులకు కమ్యూనిటీ హాల్స్‌ నిర్మాణానికి ఎకరం భూమి, నిధులు విడుదల చేస్తూ జారీ చేసిన జీవో కాపీలను అందజేశారు. అనంతరం హుజూరాబాద్‌ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌లో రెండో విడత గొర్రెల పంపిణీ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. కుల వృత్తులను నమ్ముకున్న వారిని ఆదుకున్నది కేసీఆర్‌ అన్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి మానసపుత్రిక అని అన్నారు. గొల్ల కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసి లక్షధికారులను చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్యేయమమన్నారు. గొర్రెల యూనిట్‌ ధరను 1.25 లక్షల నుంచి 1.75 లక్షలకు పెంచామన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీని ఈ నెల 28న జమ్మికుంటలో ప్రారంభిస్తామన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని లబ్ధిదారుల వాటా కింద 2,874 మంది డీడీలు చెల్లించారని, ఇంకా 1500 మంది చెల్లించాల్సి ఉందన్నారు. గొర్రెల వైద్యం కోసం వంద అంబులెన్స్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి వ్యాధి సోకిన 1098కు ఫోన్‌ చేస్తే వైద్యులు ఇంటి వద్దకే వచ్చి సేవలందిస్తారన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ తెలంగాణలో బీసీలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆరే అని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటిన ఆత్మగౌరవ భవన నిర్మాణాన్ని ఎవరూ పట్టించుకోలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తున్న ముఖ్యమంత్రికి అండగా నిలవాలని కోరారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ప్రతి గ్రామంలో గొల్ల కురుమలు వంద నుంచి 150 కుటుంబాలు ఉంటాయని, వారందరికి గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. సమావేశంలో  ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌, ఎమ్మెల్సీలు మల్లేశంయాదవ్‌, బస్వరాజ్‌ సారయ్య, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్‌, గరిమా అగర్వల్‌, ట్రైనీ కలెక్టర్‌ మాయంక్‌ మిట్టల్‌, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌, యాదవ కుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-23T06:35:04+05:30 IST