Abn logo
Jan 17 2021 @ 00:14AM

మరపురాని మహా మనిషి

సినిమారంగంలో, రాజకీయాల్లో అఖండ ఖ్యాతినార్జించిన తెలుగుతేజం నందమూరి తారక రామారావు చిరస్మరణీయులు. తెలుగు సినిమారంగాన్ని మకుటం లేని మహారాజుగా ఏలుతున్న ఎన్‌టిఆర్‌‌ తనకు ధనం, యశస్సు ఉదారంగా సమకూర్చిన ప్రజల రుణం తీర్చుకోవాలనే సత్సంకల్పంతో  60 సంవత్సరాల వయసులో రాజకీయ రంగప్రవేశం చేశారు. 1982 మార్చి 28న కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. తెలుగు రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి ఎదురులేని కాలంలో తెలుగు ఆత్మగౌరవం నినాదంతో చైతన్యరథమెక్కి ఎండనకా, వాననకా, దుమ్మూధూళీ లెక్కచెయ్యకుండా తెలుగు నేల నలుదిక్కులా ప్రభంజనంలా చుట్టేశారు. ఉన్నవాడికే అధికారం అన్న తుచ్ఛ సంప్రదాయాన్ని కాలరాయాలన్నారు. పేదలకు, బడు గువర్గాలకు పార్టీలో చోటు కల్పించారు. పార్టీ పదవులకు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులుగా నీతిమంతులను, అవకాశం ఉన్నంత వరకు గ్రాడ్యుయేట్లను, పోస్ట్ గ్రాడ్యుయేట్లను ఎంపిక చేశారు. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వమన్నారు. సామాజిక న్యాయం తన లక్ష్యమన్నారు. ఆడపడుచుల జీవితాలలో వెలుగులు నింపాలన్నారు. ఆయన ప్రచారయాత్రలో వైవిధ్యం ప్రజలను ఆకట్టుకుంది. తెలుగు వైభవం ప్రభవిల్లేలా రూపొందించిన ప్రచారగీతాల క్యాసెట్లతో ఎన్నికల ప్రచారం ఎంతో ఉత్తేజకరంగా సాగింది. 


తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే 1983 జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్‌టిఆర్‌‌ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజల చేతికి పాలనాధికారం అందించిన నేపథ్యంలో ఎన్‌టిఆర్‌‌ పాత్ర అనితర సాధ్యం. ఆయన ఆదర్శవాదంతో, స్ఫూర్తితో ఎందరో యువకులు, విద్యావంతులు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో కొత్తశకం ఆరంభమైంది. చాలామంది శాసనసభ్యులకు రాజకీయ చరిత్ర లేదు. ఎన్‌టిఆర్‌‌ వారికి రాజకీయ శిక్షణ, పరిపాలనపై అవగాహన కల్పించడానికి పూనుకున్నారు. తమ శాసనసభ్యులకు ప్రవర్తనా నియమావళి జారీ చేశారు. 


అవినీతిని అసహ్యించుకునే ఎన్‌టిఆర్‌‌కు తమ పార్టీలోనే ముసలం పుట్టింది. కొందరు శాసనసభ్యులు తిరుగుబాటు చేశారు. వారికి నాదెండ్ల భాస్కరరావు నేతృత్వం వహించారు. గవర్నర్ రాంలాల్ ప్రోత్సాహంతో వారు 1984 ఆగస్టు నెలలో ఎన్‌టిఆర్‌‌ను గద్దె దించారు. ఆ తర్వాత జరిగింది ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక మహోజ్వల ఘట్టం. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలని నమ్మిన ఎన్‌టిఆర్‌‌ న్యాయం కోసం ప్రజల వద్దకు వెళ్ళారు. దేశంలోని ప్రతిపక్ష నాయకులంతా ఆయనకు అండగా తరలివచ్చారు. తెలుగు ప్రజలు సంఘటితమై ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమంలో పాలుపంచుకున్నారు. ప్రజాబలం గెలిచింది. ఎన్‌టిఆర్‌‌ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ‘చాలా, చాలాకాలం తరువాత ఇది మంచివార్త. రాజశక్తిపై లోకశక్తి విజయం సాధించింది. ప్రజాభిప్రాయమే గెలిచింది’ అని అటల్ బిహారీ వాజపేయి అన్నారు. అది మొదలు ప్రతిపక్ష పార్టీలు దేశ రాజకీయాల్లో ఎన్‌టిఆర్‌‌కు పెద్దపీట వేశాయి. ఎన్‌టిఆర్‌‌ రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రంపై పోరాటం సలిపారు. ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల మంచి కోసం అహర్నిశలూ పాటుబడ్డారు. నేషనల్ డెవెలప్‌మెంట్ కౌన్సిల్ సమావేశంలో విపక్షాలు పాలించే రాష్ట్రాల తరఫున ఇందిరాగాంధీపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ‘తెలుగు ఆత్మగౌరవానికి ప్రతిబింబమైనప్పటికీ, ఎన్‌టిఆర్‌‌ అమూలాగ్రం దేశభక్తుడు. నిజానికి తన అచంచలమైన జాతీయవాద అంకితభావంతో న్యాయసమ్మతమైన ప్రాంతీయ ఆకాంక్షలను సమతుల్యం చేసి ఆయన ముందు తరాలకు ఉదాహరణగా నిలిచారు’ అని ఎల్‌కెఅద్వానీ అన్నారు. తర్వాత కాలంలో ప్రతిపక్షాలను సంఘటితం చేసి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. ఆ రాజకీయ కూటమికి ఛైర్మన్ అయ్యారు. కూటమి తరఫున విపి సింగ్‌ను ప్రధానమంత్రి గద్దెపై కూర్చోబెట్టారు. 


ఎన్‌టిఆర్‌‌ మేధావి కాదు. అందుకే నిపుణులైన వారితో సంప్రదించడానికి ఆయన ఏమాత్రం సంకోచం చెందేవారు కాదు. అధికారం ఉందనే గర్వం ఆయనకు లేదు. తాను చెప్పిందే వేదమన్న అహంకారమూ ఆయనకు లేదు. తన ఆలోచన సబబు కాదని చెప్పేవాళ్ళను ఆయన అణగదొక్కాలని ప్రయత్నించలేదు. మరొకరు చెప్పింది సబబైనప్పుడు దాన్ని ఒప్పుకునే సంస్కారం ఆయనకు సహజంగా అబ్బింది. ఇతరులలో మంచిని గ్రహించే మానసికస్థాయి ఆయనకు ఉండేది. 


ఎన్‌టిఆర్‌‌పై చేసిన కొన్ని అసంబద్ధమైన ఆరోపణలు న్యాయస్థానం పరిధిలోకి రాకున్నా వాటిని స్వీకరించి, విలువనిచ్చి ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వెలువరించిన నెలరోజులకే ఛీఫ్ జస్టిస్ భాస్కరన్ పదవీ విరమణ చేశారు. ఆ దురుద్దేశపూర్వకమైన తీర్పు తాలూకు గాయం పచ్చిపుండులా తొలుస్తున్నా కూడా తన సహజసిద్ధమైన హుందాతనంతో భాస్కరన్ గౌరవార్థం విందు ఏర్పాటు చేసి, శాలువాతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికిన సౌజన్యమూర్తి ఎన్‌టిఆర్‌‌.


తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డులో సజ్జనులు, ధర్మచింతన కలిగిన వ్యక్తులనే సభ్యులుగా నియమించేలా ఎన్‌టిఆర్‌‌ జాగ్రత్త తీసుకున్నారు. ఆలయంలోనే బోర్డు సభ్యుల నుద్దేశించి ప్రసంగిస్తూ ‘రాజుకు శాసనాధికారం ఉన్నా ఆ అధికారం ధర్మానికి లోబడి ఉండాలి. ధర్మ సంరక్షణ రాజు ముఖ్య కర్తవ్యం’ అన్నారు. ముఖ్యమంత్రి కుర్చీ ధర్మపీఠమని ఆయన నమ్మారు. ధర్మంగా పాలన చేశారు. చేగొండి వెంకట హరి రామజోగయ్య తమ రాజకీయ ప్రస్థానం పుస్తకంలో కాసు బ్రహ్మానందరెడ్డి నుంచి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి వరకు వారి వారి నీతి నిబద్ధత, తదితర అంశాలను వ్యక్తిగతంగా గుణగణన చేసి మార్కులు ఇచ్చారు. నీతి, నిబద్ధతలో ఎన్‌టిఆర్‌‌కు 90 శాతం మార్కులు, చంద్రబాబు నాయుడుకు 70 శాతం, డా. వైఎస్ రాజశేఖరరెడ్దికి 20 శాతం మార్కులు వేశారు.


ఎన్‌టిఆర్‌‌ నియంత అనీ, మంత్రులను సంప్రదించకుండానే అన్ని నిర్ణయాలు తీసుకొనేవారనీ విమర్శలు వినిపించాయి. ఆయన ఎప్పుడూ ఒక విధమైన ఉద్రేక స్థితిలో ఉండేవారు. అందుకే విమర్శకులు ఆరోపించినట్లు ఆయన నిర్ణయాలలో ఆవేశం ఉండేది. తర్కం, హేతుబద్ధత అప్పుడప్పుడు బలహీనంగా ఉండేవి. కానీ తాను నమ్మిన ప్రాథమిక సిద్ధాంతాలలో రాజీపడాల్సిన అవసరం రానంతవరకూ ఎన్‌టిఆర్‌‌ తనని తాను సంస్కరించుకునేందుకు ప్రయత్నించేవారు. 


ముఖ్యమంత్రిగా ఎన్‌టిఆర్‌‌ చేపట్టిన సంస్కరణలు నభూతో న భవిష్యతి. ఏ ముఖ్యమంత్రి అయినా తన అయిదేళ్ల పాలనకాలంలో తీసుకున్నానని గొప్పగా చెప్పుకొని గర్వించే సంస్కరణలు ఎన్నింటినో ఆయన పదవిలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే తీసుకున్నారు. అంతకు ముందు ప్రభుత్వాలు అన్నీ కలిపి చేయనన్ని మంచి పనులు ఆయన ప్రభుత్వం చేసింది. అందరికీ తెలిసిన రెండు రూపాయలు బియ్యం పథకం, జనతా వస్త్రాలు, పేదలకు పక్కాఇళ్ళు వంటివే కాకుండా ఆయన తీసుకువచ్చిన మరికొన్ని గొప్ప సంస్కరణలను గుర్తు చేసుకుందాం.


విద్య వల్ల కలిగే ప్రయోజనం ఎన్‌టిఆర్‌‌కు తెలుసు. అందుకే విద్యావేత్తలతో ఆయన తరచుగా సమావేశమై విద్యావ్యవస్థను అర్థవంతంగా, ప్రయోజనకరంగా తీర్చిదిద్దడానికి కావలసిన రీతిలో ఆలోచనలు చేస్తూ తగిన విధానాలు రూపొందించాలని వారిని పదేపదే కోరేవారు. ఆ రకమైన తృష్ణ ఫలితంగా, అచంచలమైన చిత్తశుద్ధితో ఆయన సంప్రదాయేతర, ప్రత్యామ్నాయ విశ్వవిద్యాలయాలు స్థాపించడానికి కారకులయ్యారు. 1985లో తెలుగు విశ్వవిద్యాలయం చట్టాన్ని రూపొందించి, తెలుగు భాషకు గౌరవచిహ్నంగా ఆ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. విశ్వవిద్యాలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటే బాధ్యత, జవాబుదారీతనం పెరుగుతాయని ఆయన విశ్వసించేవారు. అందుకే వాటిని రాజకీయాలకు అతీతంగా ఉంచారు. వైస్ ఛాన్సలర్ల ఎంపికలో సంకుచిత, ప్రాంతీయ ప్రయోజనాలను తోసిరాజని, నైతిక నిష్ఠ, అర్హత, మంచి ట్రాక్ రికార్డును మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. మంచి విద్యావేత్తల కోసం దేశవ్యాప్తంగా గాలించేవారు. యూనివర్సిటీల ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లలో, సెనేట్లలో సభ్యులుగా పాత పద్ధతిని కాదని విద్యావేత్తలను, మేధావులను నామినేట్ చేశారు. సామాజిక చైతన్యానికి, ఆర్థికాభివృద్ధికి విద్య ఆలంబన అని ఎన్‌టిఆర్‌‌ నమ్మారు. నాణ్యతతో కూడిన విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే సదాశయంతో పాఠశాలల్లో బోధన పిల్లలకు విద్యపై అభిరుచి పెంచేలా, ఆనందదాయకంగా ఉండాలని భావించారు. అందుకే స్కూలు పిల్లల కోసం పాఠాలను తేటతెలుగులో వీడియో ఫిల్ములుగా రూపొందించమని బాపు, ముళ్లపూడి వెంకటరమణలకు పురమాయించారు. పిల్లలు బడికి పరుగెత్తేలా చెయ్యాలి అన్న లక్ష్యంతో వారిరువురు వీడియో పాఠాలు రూపొందించారు. ఆటపాటలతో అక్షరాలు, అంకెలు గుర్తించడం, రాయడం తెలిపారు. సముద్రం, అలలు షూట్ చేసి చూపించారు. ఆనకట్టలు చూపించారు. జూకి తీసుకెళ్ళి పులులూ, సింహాలూ, లేళ్ళూ చూపించారు. కూడికలూ, తీసివేతలూ, భాగహారాలూ సులువుగా అర్థమయ్యే రీతిలో చెప్పారు. పద్యాలు చెప్పించారు. పాటలు పాడించారు. సైన్సు, భూగోళం సిలబస్ ప్రకారం పాఠాలు చిత్రీకరించారు. పాఠాలు చూసి ఎన్‌టిఆర్‌‌ పులకించిపోయారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం చక్కని వసతులతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గురుకుల్ పాఠశాలలు నెలకొల్పారు.


తిరుమల కొండలు విభిన్న వృక్షజాతులకు ఆలవాలమై చూపరులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కానీ మూడు దశాబ్దాల క్రితం వరకూ తిరుమలలో అడవి కనుమరుగై కొండల్లో వికారంగా రాళ్ళు మాత్రమే కనిపించేవి. తిరుమల కొండల్లో పెద్ద ఎత్తున వృక్షసంపద పెంపొందించడానికి ఎన్‌టిఆర్‌‌ కృషి చేశారు. దివ్యారామం ప్రాజెక్టును ఆవిష్కరించారు. దిగువ తిరుపతిలో తిరుమల కొండల చుట్టూ కాంక్రీట్ భవనాలు వెలిస్తే తిరుమల క్షేత్ర పవిత్రత దెబ్బతింటుందని ఎన్‌టిఆర్‌‌ ఊహించి కొండ కింద చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కన్జర్వేషన్ జోన్‌గా (రక్షిత ప్రదేశం) ప్రకటించారు. ఆయన తీసుకున్న జాగ్రత్త వల్ల తిరుమల దిగువ క్షేత్రం ఆక్రమణలకు గురికాకుండా సురక్షితంగా ఉంది. తిరుమలపై రాజకీయ పార్టీలు జెండాలు, బ్యానర్లు, వాల్‌పోస్టర్లు ఏర్పాటు చేయకుండా కార్యక్రమాలు కొనసాగించకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. ఆ నిషేధం ఇప్పటికీ అమలులో ఉంది.


ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కలిగిస్తూ 1984లో చట్టం చేశారు. కేంద్రప్రభుత్వం అదే హక్కును 2004లో చట్టరూపేణా దేశమంతా కల్పించింది. జీవితాన్ని వృథా చేయకుండా లక్ష్యశుద్ధితో ప్రయాణం చేశారు ఎన్‌టిఆర్‌‌ ఉగాదులూ, ఉషస్సులూ లేని బడుగు జీవితాల్లో కొత్తవెలుగులు నింపినందుకు, ప్రజల పట్ల నిజాయితీతో వ్యవహరించినందుకు, వాళ్ళని మభ్యపెట్టనందుకు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే నా దేవాలయమని త్రికరణశుద్ధిగా నమ్మినందుకు ఎన్‌టి ఆర్‌‌ను తెలుగు ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. 

డా. కె. లక్ష్మీనారాయణ

వ్యాసకర్త ‘ఎన్‌టిఆర్‌‌ సమగ్ర జీవిత కథ’ సహ రచయిత 

(రేపు ఎన్‌టిఆర్ 25వ వర్ధంతి)

Advertisement
Advertisement
Advertisement