ఎడతెరపి లేని వాన

ABN , First Publish Date - 2021-07-23T06:48:07+05:30 IST

ఉపరితల ఆవర్తనంతో జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి మొదలైన వాన రెండు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తుండడంతో జనజీవనం స్థంభించిపోయింది.

ఎడతెరపి లేని వాన

- ఎల్‌ఎండీకి భారీగా వరద నీరు 

- 12 గేట్లు ఎత్తివేత 

- పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు 

- స్తంభించిన జనజీవనం 

- మరో 48 గంటలపాటు భారీ వర్ష సూచన 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఉపరితల ఆవర్తనంతో జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి మొదలైన వాన రెండు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తుండడంతో జనజీవనం స్థంభించిపోయింది. జిల్లాలోని దిగువ మానేరు రిజర్వాయర్‌ (ఎల్‌ఎండీ) తోపాటు చెరువులు, కుంటలు, వాగులు, వంకల్లోకి భారీగా వరద నీరు చేరడంతో పొంగిపొర్లుతున్నాయి. దిగువ మానేరు రిజర్వాయర్‌(ఎల్‌ఎండీ)లోకి  భారీగా ఇన్‌ఫ్లో రావడంతో  రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ 12 గేట్లను ఎత్తి 60వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

మత్తళ్లు దూకుతున్న చెరువులు

ఇప్పటికే జిల్లాలోని చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షంతో మత్తళ్లు దుముకుతున్నాయి. పలుచోట్ల చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి.. కరీంనగర్‌ రూరల్‌ మండలం గోపాల్‌పూర్‌ ఎలబోతారం మధ్య నిర్మించిన చెక్‌డ్యాం కరకట్టకు గండిపడింది. వీణవంక మండలంలోని ఎలబాకలో వైకుంఠధామం ప్రహారీ కూలిపోయింది. నర్సింగాపూర్‌లో దాదాపు 100 ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. 

 చెరువులను తలపించిన రోడ్లు

కరీంనగర్‌లోని ప్రధాన రహదారులతోపాటు పలు కాలనీల్లోని డ్రైనేజీలు నిండి రోడ్లపైకి వరద నీరు రావడంతో జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులుపడ్డారు.  కొన్ని పాత ఇళ్లు పూర్తిగా కూలిపోగా చాలా చోట్ల పాక్షికంగా దెబ్బతిన్నాయి.  ఆస్తి, ప్రాణ నష్టం జరుగక పోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. అప్రకటిత సెలవు వాతావరణం కనిపించింది.  జనం తప్పనిసరి అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. దీనితో రోడ్లపై రద్దీ తగ్గింది. 

39.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం

బుధవారం ఉదయం 8.30 నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో 38.9 మిల్లీమీటర్ల సగటు వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా రామడుగు మండలంలో 67.4 మిల్లీమీటర్లు, అత్యల్పంగా చొప్పదండి మండలంలో 23.2మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులు, ప్రజాప్రతినిధులు పలు చోట్ల అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపడుతున్నారు. 

 తడిసి ముద్దయిన కరీం‘నగరం’

కరీంనగర్‌ టౌన్‌: రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో కరీంనగర్‌ తడిసి ముద్దయింది. నగరంలోని కలెక్టరేట్‌, తెలంగాణచౌక్‌, రాంనగర్‌, మంచిర్యాల చౌరస్తా, విద్యానగర్‌, కట్టరాంపూర్‌, భగత్‌నగర్‌, కమాన్‌, లక్ష్మినగర్‌, హనుమాన్‌నగర్‌, గణేశ్‌నగర్‌, కార్ఖానగడ్డ తదితర ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమలమయ్యాయి. చాలా చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. నగరంలో పలు చోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వర్షం నీరు నిలవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. కొన్ని చోట్ల మొకాళ్ల లోతు నీరు రోడ్లపై నిలువడంతో ద్విచక్రవాహనాదారులు ఇక్కట్లకు గురయ్యారు. ఖాళీ పాట్లలో భారీగా వర్షపు నీరు నిలిచింది. నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని, వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక పారిశుధ్య పనులను నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. 

డివిజన్లలో పర్యటించిన కమిషనర్‌

మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి వర్షంలోనే నగరంలోని పలు డివిజన్లలో పర్యటించి వరద నీటి సమస్యలను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వరదనీటిని ఎప్పటికప్పుడు మళ్లించాలని అధికారులను ఆదేశించారు. స్మార్ట్‌సిటీ రోడ్లు, డ్రైనేజీలు, యూజీడీ మ్యాన్‌హోల్స్‌ను పరిశీలించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉండడంతో మున్సిపల్‌ డీఆర్‌ఎస్‌టీంలను అప్రమత్తం చేశారు. శివారుప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఫ నిండిన నారాయణపూర్‌ రిజర్వాయర్‌

గంగాధర: రెండు రోజులుగా కురుస్తున్న బారీ వర్షాలకు నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నిండింది. ఎగువన కొడిమ్యాల మండలం నుంచి భారీగా వరద నీరు నారాయపూర్‌ రిజర్వాయర్‌కు వస్తోంది. రెండు రోజులకే రిజర్వాయర్‌ నిండడంతో ఎడమ కాలువ గేటు ఎత్తి నీరు విడుదల చేశారు. గంగాధర, బోయినపల్లి మండలాల మద్య రోడ్డు కల్వర్టు కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లక్ష్మీదేవిపల్లి, నారాయణపూర్‌, గంగాధర గ్రామాల్లో ఇళ్లు నీటమునిగాయి. గంగాధర వాగు సమీపంలో ప్రత్యామ్నాయ రోడ్డు మట్టి కొట్టుకు పోయి ప్రమాదకరంగా మారింది.

 కరీంనగర్‌ రూరల్‌: కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని దుర్శేడ్‌ గ్రామంలో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడ్డారు. రాజీవ్‌ రహదారిపై నుండి వరద నీరంతా గ్రామంలోకి వస్తుండడంతో వరద నీటితో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ సర్పంచ్‌ వెంకటమ్మ, ఉపసర్పంచ్‌ సుంకిశాల సంపత్‌రావు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

 జలదిగ్భంధంలో రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌

కరీంనగర్‌ క్రైం: ఎడతెరిపిలేని వర్షాలతో కలెక్టరేట్‌లోని జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం జలదిగ్భంధంలో చిక్కుకుంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కుర్సిన వర్షంతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయం చుట్టూ భారీగా వర్షపు నీరు చేరింది. అధికారులు, సిబ్బందితోపాటు క్రమవిక్రయదారులు కార్యాలయంలోకి వెళ్ళేందుకు నానా తంటాలుపడ్డారు. వర్షానికితోడు రిజిస్ట్రేషన్‌ కార్యాలయం సమీపంలో ఒక చెట్టు నేలకూలఛింతో విద్యుత్‌సరఫరా నిలిచిపోయింది. దీంతో కార్యాలయంలో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్‌ ఫీజు పెంపుకారణంగా గురువారం మొదటిరోజు కరీంనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కేవలం తొమ్మిది రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. 

Updated Date - 2021-07-23T06:48:07+05:30 IST