Abn logo
Sep 25 2021 @ 16:42PM

తెలంగాణా సహా 8 రాష్ట్రాలకు కేంద్ర నిధులు

న్యూఢిల్లీ : మూల ధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సాయం పథకం క్రింద తొలి విడత నిధులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ పథకం క్రింద తెలంగాణా సహా ఎనిమిది రాష్ట్రాలకు చెందిన కేపిటల్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటి విలువ రూ.2,903.80 కోట్లు కాగా, దీనిలో రూ.1,393.83 కోట్లు విడుదల చేసింది. ఈ ప్రాజెక్టులు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి. 


కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ పథకం క్రింద 50 సంవత్సరాలపాటు వడ్డీ లేని రుణాలను రాష్ట్రాలకు కేంద్రం అందిస్తుంది. మూలధన వ్యయం కోసం రూ.15,000 కోట్ల వరకు రుణాలను 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇస్తుంది. ఈ పథకం క్రింద ప్రారంభంలో తెలంగాణా, బిహార్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, సిక్కిం లబ్ధి పొందుతున్నాయి. 


మూలధన వ్యయానికి సంబంధించిన హయ్యర్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ దృష్ట్యా, కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం నేపథ్యంలో రాష్ట్రాలకు చాలా అవసరమైన వనరులను అందజేయడం కోసం ఈ పథకాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రవేశపెట్టినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 


ఈ పథకంలో భాగంగా రూ.2,600 కోట్లు వరకు ఈశాన్య, కొండ ప్రాంత రాష్ట్రాలకు అందజేస్తారు. దీనిలో రూ.400 కోట్లు చొప్పున అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ పొందుతాయి. ఈ గ్రూప్‌లో మిగిలిన రాష్ట్రాలకు రూ.200 కోట్లు చొప్పున ఇస్తారు. దాదాపు రూ.7,400 కోట్లు మిగిలిన రాష్ట్రాలకు ఇస్తారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం అవార్డు ప్రకారం, కేంద్ర పన్నుల్లో వాటా దామాషాలో రాష్ట్రాలకు రుణాలను అందజేస్తారు. నగదీకరణ/మౌలిక సదుపాయాల ఆస్తుల రీసైకిలింగ్, స్టేట్ పీఎస్ఈల డిజిన్వెస్ట్‌మెంట్ చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందజేయడం కోసం రూ.5,000 కోట్లు కేటాయించారు. 


ఇవి కూడా చదవండిImage Caption