చైనాను నిలువరించిన ITBP సిబ్బందికి మెడల్స్

ABN , First Publish Date - 2021-10-31T20:57:19+05:30 IST

తూర్పు లడఖ్‌లో చైనా సైన్యంతో ఏర్పడిన ప్రతిష్టంభన

చైనాను నిలువరించిన ITBP సిబ్బందికి మెడల్స్

న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లో చైనా సైన్యంతో ఏర్పడిన ప్రతిష్టంభన సమయంలో అసాధారణ సేవలందించిన 260 మంది ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బందికి కేంద్ర హోం మంత్రి స్పెషల్ ఆపరేషన్ మెడల్‌ను ఆదివారం ప్రకటించారు. వివిధ రాష్ట్రాల పోలీసు, కేంద్ర బలగాలకు చెందిన 397 మంది పేర్లతో ఓ నోటిఫికేషన్‌ను హోం మంత్రిత్వ శాఖ జారీ చేసింది. 


ఐటీబీపీ అధికార ప్రతినిధి ఒకరు విడుదల చేసిన ప్రకటనలో, 2020 మే నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యలో తూర్పు లడఖ్‌లో తమ దళాలు చూపిన అసామాన్య ధైర్యసాహసాలు, విధి నిర్వహణ పట్ల అంకితభావాలకు గుర్తింపుగా ఈ అవార్డును ఇచ్చినట్లు తెలిపారు. ఒకేసారి ఓ పోలీసు దళానికి ఇంత పెద్ద సంఖ్యలో పురస్కారాలు లభించడం విశేషం. మంచు కొండల్లో ‘స్నో లియోపార్డ్’ ఆపరేషన్ ద్వారా అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో లడఖ్‌లో సరిహద్దులను ఐటీబీపీ సిబ్బంది కాపాడారని తెలిపారు. తమ దళం అత్యున్నత స్థాయి వ్యూహాత్మక ప్రణాళికను అమలు చేసిందన్నారు. క్షేత్ర స్థాయిలో కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. అనుబంధ సంస్థలన్నిటితోనూ సమగ్రమైన సమన్వయంతో ఈ కార్యకలాపాలను నిర్వహించినట్లు తెలిపారు. 


కేంద్ర హోం మంత్రి స్పెషల్ ఆపరేషన్ మెడల్‌ పొందినవారిలో ఐటీబీపీ నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ మాజీ కమాండర్ (లేహ్) ఇన్‌స్పెక్టర్ జనరల్ దీపమ్ సేఠ్ కూడా ఉన్నారు. 


Updated Date - 2021-10-31T20:57:19+05:30 IST