పింఛనుపై కాంగ్రెస్‌ జీవనం : కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2021-10-29T02:20:22+05:30 IST

కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై బీజేపీ నేత, కేంద్ర

పింఛనుపై కాంగ్రెస్‌ జీవనం : కేంద్ర మంత్రి

లక్నో : కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు గుప్పించారు. పింఛనుపై జీవిస్తున్న కుటుంబ పార్టీ కాంగ్రెస్ అని, తన కుటుంబాన్ని పటిష్టం చేసుకోవడంలో తీరిక లేకుండా గడుపుతున్న యువరాజు అఖిలేశ్ యాదవ్ అని ఎద్దేవా చేశారు. బీజేపీ బ్యాక్‌వర్డ్ ఫ్రంట్ నిర్వహించిన సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. 


ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ ఆ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. కుర్మి సామాజిక వర్గం సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. వెనుకబడిన వర్గాలవారిని సమైక్యపరుస్తున్నామని ఓ కుటుంబానికి చెందిన యువరాజు (సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్) తీరిక లేకుండా గడుపుతున్నారని పేర్కొన్నారు. ‘‘మీరు వెనుకబడిన వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తెస్తున్నారా? మీ కుటుంబాన్ని పటిష్టపరుచుకుంటున్నారా?’’ అని ప్రశ్నించారు. 


ఢిల్లీలోని కుటుంబ పార్టీ (కాంగ్రెస్) ఎవరి నాయకత్వంలో పని చేయాలో తేల్చుకోలేకపోతోందన్నారు. ఆ పార్టీ పరిస్థితిని చూడాలని ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వస్తే పింఛను పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్తోందన్నారు. ‘‘మీరే పింఛనుపై జీవిస్తున్నారు’’ అని ఆ పార్టీని ఎద్దేవా చేశారు. 


కుర్మి సామాజిక వర్గానికి చెందినవారికి మంత్రి పదవులు, గవర్నర్ పదవులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇచ్చారని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించిందన్నారు. 


Updated Date - 2021-10-29T02:20:22+05:30 IST