ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు జడ్జీలతో ధర్మాసనం

ABN , First Publish Date - 2021-10-25T08:22:21+05:30 IST

ఎస్సీ వర్గీకరణ కోసం ఏడుగురు జడ్జీలతో ధర్మాసనం వేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు. వర్గీకరణ కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. బోయినపల్లిలోని జీవీఆర్‌ గార్డెన్స్‌లో ఆదివారం ..

ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు జడ్జీలతో ధర్మాసనం

  • మాదిగ ఉద్యోగుల జాతీయ మహాసభలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, మురుగన్‌, నారాయణస్వామిలతో మందకృష్ణ మాదిగ
  • సీజేఐ, న్యాయ శాఖ మంత్రితో నేను మాట్లాడతా
  • మాదిగ ఉద్యోగుల మహాసభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి


బోయినపల్లి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ కోసం ఏడుగురు జడ్జీలతో ధర్మాసనం వేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు. వర్గీకరణ కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. బోయినపల్లిలోని జీవీఆర్‌ గార్డెన్స్‌లో ఆదివారం మాదిగ ఎంప్లాయూస్‌ ఫెడరేషన్‌(ఎంఈఎఫ్‌) ఆధ్వర్యంలో మాదిగ ఉద్యోగుల జాతీయ మహాసభ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు మురుగన్‌, నారాయణస్వామి, కిషన్‌రెడ్డి.. మందకృష్ణ మాదిగ, జాతీయ ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు రాములు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ జాతి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోందన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర న్యాయ శాఖ మంత్రితో తాను చర్చిస్తానని తెలిపారు. గతంలో వర్గీకరణ వద్దు అని ఐదుగురు న్యాయమూర్తులు.. కావాలని ఐదుగురు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. 2020లో వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు. వర్గీకరణ కోసం ఏడుగురు జడ్జీలతో బెంచ్‌ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన మరో ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


ఉషా మెహ్రా కమిషన్‌ రిపోర్టును అమలు చేయాలని, పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ పెండింగ్‌లో ఉందని మందకృష్ణ మాదిగ అన్నారు. మీపై మాదిగ జాతి భవిష్యత్తు ఆధారపడి ఉందని కేంద్ర మంత్రులను ఉద్దేశించి అన్నారు. నవంబరు 14న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి దళితజాతి మొత్తం తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులను సన్మానించారు. కార్యక్రమంలో ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, ప్రొఫెసర్‌ కాశీం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-25T08:22:21+05:30 IST