ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి షెకావత్ లేఖ రాశారు. నిర్మాణంలో ఉన్న కొత్త ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌లు వెంటనే ఇవ్వాలని లేఖలో కోరారు. అక్టోబర్ 6నాటి అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం అమలు చేయాలని ఆదేశించారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్ట్‌లపై పరస్పరం కేంద్రానికి ఏపీ, తెలంగాణ ఫిర్యాదు చేశాయి. ఇరు రాష్ట్రాల ఫిర్యాదులపై కేంద్ర జలశక్తిశాఖ స్పందించింది. గత అక్టోబర్ 6న ఇద్దరు సీఎంలు, మంత్రులు, అధికారులతో అపెక్స్ కౌన్సిల్ భేటీ అయింది. ఏపీ, తెలంగాణ చేపట్టిన కొత్త ప్రాజెక్ట్‌లకు అనుమతి తప్పనిసరని కేంద్రమంత్రి లేఖలో స్పష్టం చేశారు. కృష్ణాపై 8, గోదావరిపై 7 ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌లు తెలంగాణ ఇవ్వాలని కేంద్రం పేర్కొంది. డీపీఆర్‌లు సహా అన్ని రకాల అనుమతులు తీసుకోవాలని జలశక్తి శాఖ చెప్పింది. తెలంగాణ నుంచి ఒక్క డీపీఆర్ కూడా రాలేదని షెకావత్ పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతలపై నిబంధనల మేరకు డీపీఆర్ ఇవ్వాలని, పట్టిసీమ 3వ దశ డీపీఆర్ ఇవ్వాలని గోదావరి బోర్డు కోరిన విషయాన్ని షెకావత్ లేఖలో ప్రస్తావించారు.