కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్ట్

ABN , First Publish Date - 2021-08-24T21:07:29+05:30 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై వివాదాస్పద వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్ట్

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ముఖ్యమంత్రికి చెంప దెబ్బ అని ఆయన అన్నట్లు ఆరోపిస్తూ ఫిర్యాదులు నమోదైన నేపథ్యంలో, వీటిని రద్దు చేయాలని కోరుతూ ఆయన బోంబే హైకోర్టును ఆశ్రయించారు. 


జన ఆశీర్వాద్ యాత్రలో పాల్గొన్న నారాయణ్ రాణేను మంగళవారం మధ్యాహ్నం రత్నగిరి పోలీసులు అరెస్టు చేశారు. రాణే తరపున అడ్వకేట్ అనికేత్ నికమ్ బోంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాణేపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలని కోరారు. ఆయనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. ముందస్తు బెయిలు కోసం నారాయణ్ రాణే చేసిన విజ్ఞప్తిని రత్నగిరి కోర్టు తిరస్కరించింది. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నారాయణ్ రాణే జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా సోమవారం రాయ్‌గఢ్‌లో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రసంగించినపుడు, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలైందనే విషయాన్ని మర్చిపోయారని తెలిపారు. ఎన్ని సంవత్సరాలైందో లెక్కపెట్టాలని తన సహచరులను ఉద్ధవ్ ప్రసంగం మధ్యలో కోరారన్నారు. ముఖ్యమంత్రికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలైందో తెలియకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఆ సమయంలో తాను అక్కడ ఉండి ఉంటే గట్టిగా చెంప దెబ్బ కొట్టి ఉండేవాడినన్నారు. దీంతో శివసేన నేతలు తీవ్రంగా స్పందించి, రాణేపై ఫిర్యాదులు చేశారు. వీథుల్లోకి వచ్చి ధర్నాలు కూడా చేశారు. 


ఇదిలావుండగా, బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలన్నారు. తాను వారిని బెదిరించడం లేదన్నారు. గతంలో ఇలా ప్రవర్తించినవారు ఇప్పుడు ఎలా ఉన్నారో గుర్తుపెట్టుకోవాలన్నారు. బీజేపీ కార్యాలయాలపై దాడి చేస్తే సహించబోమన్నారు. హింసపై తమకు నమ్మకం లేదని చెప్పారు. దాడులు చేసి తమను బెదిరించలేరని, తాము మౌనంగా ఉండబోమని చెప్పారు. 


Updated Date - 2021-08-24T21:07:29+05:30 IST