డిమాండ్లు నెరవేర్చకుంటే ఐక్య ఉద్యమాలు

ABN , First Publish Date - 2022-01-28T06:02:30+05:30 IST

పెండింగ్‌ డిమాండ్లను తక్షణం నెరవేర్చకపోతే ఐక్య ఉద్యమాలకు దిగుతా మని ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ(జేఏసీ) కమిటీ నాయకులు స్పష్టం చేశారు.

డిమాండ్లు నెరవేర్చకుంటే ఐక్య ఉద్యమాలు
గేట్‌ మీటింగులో మాట్లాడుతున్న జేఏసీ నాయకులు

- గేట్‌ మీటింగ్‌లో జేఏసీ నాయకుల స్పష్టీకరణ

జ్యోతినగర్‌, జనవరి 27: పెండింగ్‌ డిమాండ్లను తక్షణం నెరవేర్చకపోతే ఐక్య ఉద్యమాలకు దిగుతా మని ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ(జేఏసీ) కమిటీ నాయకులు స్పష్టం చేశారు. గురువారం ఎన్టీపీసీ ప్లాంటు రెండో గేటు వద్ద జరిగిన గేట్‌ మీటింగులో జేఏసీ నాయకులు మాట్లాడుతూ 2018లో ఎన్టీపీసీ యాజమాన్యంతో కుదిరిన ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్టీపీసీ సంస్థ అభివృద్ధికి దశాబ్ధాల కాలంగా పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఇప్పటికీ చాలీచాలనీ జీతాలతో కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీపీసీని మహారత్న సంస్థగా తీర్చిదిద్దడంలో కాంట్రాక్టు కార్మికులు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. 2018 కుదిరిన అగ్రిమెంటు కాలపరిమితి ముగిసి కొత్త ఒప్పందం చేసుకునే సమయం వస్తున్నప్పటికీ గత ఒప్పందం అమలుకు నోచుకోకపోవడం శోఛనీయమన్నారు. పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని ఎన్టీపీసీ సీజీఎంకు వినతి పత్రం ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ప్రమోషన్‌ పాలసీ, ఐటీఐ చదివిన కార్మికులకు పదోన్నతులు, డిపెండెంటెంట్‌ ఉద్యోగావకాశం తదితర డిమాండ్లను అమలు చేయడం లేదన్నారు. వారసత్వ ఉద్యోగాలను కొన్నిరోజులు అమలు చేసి 2020 నుంచి నిలిపివేశారని గుర్తు చేశారు. ఒకవైపు ఒప్పందం అమలు చేయకండా మరోవైపు పోలీసు వెరిఫికేషన్‌, మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టుల పేరుతో కార్మికులను భయబ్రాంతులకు గురిచేస్తోందని వారు ఆరోపించారు. ఇప్పటికైనా జేఏసీ సంఘాలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని, లేకపోతే సోమవారం నుంచి ప్రత్యక్ష ఉద్యమానికి దిగుతామని, సోమవారం నుంచి కార్మికులు యాజమాన్యంతో పోరాటానికి సిద్ధం కావాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ ఏడాదిని ఉద్యమ సంవత్సరంగా పరిగణిస్తున్నామని జేఏసీ నాయకులు చిలుక శంకర్‌ బుచ్చన్న(ఐఎఫ్‌టీయూ), నాంసాని శంకర్‌, గీట్ల లక్ష్మారెడ్డి(సీఐటీయూ), గోదావరి యూనియన్‌ నేత ఆర్‌.రాజమల్లయ్య, సత్యం(హెచ్‌ఎంఎస్‌), టి.శ్రీనివాస్‌(బీఎంఎస్‌), టి.సత్యం(టీఆర్‌ఎస్‌), ఇఫ్టూ నేత నాగభూషణం, టీఎన్‌టీయూసీ నాయకుడు ఎ.శ్రీనివాస్‌ ప్రకటించారు. 


Updated Date - 2022-01-28T06:02:30+05:30 IST