సమైక్యతే మన గమ్యం

ABN , First Publish Date - 2020-10-25T05:56:23+05:30 IST

భగవంతుడు సైతం బలహీనుడిని కాపాడడు! ఈ సత్యాన్నే ఒక సంస్కృత సుభాషితం చక్కగా చెప్పింది. ‘ఒక మత క్రతువులో మనం బలి ఇచ్చేది గుర్రాన్ని కాదు,...

సమైక్యతే మన గమ్యం

సమకాలీన సమస్యల సందర్భంలో విజయదశమి పండుగను మనం పునర్ భావన చేయాలి. కొత్త దృష్టితో, కొత్త సంకల్పంతో, కొత్త పద్ధతిలో మనం దేవీ పూజ చేయాలి. దుష్ట శక్తులపై పోరాడేలా సమాజాన్ని బలోపేతం చేసేందుకు విజయదశమి వేడుకలు ఆలంబన కావాలి...ఒక జాతిగా మనం మరింతగా సమైక్యమవ్వాలి. సమైక్యతే దేశభక్తికి, మాతృభూమి సేవానురక్తికి పునాది. మాతృభూమిని మించిన మహత్వపూర్ణమైనది మరేముంది?


భగవంతుడు సైతం బలహీనుడిని కాపాడడు! ఈ సత్యాన్నే ఒక సంస్కృత సుభాషితం చక్కగా చెప్పింది. ‘ఒక మత క్రతువులో మనం బలి ఇచ్చేది గుర్రాన్ని కాదు, ఏనుగును కాదు, పెద్ద పులిని అంతకంటే కాదు. ఒక గొర్రెను మాత్రమే మనం బలి ఇస్తాం’ అనేదే ఆ సుభాషితం. బక్క జీవులకు రక్షణ కొరవడడం ఒక ప్రాకృతిక నియమం. మానవ జగత్తుకూ ఈ నియమం వర్తిస్తుంది. శక్తిమంతులు మాత్రమే ఆత్మగౌరవంతో బతకగలరు. 


దానవులపై దైవిక శక్తుల విజయోత్సవమే విజయ దశమి. ఇది శక్తి ఉపాసన పండుగ. శక్తిహీనులు దైవ సన్నిధికి చేరుకోలేరని ఉపనిషత్తులు వక్కాణించాయి. శక్తి ఆరాధన జాతులకు అవశ్యం. శక్తిమంతమైన జాతులు మాత్రమే ప్రపంచంలో గుర్తింపు, గౌరవాన్ని పొందుతాయి. దుర్బల దేశాలు విధిగా వాటి ప్రభావంలో ఉంటాయి. తొలినాటి గణరాజ్యాల నుంచి నవీన యుగ జాతిరాజ్యాల దాకా చరిత్రను అవలోకిస్తే శక్తిమంతమైన జన సముదాయాలే గౌరవాదరాలతో మనుగడ సాగించాయని, అశక్త జనులు అవమానాలకు గురయ్యారనే వాస్తవం విదితమవుతుంది. బలహీన ప్రాణులు క్రమంగా అంతరించడమూ, బలమైన జీవులే మనుగడలో ఉండడమే జీవ పరిణామ చరిత్ర. మన మత గ్రంథాలు ప్రవచించిన సత్యాలను శాస్త్రవిజ్ఞానం ధ్రువీకరించింది. కనుక శక్తిసామర్థ్యాలను ఉపాసించడమూ ఉత్సవం చేసుకోవడమూ ఎంతైనా అవసరం.


వీరుల ఉత్సవమే విజయదశమి. అధర్మంపై ధర్మం జయకేతనమే విజయదశమి. ఈ పర్వదినాన శమీవృక్ష పూజ ఒక ఆసక్తికర సంప్రదాయం. రావణునిపై యుద్ధానికి వెళ్ళే ముందు శ్రీరామచంద్రుడు ఒక శమీవృక్షం ముందు తనకు విజయాన్ని సమకూర్చాలని పరాత్పరుని కోరుతూ ప్రార్థనలు చేశాడు. పాండవులు అజ్ఞాతవాసంలోకి వెళ్ళే ముందు తమ ఆయుధాలను శమీవృక్షంపై భద్రపరచుకున్నారని మహాభారతం ప్రస్తావించింది.


నవరాత్రుల ఉత్సవాలలో మనం దుర్గామాత అవతారాలను పూజిస్తాం. మూర్తీభవించిన శక్తే దుర్గమ్మ. దుర్గా పూజ శక్తి ఆరాధనే. మనం సదా శక్తిమంతులుగా విలసిల్లాలని దుర్గామాత ఆశీర్వదిస్తుంది. బాహిర, అంతర్గత దుష్టశక్తులను జయించేందుకు మనలను పురిగొల్పుతుంది. రావణ సంహారంతో ముడివడి ఉన్న పండుగ విజయదశమి. రావణుడు దశాననుడు. ఆయన పదితలలు పది చెడుగులకు ప్రతీకలు. ఈనాడు మన సమాజం అనేకానేక దుష్టశక్తుల బారినపడి విలవిలలాడుతోంది. మహిళలపై దౌర్జన్యాలు, బాలల దోపిడీ, భ్రూణహత్యలు, ఉగ్రవాదం, బడుగువర్గాలను ప్రధాన స్రవంతిలోకి అనుమతించకపోవడం, మాదకద్రవ్యాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నల్లబజారు విక్రయాల వంటి దుర్మార్గాలు, అన్యాయాలు సంఖ్యానేక ప్రజలను అసంఖ్యాక అవస్థలపాలు చేస్తున్నాయి. 


ప్రపంచ ఆరోగ్యసంస్థ తాజా నివేదిక ప్రకారం ఏటా 180 లక్షల మంది మాదకద్రవ్యాల వినియోగం వల్ల మరణిస్తున్నారు. మనదేశంలో మహిళలపై దౌర్జన్యాలు, దాడులు 2019 సంవత్సరంలో 7.3శాతం పెరిగినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. మహిళలకు వ్యతిరేకంగా 4,05,861 నేరాలు సంభవించినట్టు ఆ గణాంకాలు పేర్కొన్నాయి. ఈ నేరాలలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది మహిళలపై నేరాలకు సంబంధించి 18,394 కేసులు నమోదయ్యాయి. ఈ నేరాలలో 2755, ఒక్క హైదరాబాద్ నగరంలోనే జరిగాయి. గృహహింసకు సంబంధించిన కేసుల విషయంలో హైదరాబాద్ దేశంలో ద్వితీయ స్థానంలో ఉంది. మరో దుష్టశక్తి ఉగ్రవాదం. అత్యధిక సంఖ్యలో ఉగ్రవాద దాడులకు గురవుతున్న దేశాలలో మనదేశం మూడోస్థానంలో ఉంది. దేశ సరిహద్దుల ఆవలి నుంచి చొరబడుతున్న ఉగ్రవాదుల మూలంగా కశ్మీర్ వివాదం రావణకాష్ఠంలా మండుతోంది. ఈ దుష్టశక్తులను మనం జయించి తీరాలి.


సమకాలీన సమస్యల సందర్భంలో విజయదశమి పండుగను మనం పునర్‌భావన చేయాలి. కొత్త దృష్టితో, కొత్త సంకల్పంతో, కొత్త పద్ధతిలో మనం దేవీపూజ చేయాలి. దుష్ట శక్తులపై పోరాడేలా సమాజాన్ని బలోపేతం చేసేందుకు విజయదశమి వేడుకలు ఆలంబన కావాలి. మన కుటుంబాలను పటిష్ఠ పరచుకుని, మన పౌరులను బలశాలులుగా తీర్చిదిద్దుకున్నప్పుడే మన సమాజం శక్తిమంతమవుతుంది. భౌతికంగా బలోపేతులమూ, ఆర్థికంగా శక్తిమంతులమూ కావడంతో పాటు నైతిక నిష్ఠాపరులమూ కావడం చాలా ముఖ్యమన్న విషయాన్ని మనం గుర్తించాలి. న్యాయవర్తన మన జీవనసూత్రం కావాలి. కుల మతాల అంతరాలు, జెండర్ అసమానతలను రూపుమాపుకోవాలి. జాతి సుస్థిర పురోగమన మార్గంలో అప్రతిహతంగా సాగేందుకు ఇది తప్పనిసరి. వ్యక్తి వికాసానికైనా, సమాజ పురోభివృద్ధికైనా మానవ విలువలే పునాదులు కదా. 


ఏ సమాజంలో నైనా సృజనాత్మక శక్తులు, విధ్వంసక శక్తులు ఏకకాలంలో చురుగ్గా ఉండడడం పరిపాటి. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని దానవశక్తులను పరిహరించేందుకై మనం సదా నిర్మాణాత్మక శక్తిసామర్థ్యాలను పెంపొందించుకొని, పటిష్ఠం చేసుకోవాలి. ఇందుకు ఉమ్మడి ప్రయత్నాలు తప్పనిసరి. నిర్భయ, గుడియా, హైదరాబాద్ పశు వైద్య నిపుణురాలు, హథ్రాస్ బాలిక... ఈ విషాద ఘటనలన్నీ పెచ్చరిల్లుతున్న దుష్టశక్తులకు తార్కాణాలు. మన సమాజం, మన జాతికి ఇవి తీవ్రహాని చేస్తున్నాయి. సంఘ వ్యతిరేక శక్తుల పట్ల మనం కఠినంగా వ్యవహరించవలసి ఉంది. 


మనం ఒక శక్తిమంతమైన జాతిగా రూపొందవలసిన అవసరం ఉంది. శక్తిమంతంగా ఉన్నప్పుడే బాహ్య శత్రువుల ముప్పును సమర్థంగా ఎదుర్కోగలం. మన జాతీయ భద్రతను చైనా, పాకిస్థాన్ దెబ్బతీస్తున్నాయి. సరిహద్దులలోని మన వీర సైనికులు మాతృభూమి రక్షణకు అనుపమాన త్యాగాలు చేస్తున్నారు. వారి త్యాగాలను విజయదశమి వేడుకల సందర్భంగా మనం తప్పక స్మరించుకోవాలి. మననే కాకుండా మానవాళి మొత్తాన్ని పీడిస్తున్న కరోనా మహమ్మారిపై పోరులో మనం విజయపథంలో ఉన్నాం. ఈ విపత్తు నెదుర్కొనే విషయమై ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శక సూత్రాలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంతవరకు ఈ విషయంలో ఎవరూ ఎటువంటి అశ్రద్ధ చేయకూడదు.


కృతయుగంలో జ్ఞానమే శక్తి అయితే కలియుగంలో సమైక్యతే శక్తి. ఒక జాతిగా మనం మరింతగా సమైక్యమవ్వాలి. సమైక్యంగా ఉన్నప్పుడే మనం శక్తిమంతులుగా మనగలుగుతాం. సమైక్యతే దేశభక్తికి, మాతృభూమి సేవానురక్తికి పునాది. పుణ్యభూమి భారత్ మన మాతృమూర్తి. ఆమె కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింప చేయడం మన బాధ్యత. ఆమె ఘనతే మన ఘనత. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన, సంపద్వంతమైన, ఆరోగ్యకరమైన దేశంగా మన మాతృభూమి భారత్‌ను తీర్చిదిద్దేందుకు మనం ప్రతిన బూనాలి. మాతృభూమిని మించిన మహత్వపూర్ణమైనది మరేమీ ఉండదు. ఈ సత్యాన్ని అవగతం చేసుకునేందుకు రామాయణంలోని ఒక ఉదంతాన్ని ప్రస్తావిస్తాను.


రామ-రావణ యుద్ధం ముగిసింది. సీతా మహాసాధ్వి చెర వీడింది. రాముడు విభీషణుడిని లంక రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు. అప్పుడు లక్ష్మణుడు మరికొన్ని రోజులు లంకలోనే ఉండిపోదామని తన అగ్రజుడిని కోరాడు. ఇంత అందమైన ప్రదేశాన్ని వెంటనే వీడిపోవాలని అనిపించడం లేదని లక్ష్మణుడు వివరించాడు. తమ్ముని అభ్యర్థనకు శ్రీరాముడు, ‘స్వర్ణ భూమి, సుందరసీమ అయిన లంక నాకు శోభాయమానంగా కన్పించడం లేదు. పుట్టి పెరిగిన జన్మభూమి అయోధ్యకు తిరిగి వెళ్ళాలని నా మనస్సు తహతహలాడుతోంద’ని అన్నాడు. మాతృమూర్తి, మాతృభూమి దివ్యలోకాల కంటే దేదీప్యమానం కాదూ!


బండారు దత్తాత్రేయ

హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్

Updated Date - 2020-10-25T05:56:23+05:30 IST