30లోగా వర్సిటీల్లో రేషనలైజేషన్‌: సీఎస్‌

ABN , First Publish Date - 2021-04-09T09:00:17+05:30 IST

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ నియామకం కోసం రేషనలైజేషన్‌ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని వీసీలను ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సతీశ్‌ చంద్ర...

30లోగా వర్సిటీల్లో  రేషనలైజేషన్‌: సీఎస్‌

అమరావతి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ నియామకం కోసం రేషనలైజేషన్‌ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని వీసీలను ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సతీశ్‌ చంద్ర ఆదేశించారు. ఆయా డిపార్ట్‌మెంట్లలో ఎన్ని పోస్టులు అవసరమో తేల్చాలని చెప్పారు. ఏ మాత్రం డిమాండ్‌ లేని పాత డిపార్ట్‌మెంట్ల నుంచి ఎన్ని పోస్టులు తగ్గించాలి.. ఎమర్జింగ్‌ డిపార్ట్‌మెంట్లకు ఎన్ని పోస్టులను సర్ధుబాటు చేయాలో తేల్చాలని ఆదేశించారు. గురువారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైౖర్మన్‌ కె.హేమచంద్రారెడ్డితో కలిసి ఆన్‌లైన్‌లో వర్సిటీల వీసీలతో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రేషనలైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి పాలక మండళ్ల (ఈసీ) ఆమోదం తీసుకోవాలన్నారు. ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేడర్‌ను నిర్వహిస్తూ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అన్ని వర్సిటీలూ కమిటీలను ఏర్పాటు చేసుకుని రేషనలైజేషన్‌ ప్రక్రియను పూర్తిచేయాలని వీసీలకు దిశానిర్దేశం చేశారు.  పూర్తిగా ప్రతిభ ఆధారంగా రిక్రూట్‌మెంట్‌ జరుగుతుందన్నారు. తొలుత ఏపీపీఎస్సీ ద్వారా స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని ఈ సందర్భంగా సతీశ్‌ చంద్ర వెల్లడించారు. గతంలో స్ర్కీనింగ్‌ టెస్ట్‌ను జనరల్‌ పేపర్‌లో నిర్వహించారని, ఇప్పుడు జనరల్‌ పేపర్‌తో పాటు సంబంధిత సబ్జెక్టులో మరో పేపర్‌ నిర్వహిస్తామని చెప్పారు. వర్సిటీల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులకు కూడా రెగ్యులర్‌ టీచర్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.  


Updated Date - 2021-04-09T09:00:17+05:30 IST