HYD : Outer Ring Roadపై అనుమానితులు.. గడ్డాలు పెంచి, చెడ్డీలు వేసుకుని సంచారం.. అకస్మాత్తుగా...!

ABN , First Publish Date - 2021-12-06T16:41:29+05:30 IST

ఔటర్‌ రింగురోడ్డుపై మనుషుల, జంతువుల సంచారం నిషిద్ధం. ఇక్కడ అత్యధిక వేగంతో వాహనాలు దూసుకుపోతాయి. కానీ...

HYD : Outer Ring Roadపై అనుమానితులు.. గడ్డాలు పెంచి, చెడ్డీలు వేసుకుని సంచారం.. అకస్మాత్తుగా...!

  • కార్ల ముందు ప్రత్యక్షం
  • నిర్మానుష్య ప్రాంతాల్లో అలజడి
  • ఆందోళనలో వాహనదారులు

ఔటర్‌ రింగురోడ్డుపై మనుషుల, జంతువుల సంచారం నిషిద్ధం. ఇక్కడ అత్యధిక వేగంతో వాహనాలు దూసుకుపోతాయి. కానీ, కొద్ది రోజులుగా ముగ్గురు, నలుగురు కలిసి ఓ గ్రూపుగా అకస్మాత్తుగా రోడ్డుపై ప్రత్యక్షమవుతున్నారు. వేగంగా వెళ్తున్న కార్ల ముందుకు వచ్చేస్తున్నారు. నిర్మానుష్యంగా ఉండే ఓ ప్రాంతంలోనే ఈ తంతు జరుగుతోంది. ఆ వ్యక్తులు ఎవరని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. దారి దోపిడీలకు రెక్కీ నిర్వహిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పౌరులే అయినా.. నిషిద్ధ ప్రాంతంలోకి ఎలా రాగలుగుతున్నారని ప్రశ్నిస్తున్నారు.


హైదరాబాద్ సిటీ/నార్సింగ్‌ : ఔటర్‌ రింగురోడ్డుపై 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో కార్లు వెళ్తుంటాయి. కొందరైతే 120కు మించి కూడా దూసుకుపోతుంటారు. అంత వేగంతో వెళ్తున్న వాహనాల ముందుకు హఠాత్తుగా మనుషులు వచ్చేస్తే.. ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.  అసలు అనుమతిలేని రోడ్డుపైకి మనుషులు ఎలా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఔటర్‌ రింగ్‌రోడ్డుపై అప్పా జంక్షన్‌ నుంచి రాజేంద్రనగర్‌ రోడ్డు ఎగ్జిట్‌ వరకు ఉన్న మూడు కిలో మీటర్ల దూరంలోనే ఈ తంతు జరుగుతోంది.


ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు అకస్మాత్తుగా వాహనాల ముందుకు వస్తున్నారు. రెండు వారాలుగా  ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఔటర్‌పైకి పౌరులు ఎక్కేందుకు వీలు లేని హిమాయత్‌సాగర్‌ దర్గా ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తులు రోడ్డుపై అటు, ఇటు తిరుగుతున్నారు. కార్లు వేగంగా వస్తాయన్న భయం వారికి ఉండడం లేదు. వారిని చూసి వాహనదారులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. నార్సింగ్‌ వంతెన, అప్పా జంక్షన్‌, శంషాబాద్‌ రాళ్లగూడ వద్ద అప్పుడప్పుడు జనం ఇటు అటు దాటుతుంటారు. 


వీరంతా షేరింగ్‌ కార్లలో గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ మధ్య రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఇటీవల నార్సింగ్‌ వద్ద ఫెన్సింగ్‌ కూడా పెంచారు. అయినప్పటికీ ఇరవై అడుగుల ఎత్తు కంచెను దూకి అప్పా - రాజేంద్రనగర్‌ మధ్య రోడ్డుపైకి కొందరు దూసుకొస్తున్నారని వాహనదారులు పేర్కొంటున్నారు. గడ్డాలు పెంచి, చెడ్డీలు వేసుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ వ్యక్తులపై పోలీసులు నిఘా పెట్టాలని కోరుతున్నారు. ప్రమాదాలు, దారి దోపిడీలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-12-06T16:41:29+05:30 IST