ప్లాట్‌లో దుండగుల దాడి.. భయభ్రాంతులకు గురైన మహిళలు

ABN , First Publish Date - 2021-05-17T14:16:32+05:30 IST

ఇటీవల నిర్మించిన ఇంటిపై కొందరు గుర్తు తెలియని దుండగులు

ప్లాట్‌లో దుండగుల దాడి..  భయభ్రాంతులకు గురైన మహిళలు

  • గృహోపకరణాలు ధ్వంసం
  • వినాయకహిల్స్‌లో ఘటన

హైదరాబాద్/సరూర్‌నగర్‌ : వివాదాస్పద ప్లాట్‌లో ఇటీవల నిర్మించిన ఇంటిపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసి విలువైన గృహోపకరణాలు ధ్వంసం చేశారు. ఇంట్లోని మహిళలను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ సంఘటన మీర్‌పేట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని అల్మా్‌సగూడ వినాయకహిల్స్‌లో 300 గజాల ఓ ప్లాట్‌పై రమేశ్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డిల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. దీనిపై కోర్టులో కూడా కేసు నడుస్తోంది. ఈ క్రమంలో కోర్టు నుంచి ఇంజంక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకున్న పురుషోత్తంరెడ్డి అక్కడ ఇంటి నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం దాదాపుగా పూర్తి చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటున్నాడు.


కాగా ఆ ప్లాట్‌లో తమకూ వాటా ఉన్నదని పేర్కొంటూ ఆదివారం రమేశ్‌రెడ్డికి చెందిన దాదాపు 20 మంది దుండగులు సదరు ఇంటిపై దాడి చేసి ఇంట్లోని మహిళలను భయభ్రాంతులకు గురిచేసి, విలువైన గృహోపకరణాలను ధ్వంసం చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు మీర్‌పేట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.మహేందర్‌రెడ్డి చెప్పారు. అది సివిల్‌ వివాదమని, కోర్టులో కేసు నడుస్తున్నందున ఇరు వర్గాలు కోర్టులోనే తమ హక్కులను తేల్చుకోవాలని, ఇలా దాడులు చేయడం సరైంది కాదని అన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రమేశ్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, శైలజతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఇదిలా ఉండగా తమ ఇంటిపై దాడి చేసిన దుండగులు ఇంట్లోని 12 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.50లక్షలు నగదు కూడా అపహరించుకుపోయారని బాధితులు మీడియాతో చెప్పారు. అయితే తమకు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదులో ఆ విషయం పేర్కొనలేదని ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2021-05-17T14:16:32+05:30 IST