అన్‌లాక్‌

ABN , First Publish Date - 2021-06-20T06:33:00+05:30 IST

ఆంక్షలు తొలగాయి. మే 12 నుంచి సుదీర్ఘకాలం విధించిన లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ నుంచి ఎత్తివేసింది. రాత్రివేళ కర్ఫూను సైతం తీసేసింది. దీంతో ఇంతకాలం పూర్తిగా మూతపడిన సినిమా థియేటర్లు, బార్లు, క్రీడా మైదానాలు, లైబ్రరీలు తెరుచుకోనున్నాయి. అన్ని రకాల వర్తక, వాణిజ్య దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇక కళకళాడనున్నాయి.

అన్‌లాక్‌

షరతులు వర్తిస్తాయి

నేటి నుంచి లాక్‌డౌన్‌ ఎత్తివేత

మాస్క్‌, భౌతికదూరం, శానిటైజేషన్‌ తప్పనిసరి

మాస్క్‌ లేకపోతే రూ.1000 ఫైన్‌

తెరుచుకోనున్న సినిమా థియేటర్లు, బార్లు

జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం


నల్లగొండ, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆంక్షలు తొలగాయి. మే 12 నుంచి సుదీర్ఘకాలం విధించిన లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ నుంచి ఎత్తివేసింది. రాత్రివేళ కర్ఫూను సైతం తీసేసింది. దీంతో ఇంతకాలం పూర్తిగా మూతపడిన సినిమా థియేటర్లు, బార్లు, క్రీడా మైదానాలు, లైబ్రరీలు తెరుచుకోనున్నాయి. అన్ని రకాల వర్తక, వాణిజ్య దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇక కళకళాడనున్నాయి. స్వేచ్చ లభించింది కదా అని రెక్కలు విప్పి కరోనా జీవనశైలిని ఆదమరిస్తే మరోసారి వైరస్‌ కాటు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండగా, మాస్క్‌లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా తప్పదని పోలీసులు చెబుతున్నారు.


కరోనా కేసుల తీవ్రత తగ్గినట్టు వైద్యశాఖ అధికారులు నివేదిక ఇవ్వడంతో లాక్‌డౌన్‌ ఆంక్షలను ఆదివారం నుంచి పూర్తిగా ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఉత్తర్వులను సైతం విడుదల చేసింది. దీంతో మే 12నుంచి సుమా రు 39 రోజుల పాటు ఆంక్షల నీడలో ఉన్న నల్లగొండ, 28రోజుల పాటు ఆంక్షల పరిధిలో ఉన్న సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు విముక్తి కలిగింది. రాత్రి పూట కర్ఫ్యూ ఉంటుందని అంతా భావించి నా అది కూడా లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సర్వత్రా ఆశ్చర్యానికి, కొంత ఆందోళనకు గురిచేసింది. ఆంక్షల సడలింపుతో ఉమ్మడి జిల్లాలోని 43 బార్లు తిరిగి తెరుచుకోనున్నాయి. వీటితో పాటు ఉమ్మడి జిల్లాలోని 25 సినిమా థియేటర్లు ఇక కళకళలాడనున్నాయి. జూలై 1 నుంచి అన్ని రకాల విద్యా సంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బోధన ఆన్‌లైనా, ఆఫ్‌లై నా అనేది ఆది, సోమవారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పదో తరతగతి వరకు ఆన్‌లైన్‌లోనే విద్యాబోధన జరిగే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా గతంలో ఏర్పాట్లు సైతం జరిగాయి. అయితే ఆంక్షలు సడలించినా కరోనా నియంత్రణకు నిబంధనలు తప్పనిసర ని ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వ్యా పార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో భౌతికదూరం, శానిటైజేషన్‌ నిబంధనలు తప్పక పాటించాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించకపోతే వెయ్యి రూపాయల ఫైన్‌ తప్పదు. సాయం త్రం ఆరు గంటల వరకే వర్తక, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఇస్తే బాగుండేదని, పూర్తిగా ఆంక్షలు సడలిస్తే నియంత్రణ కరువై తిరిగి కరోనా కేసులు పెరిగితే మళ్లీ వ్యాపారాలు దెబ్బతినే ప్రమా దం ఉందని వ్యాపారరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


వ్యక్తిగా లాక్‌ చేసుకోవాల్సిందే : ఏ.కొండల్‌రావు, డీఎంహెచ్‌వో

లాక్‌డౌన్‌లో గత 15రోజుల్లో కరోనా వ్యాప్తి 1.5శాతం నుంచి 3శాతం వరకే ఉంది. సాధారణ రోజుల్లో ప్రతి రోజు వంద మందిలో ఐదుగురు ఏదో ఒక అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఆ లెక్కన చూసినా ప్రస్తుతం సాధారణ పరిస్థితులే ఉన్నాయని నిర్ధారించాకే ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు ఎత్తివేసింది. సమాజం అన్‌లాక్‌ అయినా వ్యక్తిగా ఎవరికి వారు లాక్‌ చేసుకోవాలి. కరోనా, లాక్‌డౌన్‌ కాలంలో ఏలా అయితే అవసరం ఉంటేనే బయటికి వెళ్లడం, మాస్క్‌, భౌతికదూరం, శానిటైజేషన్‌ ఎలా పాటించామో ఇప్పుడు కూడా అదే జీవన విధానాన్ని ఆచరించాలి. లేదు క్లబ్లులు, పబ్‌లు, అట్టహాసంగా ఫంక్షన్‌లు మా ఇష్టం అంటే మళ్లీ కరోనా కేసుల విజృంభణ, ఆంక్షలు తప్పవు.


78 రోజుల్లో 67,503 మందికి పాజిటివ్‌

401మంది మృతి

ఇప్పటి వరకు ఉల్లంఘనలపై 34,636 కేసులు నమోదు

3398 వాహనాలు సీజ్‌

నల్లగొండ క్రైం, మే 24: ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేసినా కొన్ని నిబంధనలను విధించింది. వీటిని పాటించకుంటే కేసులతోపాటు జరిమానా విధించనున్నారు. అంతేగాక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే థర్డ్‌వేవ్‌ ముప్పు తప్పదు. కరోనా రెండో దశలో ప్రభుత్వం మూడు విడతలుగా లాక్‌డౌన్‌ను అమలు చేయగా, నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు కొరడా ఝులిపించారు. మాస్కులు ధరించని, భౌతికదూరం పాటించని వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో ఇక స్వీయనియంత్రణే శ్రీరామరక్ష.


ఉమ్మడి జిల్లాలో లాక్‌డౌన్‌ ఇలా..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 39రోజులుగా లాక్‌డౌన్‌ అమలైంది. మే 12వ తేదీ నుంచి ప్రారంభమైన లాక్‌డౌన్‌లో ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు మినహాయింపు ఇచ్చారు. అనంతరం జరిగిన మంత్రివర్గ సమావేశంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు మినహాయింపు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఉమ్మడి జిల్లాలో నల్లగొండ మినహా అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో సాయంత్రం 6గంటల వరకు లాక్‌డౌన్‌కు మినహాయింపు ఇచ్చారు. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


లాక్‌డౌన్‌లో తగ్గిన పాజిటివ్‌ కేసులు

కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలుచేసిన లాక్‌డౌన్‌ సమయంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. ప్రజలు భౌతికదూరం పాటించకపోవడం, అనవసరంగా రోడ్లపైకి రావడం, శుభకార్యాల్లో పాల్గొనటంతో పాజిటివ్‌ రేటులో పెద్దగా మార్పులేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మే 12వ తేదీన ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించగా, ఈ నెల 20వ తేదీ నుంచి అన్నింటికీ సడలింపులిచ్చింది. ఈ 39 రోజుల వ్యవధిలో 33,094మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 222 మంది మృతిచెందారు. లాక్‌డౌన్‌కు 39 రోజుల ముందు అంటే ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి మే 11 వరకు 34,409 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా; 179 మంది మృతిచెందారు. మొత్తం మీద 78రోజుల్లో 67,603 మందికి పాజిటివ్‌ రాగా, 401మంది చికిత్స పొందుతూ మృతిచెందారు.


ఉమ్మడి జిల్లాలో 6లక్షల మందికి వ్యాక్సినేషన్‌

ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 6,28,444మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 2,05,221 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు. అందులో ఫస్ట్‌డోస్‌ 1,71,305 మంది, సెకండ్‌ డోస్‌ 33,916 మంది తీసుకున్నారు. యాదాద్రి జిల్లాలో ఇప్పటి వరకు 2,45,131 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వగా, ఫస్ట్‌డోస్‌ తీసుకున్నవారు 1,94,527 మంది, సెకండ్‌ డోస్‌ తీసుకున్నవారు 50,604మంది ఉన్నారు. పేట జిల్లాలో 1,78, 092 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వ గా, ఫస్ట్‌డోస్‌ 1,41,879 మందికి, సెకండ్‌ డోస్‌ 36,217 మందికి ఇచ్చారు.


పొంచి ఉన్న ముప్పు

లాక్‌డౌన్‌ అన్నీ రంగాలపై ప్రభావం చూపింది. సడలింపు సమయంలోనూ ప్రజలు భౌతికదూరం పాటించకపోవడం, శుభకార్యాల్లో పాల్గొనటంతో కరోనా విజృంభించింది. లాక్‌డౌన్‌ ప్రకటించిన 39 రోజులు, అంతకుముందు 39 రోజులతో పోల్చితే 1,315 కేసులు మాత్రమే తగ్గాయి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని వారిపై 34,636కేసులు నమోదు చేయడంతో పాటు సుమారు 3398 వాహనాలను సీజ్‌ చేశారు. నల్లగొండ జిల్లాలో 19,302 కేసులు నమోదు కాగా, 2,090 వాహనాలను సీజ్‌చేశారు. అదే విధంగా సూర్యాపేట జిల్లాలో 15,604 కేసులు నమోదు కాగా, 1308 వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. నిబంధనలు పాటించని దుకాణాలు, వ్యాపార సముదాయాలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి జరిమానా విధించారు.

Updated Date - 2021-06-20T06:33:00+05:30 IST