ఉన్నోళ్లు.. అయినోళ్లకే

ABN , First Publish Date - 2021-06-22T06:59:45+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు-అందరికీ ఇళ్ల్లు (వైఎ్‌సఆర్‌ గృహ నిర్మాణ) పథకంలో భాగంగా జిల్లాలో రూ.3 లక్షలు ఎకరా చేయని భూములకు రూ.20 లక్షలకుపైగానే చెల్లించిన బాగోతాలు అనేకం వెలుగుచూశాయి.

ఉన్నోళ్లు.. అయినోళ్లకే
ప్రభుత్వం ఇంటి స్థలాలకు ఎంపిక చేసిన మామిళ్లపల్లి-ధర్మవరం రహదారిలోని భూమిలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన దృశ్యం

- ఇంటి స్థలాల అర్హుల జాబితా తయారీలో 

  అధికారులు, నేతలు కుమ్మక్కు

- బంధువులు, అధికార పార్టీ సామాజికవర్గానికే పెద్దపీట

- వీఆర్వో ఉన్నా... ఇనచార్జ్‌ వీఆర్వోకు పెత్తనం

- వైసీపీ స్థానిక నేతల కనుసన్నల్లోనే లబ్ధిదారుల ఎంపిక

- వంతపాడిన అధికారులు

- గడువు ముగియగానే విక్రయించి సొమ్ము చేసుకునే వ్యూహం

-  ధర్మవరం నియోజకవర్గంలో అక్రమాల బాగోతం..


ఆయన రిటైర్డ్‌ ఎస్‌ఐ.. ఇయన ఇద్దరు కుమారులూ ప్రభుత్వోద్యోగాలు చేస్తున్నారు.. అయినా.. ఆయన భార్యను ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాల అర్హుల జాబితాలో చేర్చారు. స్థలం ఇచ్చారు..


ఆమె పేరు వాణి. భర్త కులశేఖర్‌ రెడ్డి. వీరికి ధర్మవరం పట్టణంలో నాలుగిళ్లు, సొంతూరిలో కూడా భవనం ఉంది. అయినా.. ఇంటి స్థలం ఇచ్చేశారు.


ఆర్‌ఐ బంధువు కిరణ్‌కుమార్‌ రెడ్డి. ఈయన భార్య రమణమ్మకు ఇంటి స్థలం ఇచ్చారు. వీరికి ఫోర్‌ వీలర్‌ వాహనాలు, భూములున్నాయి. ఇటీవలే లక్షలు పోసి, స్థలాలు కూడా కొన్నారు. అయినా.. వీరు పేదలు అన్నట్లు స్థలం కేటాయించారు.

వీఆర్వో తల్లి, వదినకు కూడా ఇంటి స్థలం ఇచ్చేసుకున్నారు. ఇలా ధర్మవరం మండలం కునుతూరులో అధికారులు, వైసీపీ నేతలు కుమ్మక్కై ఉన్నోళ్లకు, తమ వాళ్లకు ఇళ్ల స్థలాలను పంచేసుకున్నారు. అర్హులకు మొండిచేయి చూపారు.

అనంతపురం, జూన21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు-అందరికీ ఇళ్ల్లు (వైఎ్‌సఆర్‌ గృహ నిర్మాణ) పథకంలో భాగంగా జిల్లాలో రూ.3 లక్షలు ఎకరా చేయని భూములకు రూ.20 లక్షలకుపైగానే చెల్లించిన బాగోతాలు అనేకం వెలుగుచూశాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ ముఖ్య నేతలు ఎంపిక చేసిన భూములకే అధికారులు ఆమోదముద్ర వేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున ఆరోపణలు, విమర్శలు వినిపించినా... అధికారుల నుం చిగానీ, ప్రజాప్రతినిధుల నుంచిగానీ స్పందన లభించలేదు. ఆ కార్యక్రమాన్ని మమ అనిపించారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో నూ ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో ఆ పార్టీ స్థానిక నేతల సిఫార్సులకే అధికారులు పెద్దపీట వేశారు. స్థలాల లబ్ధిదారుల ఎంపిక విషయంలోనూ అర్హులకు మొండిచేయి చూపుతున్నారంటూ విపక్షాలు గ గ్గోలు పెట్టాయి. బాధిత వర్గాల నుంచి అదే ఆవేదన వ్యక్తమైంది. ఇ లా ఇళ్ల స్థలాల భూముల కొనుగోలు వ్యవహారం నుంచి పట్టాల పంపిణీ వరకూ ఆయా నియోజకవర్గాల్లో స్థానిక అధికారులు, అధికా ర పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ వ్యవహారాన్ని చక్కబెట్టారన్న విమర్శలు, ఆరోపణలకు కొదవలేదు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అర్హుల జాబితాలో అధికారులు వారి వారి బంధువులు, కుటుంబసభ్యులను ఎం పిక చేయడంతోపాటు స్థానిక అధికార పార్టీ సామాజికవర్గ నేతలు ఒక అడుగు ముందుకేసి, ఆ సామాజికవర్గానికి చెందిన వారికి పట్టాలిచ్చేలా చేసిన సిఫార్సులకు పెద్దపీట వేస్తున్నారు. తాజాగా... ధర్మవ రం మండలం కునుతూరు పంచాయతీలో వెలుగు చూస్తున్న ఇంటి స్థలాలకు ఎంపిక చేసిన లబ్ధిదారుల బాగోతం చూస్తే ఎవ్వరైనా నివ్వెరపోవాల్సిందే.

ఉన్నోళ్లకే ఇంటి స్థలాలు..

ధర్మవరం మండలం కునుతూరు పంచాయతీలో ఇళ్ల స్థలాల కోసం 144 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి మామిళ్లపల్లి-ధర్మవరం ప్రధాన రహదారి (కనుతూరు సమీపం)లో సర్వే నెం 387-1, 388-1, 389-1, 406-4బిలలో స్థలాలు కేటాయించారు. మొదటి విడతలో భాగంగా... స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా 40 మంది దాకా లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఆ తరువాత దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు 90 రోజుల్లో ఇళ్ల పట్టాలివ్వాలని ప్రభుత్వాదేశాల మేరకు మిగిలిన 104 మంది లబ్ధిదారులకు అవే సర్వే నెంబర్లలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇక్కడే అధికారులు, స్థానిక అధికార పార్టీ నేతలు కుమ్మక్కయ్యారు. అధికార పార్టీ సామాజికవర్గ నేతలు, స్థానిక అధికారులు లబ్ధిదారుల ఎంపికలో బంధుప్రీతి, సామాజికవర్గానికి లబ్ధి చేకూర్చడంపైనే శ్రద్ధ పెట్టారు. అందులో భాగంగానే ఆర్థికంగా ఉన్నోళ్లకే ఇంటి స్థలాలు కట్టబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారుల్లో ఒకరైన కునుతూరుకు చెందిన వాణిని ఎంపిక చేశారు. ఈమె భర్త కులశేఖర్‌ రెడ్డి. వీరికి ధర్మవరంలో నాలుగు ఇళ్లతోపాటు కునుతూరులోనూ సొంతిల్లు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. లక్ష్మీదేవి అనే లబ్ధిదారురాలికి సొంతిల్లు ఉంది. దీనికితోడు ఆ కుటుంబానికి రేషన కార్డు, ఆధార్‌ లేకపోయినా.. నకిలీ ఆధార్‌ నెంబర్‌తో ఇంటి స్థలం మంజూరు చేసినట్లు విమర్శలున్నాయి. రిటైర్డ్‌ ఎస్‌ఐ భార్య వెంకటలక్ష్మికి ఇంటి స్థలం కేటాయించారు. వారి ఇద్దరు కుమారులూ ప్రభుత్వోద్యోగులే. ఆమెకు ఇంటి పట్టా ఇవ్వడంతో అర్హులైన పేదలు ఆవేదన చెందుతున్నారు. మరో లబ్ధిదారురాలు కునుతూరు శ్రీవాణికి ఊర్లోనే పెద్ద భవంతి ఉన్నా... ఆమెకు ఇంటి స్థలం కేటాయించారు. ఇలా అనర్హులకు ఇంటి స్థలాలు కేటాయించి, అర్హులకు మొండిచేయి చూపారన్న ఆవేదన బాధిత వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. 40 మందికిపైగా అనర్హులకు ఇంటి స్థలాలు ఇచ్చారనే విమర్శలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి.

వీఆర్వో ఉన్నా... ఇనచార్జ్‌ వీఆర్వోకు పెత్తనం వెనుక..కునుతూరు పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి మొదలుకుని ఆర్‌ఐ, డిజిజల్‌ అసిస్టెంట్‌ వరకూ అంతా అధికార పార్టీ సామాజికవర్గానికి చెందినవారే. కునుతూరు వీఆర్వోగా అధికార పార్టీ సామాజికవర్గానికి చెందని వ్యక్తి పనిచేస్తున్నారు. ఆ అధికారి అక్కడ ఉన్నా... పోతుకుంటలో పనిచేస్తున్న వీఆర్వో (అధికార పార్టీ సామాజికవర్గం)కు కునుతూరు పంచాయతీ ఇనచార్జ్‌ వీఆర్వో బాధ్యతలు అప్పగించారు. ఇది అధికారులు, అధికార పార్టీ స్థానిక నేతలు వ్యూహంలో భాగమేనన్న విషయం తేటతెల్లమవుతోంది. ఇక చెప్పేదేముంది అర్హుల జాబితాలో ఆ అధికారుల బంధువులు, సామాజికవర్గం నేతల సిఫార్సులకు పెద్దపీట వేశారు. ఆర్‌ఐ బంధువు కిరణ్‌కుమార్‌రెడ్డి భార్య రమణమ్మకు ఇంటి స్థలం కేటాయించారు. వారికి భూములున్నా... ఫోర్‌వీలర్స్‌ వాహనాలున్నా.. ఇటీవలే రూ.లక్షలు పోసి, భూములు కొన్నా... పేదల ఖాతాలో ఇంటి పట్టా ఇచ్చేశారు. అదే విధంగా వీఆర్వో కూడా తానేమి తక్కువన్న చందంగా తన తల్లి, వదినకు ఇంటి స్థలాలు కేటాయించేశారని బాధిత పేదల నుంచి ఆక్రోశం వ్యక్తమవుతోంది. ఇలా ఎవరికి వారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని, వారి వారి బంధువులు, సామాజికవర్గానికి స్థలాలు కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వ్యూహమిదీ...

ఇళ్ల స్థలాలు లబ్ధిదారుల ఎంపిక జాబితాలో అధికారులు, అధికార పార్టీ నేతలు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో... వారు చెప్పిందే శాసనమైందన్న విమర్శలు లేకపోలేదు. ఆ క్రమంలోనే అనర్హులను ఇంటి స్థలాలు ఎంపిక చేశారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. బంధువులు, సామాజికవర్గానికి ఇంటి స్థలాలు కట్టబెట్టడం వెనుక ప్రత్యేక వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. మామిళ్లపల్లి-ధర్మవరం ప్రధాన రహదారి పక్కలో స్థలాలకు మార్కెట్‌లో ఎక్కువ ధర పలుకుతోంది. స్థానికుల సమాచారం మేరకు... సెంటు స్థలం దాదాపు రూ.3 లక్షలు పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు, అధికార పార్టీ సామాజికవర్గం నేతలు, వారి వారి బంధువులను ఇంటి స్థలాలకు ఎంపిక చేసినట్లు ఆరోపణలున్నాయి. ఉచితంగా ఇంటి స్థలాలు ఇవ్వడంతోపాటు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఐదేళ్ల తరువాత ఆ ఇళ్లను విక్రయించుకునే వెసులుబాటును కూడా కల్పించిన క్రమంలోనే అధికారులు, ఆ పార్టీ సామాజికవర్గం నేతలు ఈ విషయంలో పావులు కదిపినట్లు ఆరోపణలున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. నిర్దేశించిన గడువు ముగియగానే విక్రయాలతో సొమ్ము చేసుకునే ఎత్తుగడలో భాగంగానే ఈ వ్యవహారం నడిపినట్లు సమాచారం. ఇప్పటికే ఆ రహదారుల్లో ప్రైవేట్‌ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుండటం కూడా ఓ కారణమవుతోంది. కునుతూరులో ఇళ్ల స్థలాల అర్హుల జాబితా తయారీలో భారీగా అవకతవకలు జరిగాయనీ, అనర్హులకు మొండిచేయి చూపుతున్నారని రెవెన్యూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఇప్పటి వరకూ పట్టించుకోలేదన్న ఆరోపణలు వారు మూటగట్టుకుంటున్నారు. మరి ఉన్నతాధికారులు ఈ బాగోతంపై ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


Updated Date - 2021-06-22T06:59:45+05:30 IST