వేతన.. యాతన!

ABN , First Publish Date - 2021-04-22T05:17:03+05:30 IST

జాతీయ రహదారిపై సుమారు 60 కిలోమీటర్ల మేర ఎక్కడ ప్రమాదం జరిగినా తక్షణమే వారు స్పందిస్తారు. సంఘటన స్థలానికి చేరుకుని అత్యవసర సేవలందిస్తారు. కానీ వారి సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదు. 10 నెలలుగా వేతనాలు మంజూరు చేయడం లేదు. దీంతో వారికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. ..ఇదీ జిల్లా ఆస్పత్రి(టెక్కలి)లో ట్రామాకేర్‌లోని కాంట్రాక్ట్‌ సిబ్బంది దీనావస్థ.

వేతన.. యాతన!
వేతనాల కోసం ఎదురుచూస్తున్న ట్రామాకేర్‌ సిబ్బంది

ట్రామాకేర్‌ సిబ్బందికి పది నెలలుగా మంజూరు కాని జీతాలు
ఆర్థికంగా తప్పని ఇబ్బందులు
అత్యవసర సేవలకు గుర్తింపు కరువు
(టెక్కలి రూరల్‌)

జాతీయ రహదారిపై సుమారు 60 కిలోమీటర్ల మేర ఎక్కడ ప్రమాదం జరిగినా తక్షణమే వారు స్పందిస్తారు. సంఘటన స్థలానికి చేరుకుని అత్యవసర సేవలందిస్తారు. కానీ వారి సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదు. 10 నెలలుగా వేతనాలు మంజూరు చేయడం లేదు. దీంతో వారికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. ..ఇదీ జిల్లా ఆస్పత్రి(టెక్కలి)లో ట్రామాకేర్‌లోని కాంట్రాక్ట్‌ సిబ్బంది దీనావస్థ.
టెక్కలిలోని జిల్లా ఆస్పత్రిలో వైద్య విధాన పరిషత్‌ పర్యవేక్షణలో 2011లో ట్రామాకేర్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన వైద్యులను, సిబ్బందిని నియమించారు. వీరంతా ఇక్కడ రోడ్డు ప్రమాదాలతో పాటు, అత్యవసర వైద్య సేవలను  అందిస్తున్నారు. అప్పట్లో ఇద్దరు వైద్యులతో పాటు 11 మంది స్టాఫ్‌నర్సులు, ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఒక మ్యాన్‌ఫోల్డ్‌ టెక్నీషియన్‌, ముగ్గురు ఎఫ్‌ఎన్‌వోలు, ఒక ఏఎన్‌ఎం కలిపి మొత్తం 19 మంది వైద్య సేలందించేవారు. కొన్నాళ్ల తర్వాత ఉన్నత చదువుల నిమిత్తం ఇద్దరు వైద్యులు, ఉన్నత ఉద్యోగాలకు 10 మంది స్టాఫ్‌నర్సులు  వెళ్లిపోయారు. ప్రస్తుతం 9 మంది ట్రామాకేర్‌ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం  వీరికి గత 10 నెలలుగా వేతనాలు చెల్లించలేదు. దీంతో కుటుంబ పోషణ భారమవుతోందని ట్రామాకేర్‌ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొవిడ్‌ సేవలు అందిస్తున్నా..
కోటబొమ్మాళి, టెక్కలి, నందిగాం మండలాల్లోని హైవేపై ఎటువంటి రోడ్డు ప్రమాదం జరిగినా, కాలిన గాయాలు, విషం తాగిన బాధితులకు.., ఇతర అత్యవసర కేసులకు ట్రామాకేర్‌ సిబ్బంది వైద్య సేవలందిస్తున్నారు. దీనికి అదనంగా గత ఏడాది ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ సెంటర్‌లోనూ వైద్య సేవలందించారు. ప్రాణాలను పణంగా పెట్టి కొవిడ్‌ బాధితులకు సైతం సేవలందిస్తున్నా, ప్రభుత్వం తమను గుర్తించడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అత్యవసర సమయాల్లో తమ సేవలను వినియోగించుకుంటున్నారు తప్ప.. సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వేతన బకాయిలను చెల్లించాలని  కోరుతున్నారు.  

అర్ధాకలితోనే విధులు  
పది నెలలుగా వేతనాలు లేకపోవడంతో అర్ధాకలితో అలమటిస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం.  ప్రాణాలను సైతం పణంగా పెట్టి ట్రామాకేర్‌తో పాటు కొవిడ్‌ ఆసుపత్రిలో సైతం సేవలు అందిస్తున్నాం. అధికారులు స్పందించి బకాయిలు చెల్లించాలి.
- కె.గోవిందరావు, మ్యాన్‌ఫోల్డ్‌ టెక్నీషియన్‌, ట్రామాకేర్‌ విభాగం

వేతనాలు మంజూరు చేయాలి
వేతనాల కోసం ఎదురుచూస్తున్నా ప్రతి నెలా నిరాశే ఎదురవుతోంది. అత్యవసర సమయాల్లో సేవలు అందిస్తున్న మాకు పది నెలలుగా వేతనాలివ్వకపోవడం భాదాకరం. మా వేతన వెతలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాం.
- ధవళ ఇందిరావతి, స్టాఫ్‌నర్సు, ట్రామాకేర్‌ విభాగం

Updated Date - 2021-04-22T05:17:03+05:30 IST