ఏం చేస్తున్నారు?

ABN , First Publish Date - 2021-12-01T08:19:28+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వమే ఒక ‘ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ’ పెట్టి... వివిధ ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థల నిధులను డిపాజిట్ల పేరిట ఖాళీ చేస్తున్న వైనంపై ఆర్బీఐ దృష్టి..

ఏం చేస్తున్నారు?

  • ఏపీఎస్‌ఎఫ్‌సీఎల్‌పై ఆర్‌బీఐ నజర్‌
  • డిపాజిట్లు తీసుకుంటున్నారా?
  • ఆస్తులేమిటి? ఆదాయం ఎంత? అప్పులు తీసుకున్నారా?
  • 9 ప్రశ్నలు సంధించిన ఆర్బీఐ
  • ఇప్పటికి మూడుసార్లు లేఖ
  • స్పందించని రాష్ట్ర సర్కారు


అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వమే ఒక ‘ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ’ పెట్టి... వివిధ ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థల నిధులను డిపాజిట్ల పేరిట ఖాళీ చేస్తున్న వైనంపై ఆర్బీఐ దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్పొరేషన్‌ (ఏపీఎ్‌సఎ్‌ఫసీఎల్‌) సంగతేమిటని ఆరా తీసింది. ఆ కార్పొరేషన్‌ ఏమిటి, ఎవరు బాధ్యులు, ఏం చేస్తున్నారు... అంటూ 9 ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. అడ్డగోలుగా తెస్తున్న అప్పులు కూడా చాలకపోవడంతో... ప్రభుత్వం తన సొంత శాఖల నిధులపైనే కన్నేసిన సంగతి తెలిసిందే. బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్న ఇతర శాఖల డబ్బులను లాక్కోవడానికి ఏర్పాటు చేసిందే  ఏపీఎ్‌సఎ్‌ఫసీఎల్‌. బ్యాంకుల్లో డిపాజిట్లను రద్దు చేసి... ఈ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మాట వినని కార్యదర్శులపై నేరుగా సీఎస్‌ సమీర్‌ శర్మ ఒత్తిడి తెచ్చారు. ఇటీవల దీనిపై జీవో కూడా ఇచ్చారు. తాజాగా... ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి చెందిన రూ.400 కోట్లను ఇలాగే లాక్కున్నారు.


ఇలా ఏపీఎ్‌సఎ్‌ఫసీఎల్‌ ఖాతాలో డబ్బులు జమ కావడం... అలా ప్రభుత్వం వాటిని వాడేసుకోవడం జరుగుతోంది. డబ్బులు ఇచ్చిన శాఖలు రోడ్డున పడడమే తరువాయి. అప్పులతో బండి లాక్కొస్తున్న ప్రభుత్వం... ఆ శాఖల డిపాజిట్లను అడగ్గానే చెల్లించే అవకాశమే లేదు. రాష్ట్రంలో ఏపీఎస్‌ఎఫ్‌సీఎల్‌ వేదికగా ఇన్ని ఆర్థిక అక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసి... దీనిపై ఆర్బీఐ ఆరా తీసింది.


ముమ్మార్లు అడిగినా... 

కార్పొరేషన్‌ లావాదేవీల గురించి ఆర్బీఐ ఇప్పటికి మూడుసార్లు ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయినా ప్రభుత్వం సరైనా సమాచారం ఇవ్వలేదు. ఆర్‌బీఐకి చిక్కకుండా ఉండేందుకు ఈ కార్పొరేషన్‌ కార్యకలాపాలన్నింటినీ పీడీ ఖాతాల ద్వారానే నిర్వహిస్తోంది. ఆర్‌బీఐ ప్రశ్నిస్తే బ్యాంకు ఖాతాల లావాదేవీలు చూపించి తప్పించుకోవచ్చన్న ధోరణిలో వ్యవహరిస్తోందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఫైనాన్సియల్‌ కార్పొరేషన్‌ ఆడిట్‌ గురించి మాత్రమే ఆర్‌బీఐ ఆరా తీసింది. నిజానికి... రాష్ట్రంలో మిగిలిన 28 కార్పొరేషన్లకూ ఆడిట్‌ జరగడం లేదు. ఏజీ కార్యాలయం కేవలం బడ్జెట్‌ పద్దులు మాత్రమే ఆడిట్‌ చేసి చేతులు దులిపేసుకుంటోంది. అందువల్లే ప్రభుత్వం కార్పొరేషన్లను అడ్డు పెట్టుకుని రాజ్యాంగ విరుద్ధంగా బ్యాంకుల నుంచి వేలకోట్ల అప్పులు తీసుకొచ్చి సొంతానికి వాడుకుంటోంది. ఏజీ కార్యాలయం కార్పొరేషన్ల వ్యవహారాలు ఆడిట్‌ చేసి ఉంటే ప్రభుత్వం దాచిన అప్పుల తప్పులన్నీ అధికారికంగానే బయటపడేవి. 


ఆర్‌బీఐ సంధించిన ప్రశ్నలు...

1. ఏపీఎస్‌ఎఫ్‌సీఎల్‌ను 2020 ఏప్రిల్‌ 4వ తేదీన ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ఏడాది మార్చి 31వరకు జరిగిన వ్యవహారాలు, లావాదేవీలకు సంబంధించి ఆడిట్‌ చేశారా? చేస్తే ఆడిట్‌ ద్వారా వచ్చిన  ఫైనల్‌ బ్యాలెన్స్‌ షీట్‌ వివరాలు మాకు సమర్పించండి.

2. ఒకవేళ బ్యాలెన్స్‌ షీట్‌ అందుబాటులో లేకపోతే ఆ కార్పొరేషన్‌ ఆస్తుల విలువ ఎంతో చెప్పండి.

3. 2021 ఆగస్టు 31 నాటికి ఆ కార్పొరేషన్‌కు ఎన్ని ఆస్తులున్నాయి, కంపెనీ ఆస్తుల, అప్పుల జాబితాలో ఏమేమున్నాయి? అవన్నీ ప్రిన్సిపల్‌ బిజినెస్‌ క్రైటీరియా(పీబీసీ) నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా?

4. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆ కార్పొరేషన్‌ వద్ద నికరంగా ఎంత డబ్బు ఉంది?

5. ఆ కార్పొరేషన్‌కి ఉన్న అప్పులు తిరిగి ఎలా కడతారు?

6. ఈ కార్పొరేషన్‌ నిర్వహిస్తున్న లావాదేవీల ద్వారా ఆ సంస్థకు ఏదైనా ఆదాయం వస్తోందా? అది పీబీసీకి అనుగుణంగా ఉందా?

7. ఈ కార్పొరేషన్‌ ఎలాంటి లావాదేవీలు నిర్వహిస్తోంది? 

8. ఈ కార్పొరేషన్‌ ఇతర కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థలు, శాఖల నుంచి డిపాజిట్లు (ఇంటర్‌ కార్పొరేట్‌ డిపాజిట్లు-ఐసీడీ) తీసుకుంటోందా? ఒకవేళ తీసుకుంటే 2021 ఆగస్టు 31 నాటికి ఎన్ని డిపాజిట్లు తీసుకున్నారు?వాటిపై ఎంత వడ్డీ కడుతున్నారు? ఆ వడ్డీని ఎక్కడ నుంచి తెచ్చి కడుతున్నారు?

9. ఈ కార్పొరేషన్‌ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుందా? ఒకవేళ తీసుకుంటే ఏ బ్యాంకు నుంచి ఎంతెంత అప్పు తీసుకున్నారు? వాటిపై వడ్డీ ఎంత, అప్పు ఎన్ని సంవత్సరాల్లోగా తిరిగి చెల్లించాలి, అప్పు తీసుకునేందుకు ఏదైనా సెక్యూరిటీ పెట్టారా? బ్యాంకులకు అప్పుల అసలు, వడ్డీలు కట్టడానికి ఆ కార్పొరేషన్‌కు ఆదాయం ఎక్కడ నుంచి వస్తోంది?

Updated Date - 2021-12-01T08:19:28+05:30 IST