యూఎన్ఎస్‌సీ ఈ కాలానికి నిజమైన ప్రతినిధి కాదు : భారత్

ABN , First Publish Date - 2021-09-09T00:01:20+05:30 IST

ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) సమకాలిక

యూఎన్ఎస్‌సీ ఈ కాలానికి నిజమైన ప్రతినిధి కాదు : భారత్

న్యూఢిల్లీ : ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) సమకాలిక ప్రపంచానికి నిజమైన ప్రతినిధి కాదని భారత్ పేర్కొంది. ఈ మండలి నిర్ణయాలకు సంబంధించిన అనేక సమస్యలకు ప్రధాన కారణం ఇదేనని పేర్కొంది. ఐరాస ప్రారంభమైన 1945నాటి పరిస్థితులు ప్రస్తుతం లేవని తెలిపింది. భద్రతా మండలి నిష్పాక్షికతను సభ్య దేశాలు విశ్వసించాలంటే, దాని నిర్ణయాలు తప్పనిసరిగా నిష్పాక్షిక కొలమానాల ఆధారంగా జరగాలని స్పష్టం చేసింది. యూఎన్ఎస్‌సీలో శాశ్వత భారత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి బుధవారం అంతర్జాతీయ శాంతి, భద్రతల నిర్వహణపై మాట్లాడుతూ భారత దేశ వైఖరిని వివరించారు. 


సమష్టి కార్యాచరణకు ట్రిగ్గర్ మెకానిజంగా పని చేయాలని యూఎన్ఎస్‌సీ చెప్తోందన్నారు. యూఎన్ఎస్‌సీ చర్య మొదటి అడుగు కాదని, అన్ని అవకాశాలు ఆవిరైపోయిన తర్వాత చిట్టచివరిదని అన్నారు. సభ్య దేశాల అంతర్గత వ్యవహారాల్లో చొరబడకూడదనే సిద్ధాంతం యూఎన్ఎస్‌సీకి ముఖ్యమైనదని చెప్పారు. యూఎన్ఎస్‌సీ ఏదైనా చర్యను ప్రారంభించేటపుడు ఈ ముఖ్యమైన సమతుల్యతను పాటించడం సవాలుతో కూడినదని చెప్పారు. 


మధ్యవర్తిత్వం కోసం కృషికి అనుమతించకుండా జోక్యం చేసుకుంటుండటం వల్ల కలుగుతున్న ఇబ్బందికర పర్యవసానాలను మనం చూస్తున్నామన్నారు. ముఖ్యంగా ప్రాంతీయ మధ్యవర్తిత్వ కృషికి అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఈ నేపథ్యంలో మనం చరిత్ర నుంచి సరైన పాఠాలను నేర్చుకోవాలన్నారు. యూఎన్ఎస్‌సీ నిర్ణయాలకు సంబంధించిన సమస్యల్లో చాలా వాటికి ఓ ప్రధాన కారణం ఉందన్నారు. యూఎన్ఎస్‌సీ సమకాలిక ప్రపంచానికి నిజమైన ప్రతినిధి కాకపోవడమే ఆ ప్రధాన కారణమని వివరించారు. ఐరాస ప్రారంభమైన 1945నాటి పరిస్థితులు ప్రస్తుతం లేవన్నారు. భద్రతా మండలి నిష్పాక్షికతను సభ్య దేశాలు విశ్వసించాలంటే, దాని నిర్ణయాలు తప్పనిసరిగా నిష్పాక్షిక కొలమానాల ఆధారంగా జరగాలని తెలిపారు.



Updated Date - 2021-09-09T00:01:20+05:30 IST