కొబ్బరి.. ఏదీ ఊపిరి?

ABN , First Publish Date - 2021-09-02T04:58:48+05:30 IST

పచ్చని కొబ్బరి తోటలతో మరో కోనసీమగా పేరొందిన ఉద్దానంలో రైతులు ప్రకృతి విపత్తులతో చిత్తవుతున్నారు. ఎన్నో ఒడిదొడుకుల మధ్య కొబ్బరి రైతుల జీవనం సాగుతోంది. తెగుళ్ల తాకిడితో పంటను రక్షించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. దిగుబడి లేక.. మద్దతు ధర లభించక ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా ఎగుమతులు కూడా నిలిచిపోవడంతో విలవిల్లాడుతున్నారు. గురువారం అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవం సందర్భంగా.. జిల్లాలో కొబ్బరి రైతుల పరిస్థితి పై ప్రత్యేక కథనం.

కొబ్బరి.. ఏదీ ఊపిరి?
కంచిలిలో తితలీ తుఫాన్‌ దెబ్బకి నేలకొరిగిన కొబ్బరి చెట్లు(ఫైల్‌)

- నిలకడ లేని ధరలు 

- దిగుబడిపై తెగుళ్ల ప్రభావం

- ప్రకృతి విపత్తులతో తగ్గుతున్న సాగు 

- కరోనాతో రైతులకు మరింత నష్టం

- నేడు అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవం

(సోంపేట/కంచిలి)

పచ్చని కొబ్బరి తోటలతో మరో కోనసీమగా పేరొందిన ఉద్దానంలో రైతులు ప్రకృతి విపత్తులతో చిత్తవుతున్నారు. ఎన్నో ఒడిదొడుకుల మధ్య కొబ్బరి రైతుల జీవనం సాగుతోంది. తెగుళ్ల తాకిడితో పంటను రక్షించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. దిగుబడి లేక.. మద్దతు ధర లభించక ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా ఎగుమతులు కూడా నిలిచిపోవడంతో విలవిల్లాడుతున్నారు. గురువారం అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవం సందర్భంగా.. జిల్లాలో కొబ్బరి రైతుల పరిస్థితి పై ప్రత్యేక కథనం. 

---------------------------

ఒకప్పుడు పచ్చని కొబ్బరితోటలతో కనువిందు చేసే ఉద్దానం ప్రాంతం.. నేడు కళ తప్పుతోంది. ప్రకృతి విపత్తులు.. తెగుళ్ల తాకిడితో కొబ్బరి దిగుబడి తగ్గుతోంది. కొబ్బరి తోటలే సర్వస్వంగా భావించే రైతుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి మండలాల్లో సుమారు 16 వేల హెక్టార్లలో కొబ్బరి సాగవుతోంది. ఇవి కాకుండా ఇళ్లపెరట, పొలాలు, కాలువ గట్లపైన వేలాది చెట్లు పెంచుతున్నారు. కొబ్బరి పంటను నమ్ముకుని సుమారు రెండు లక్షల మంది ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఉద్దానంలో దీర్ఘకాలం దిగుబడి నిచ్చే చెట్లు(ఈస్ట్‌కోస్టు టాల్‌) పెంపకం ఎక్కువ. సాధారణంగా ఈ రకం మొక్కలు ఏడేళ్ల వరకు కాపునకు రావు. ఆ తర్వాత 60నుంచి75 సంవత్సరాల వరకు దిగుబడినిస్తాయి. వర్షాభావ పరిస్థితులను సైతం తట్టుకుంటాయి. కేవలం భారీ గాలులు వీస్తేనే నేలకొరుగుతాయి. గ్లూకోజ్‌ శాతం ఎక్కువగా లభ్యమయ్యే ఉద్దానం కొబ్బరి కాయలు నాణ్యతకు ప్రసిద్ధి. ఈ క్రమంలో జిల్లా నుంచి తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర రాష్ట్రాలకు కొబ్బరి ఎక్కువగా ఎగుమతయ్యేది. 1999 నుంచి తరచూ ప్రకృతి విపత్తుల తాకిడితో దిగుబడి తగ్గుతోంది. గతంలో ఎకరా తోటలో రెండు నెలలకోసారి వెయ్యి కాయల వరకు దిగుబడి వచ్చేవి. ప్రస్తుతం 500కి పడిపోయింది. మరోవైపు కొబ్బరి చెట్లకు ఎర్రనల్లి, తెల్లదోమ, ఆకు, ఎండాకు తెగుళ్ల సోకుతున్నాయి. ఆకులు ఎండిపోయి చెట్లు జీవం కోల్పోవడంతోపాటు పూతకు వచ్చిన గెలల్లో కాయలు తొలిదశలోనే రాలిపోతున్నాయి. దీంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిలకడలేని ధరలతో మరింత నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలో తోటలు చాలా వరకు నరికేసి రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్లుగా మార్చేస్తున్నారు. వేలాది ఎకరాల్లో కొబ్బరి తోటలు తొలగించడంతో సాగు విస్తీర్ణం తగ్గుతోంది. ఉత్పత్తి తగ్గుతున్నా ధర మాత్రం పెరగడం లేదు.


 విపత్తులు... తెగుళ్లు తాకిడి

ఉద్దానం ప్రాంతానికి 1969 నుంచి పెను తుపానుల తాకిడి వెంటాడుతోంది. 1999 అక్టోబరులో వచ్చిన పెనుతుపానుతో కొబ్బరి పంట అతలాకుతలమైంది. ఎర్రనల్లి తెగులు సోకి పంట నాశనమైంది. కొమ్ముపురుగు, ఎర్రముక్కు పురుగులు వ్యాప్తి చెంది పంటను కొరికేశాయి. తర్వాత 2004, 2013, 2014, 2018లలో సంభవించిన తుఫాన్ల ప్రభావంతో కొబ్బరిపంట నాశనమవుతోంది. 2018 అక్టోబరులో తితలీ తుఫాన్‌ దెబ్బకు వేలాది ఎకరాల తోటలు నేలకొరిగాయి. మిగిలిన చెట్లకు తెల్లదోమ సోకడంతో పచ్చదనం హరించుకుపోయింది. పంటల దిగుబడి బాగా తగ్గిపోయింది. 


కరోనా ప్రభావం

కరోనా దెబ్బకు కొబ్బరి రైతులు విలవిల్లాడుతున్నారు. కరోనా మొదటిదశ ప్రారంభమైనప్పటి నుంచి ఎగుమతులు మందగించాయి. స్థానిక వ్యాపారులు రైతుల వద్ద కొబ్బరికాయలు కొనుగోలుచేసి ఇతర రాష్ర్టాలకు ఎగుమతులు చేస్తుంటారు. లాక్‌డౌన్‌ ప్రభావంతో రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ధరలు పడిపోయాయి. దీంతో కొబ్బరి విక్రయాలకు ప్రధాన కేంద్రమైన కంచిలి మార్కెట్‌ సైతం బోసిపోతోంది. కరోనా వైరస్‌ విజృంభించక ముందు వెయ్యి కాయల ధర రూ.21 వేలు వరకూ ఉండేది. దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేయడంతో కొబ్బరి రైతులకు రాబడి అమాంతంగా పడిపోయింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో క్రమంగా ఎగుమతులు పుంజుకొని ఫిబ్రవరి, మార్చిల్లో ధరలు పెరిగాయి. ఆ సమయంలో రైతు వద్ద ఒక్కో కాయ ధర రూ.11 వరకు పలికింది. పరిమాణాన్ని బట్టి వ్యాపారులు వెయ్యి కాయలను రూ.11వేల నుంచి రూ.13 వేలకు కొనుగోలు చేసి.. ఎగుమతి చేశారు. ప్రస్తుతం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.  రైతుల వద్ద ఒక కాయ ధర రూ.10కు దాటడం లేదు. స్థానిక వ్యాపారులు  బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరకే కొనుగోలు చేస్తుండడంతో రైతులు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు. 


రెట్టింపు పరిహారం అంతేనా

తితలీ తుఫాన్‌ బాధితులకు గత ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని రెట్టింపు చేస్తామని.. పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా.. ఇంతవరకూ ఆ హామీ కార్యరూపం దాల్చలేడు. బాధితుల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని... వాటిని అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పడం తప్ప.. పరిహారం అందజేసే సూచనలు కనిపించడం లేదు. సుమారు ఆరు వేల మంది రైతులకు ఒక్క పైసా కూడా అందలేదు. కొబ్బరి పరిశోధన కేంద్రం ఏర్పాటు కలగానే మిగిలింది. కొబ్బరి అనుబంధ పరిశ్రమలు ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలని రైతులు  కోరుతున్నారు.


ప్రోత్సహించాలి..

కొబ్బరి  రైతులను ప్రభుత్వం ప్రోత్సహించాలి. అధిక దిగుబడినిచ్చే మొక్కలను రాయితీపై సరఫరా చేయాలి. తోటల్లో అంతర పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలి. కొన్నేళ్లుగా తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారు. జిల్లాలో కొబ్బరి ఉత్పత్తుల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలి.

-బొడ్డ నాగేశ్వరరావు, పెద్దకొజ్జిరియా


మద్దతు ధర ప్రకటించాలి..

వరుస ప్రకృతి వైపరీత్యాలతో కొబ్బరి చెట్లు నేలకొరగడంతోపాట ఎర్రనల్లి, తెల్లదోమ వల్ల దిగుబడి తగ్గింది. ఆదాయం లేక గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పులతో ఇబ్బందులు పడుతున్నాం. ఽప్రభుత్వమే కొబ్బరికి మద్దతు ధర ప్రకటించి కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి.

- సనపల కామేశ్వరరావు, కుత్తుమ, రైతు

Updated Date - 2021-09-02T04:58:48+05:30 IST