అస్పృశ్యత అనర్థకారకం

ABN , First Publish Date - 2021-09-03T05:30:00+05:30 IST

‘‘మనుషులందరూ పీల్చే గాలి ఒకటే, నిలబడే నేల ఒకటే, తాగే నీరు ఒకటే, తినే తిండి ఒకటే... అలాంటప్పుడు ఈ కులబేధాలు, అంటరానితనం ఎందుకు? అవి ప్రకృతి ప్రసాదించినవి కావు...

అస్పృశ్యత అనర్థకారకం

‘‘మనుషులందరూ పీల్చే గాలి ఒకటే, నిలబడే నేల ఒకటే, తాగే నీరు ఒకటే, తినే తిండి ఒకటే... అలాంటప్పుడు ఈ కులబేధాలు, అంటరానితనం ఎందుకు? అవి ప్రకృతి ప్రసాదించినవి కావు. మానవులు తమకు తాముగా గీసుకున్న విభజన రేఖలు. మనసుల్లో నాటుకుపోయిన విష భావాలు’’ అని బుద్ధుడు చెప్పిన ఈ కథ కనువిప్పు కలిగిస్తుంది.

అది వారణాసి నుంచి హిమాలయాలకు వెళ్ళే దారి. ఉదయాన్నే బయలుదేరాడు భరద్వాజుడు. అతను ఒక పండిత కుటుంబానికి చెందిన యువకుడు. అతను కొంత దూరం వెళ్ళాక... దారిలో మరో యువకుడు తారసపడ్డాడు. ‘‘ఎవరు నీవు?’’ అని అడిగాడు భరద్వాజుడు.

‘‘మిత్రమా! నా పేరు సుదాసు’’ అని చెప్పాడు ఆ యువకుడు. సుదాసు భుజాన అంగవస్త్రానికి కట్టిన రెండు మూటలు అటూ ఇటూ వేలాడుతున్నాయి. నెత్తిమీద గంప ఉంది.

‘‘ఆ గంపలో ఏమున్నాయి?’’ అని అడిగాడు భరద్వాజుడు.

‘‘చెప్పులు. మేము చర్మకారులం. ఎగువన ఉన్న గ్రామాల్లో వీటిని అమ్మడానికి వెళుతున్నాను’’ అన్నాడు సుదాసు.

అతను అంటరాని కులంవాడని భరద్వాజుడికి అర్థమయింది. ‘‘నేను ఉన్నత పండిత వంశంవాణ్ణి. హిమాలయాల్లో ఉన్న ఋషి ఆశ్రమానికి పోతున్నాను’’ అంటూ సుదాసుకు కొంచెం దూరం జరిగి, నడక సాగించాడు.

వారు అడవి దారిన పడ్డారు. మధ్యాహ్నానికి ఒక చోట బావి కనిపించింది. అక్కడ ఆగారు. సుదారు నెత్తిన తట్ట దించుకొని, కాళ్ళూ, చేతులూ కడుక్కొని, ఒక చెట్టు కింద కూర్చున్నాడు. భుజాన ఉన్న అన్నం మూటల్లో ఒక దాన్ని విప్పాడు.

‘‘మిత్రమా! నీవు మంచినీటితో సరిపెట్టుకున్నావు. నీరు ఆకలి తీర్చదు. రెండో మూటలో కూడా అన్నం ఉంది. రాత్రి భోజనం కోసం తెచ్చుకున్నాను. ఈ అడవిలో అన్నం పెట్టేవారు ఉండరు. రా! దీన్ని తీసుకో. నేను ఎంగిలి చేయలేదు. ముట్టలేదు’’ అన్నాడు.

కడుపులో ఆకలి ఉన్నా, మనసులో ‘అంటరానితనం’ అనే భావన ఉన్న భరద్వాజుడు ‘‘లేదు మిత్రమా! ఉదయాన్నే కడుపునిండా తిని వచ్చాను. అవసరం లేదు. ఆకలీ లేదు’’ అన్నాడు.

కొద్ది విశ్రాంతి తరువాత ఇద్దరూ ప్రయాణం సాగించారు. సూర్యాస్తమయం వేళకు ఒక చోట ఆగారు. సుదాసు తన రెండో మూట విప్పి తినసాగాడు, ఈసారి తినమని భరద్వాజుణ్ణి అడగలేదు. భరద్వాజుడికి ఆకలి దహించుకుపోతోంది. ఆగలేకపోయాడు. 

సుదాసు దగ్గరకు వచ్చి ‘‘కనీసం తింటావా? లేదా? అని అడగాలనే సంస్కారం లేదా?’’ అంటూ అన్నం మూట లాక్కొని, గబగబా తినడం మొదలుపెట్టాడు. ‘‘ఆహా! ఎంత రుచిగా ఉంది...’’ అంటూ మొత్తం తినేశాడు.

ఆకలి దడ తగ్గింది. విశ్రాంతిగా కూర్చున్నాడు. ఆలోచన మొదలయింది. 

‘అయ్యో! ఎంత తప్పు చేశాను! అంటరానివాడి అన్నం తిన్నాను. ఇది తెలిస్తే నా వాళ్ళు నన్ను క్షమించరు. ఎంత కుసంస్కారిలా ప్రవర్తించాను’ అని అనుకున్నాడు. ఒళ్ళు తెమిలింది. వాంతి అయింది. తనమీద తనకే జుగుప్స కలిగింది. వాంతులు ఆగలేదు. చివరకు రక్తం కూడా కక్కాడు. నీరసంగా పడిపోయాడు. లేచి, పిచ్చివాడిలా ఆ అడవిలోకి పరుగులు తీశాడు.

అన్నం ఆకలి తీర్చింది. శ్రేయస్కరం కాని ఆలోచన ఆయువు తీసింది!

మనుషులంతా ఒక్కటే. కానీ, మానవ సమాజం ప్రపంచవ్యాప్తంగా అనేక కారణాలతో విడిపోయింది. అనైక్యంగానే ఉంది. ఒక చోట కులం, ఒక చోట మతం, ఒక చోట జాతి, ఒక చోట రంగు... ఇలా ఏదో ఒక కారణంగా విడిపోయింది. ఒకరికన్నా మరొకరు అధికులనీ, ఇంకొకరు అధములనీ గిరిగీసుకుంది. మన దేశంలో కులం పేరుతో, అంటరానితనం పేరుతో సమాజం కలవలేనంత అగాధాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ అగాధం మనిషినే కాదు, మానవ సమాజాన్ని, చివరకు దేశాన్ని కూడా బలహీనపరుస్తుందనీ, అది మనుష్య జాతి మనుగడకే ప్రమాదం అని గుర్తించిన వారు కొందరున్నారు. వారిలో తొలి వరుసలో బుద్ధుడు ఉంటాడు. 

- బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2021-09-03T05:30:00+05:30 IST