అవాస్తవిక బడ్జెట్ !

ABN , First Publish Date - 2020-06-27T06:28:13+05:30 IST

2020–-21 సంవత్సర రాష్ట్ర బడ్జెట్‌ను ఆచరణ సాధ్యం కాని వనరుల సమీకరణ మీద ఆధారపడి ప్రతిపాదించినట్లు ఉన్నది. ముందే వ్యయ అంచనాలను రూపొందించుకొని దానికి సరిపడా వనరులను.....

అవాస్తవిక బడ్జెట్ !

2020–-21 సంవత్సర రాష్ట్ర బడ్జెట్‌ను ఆచరణ సాధ్యం కాని వనరుల సమీకరణ మీద ఆధారపడి ప్రతిపాదించినట్లు ఉన్నది. ముందే వ్యయ అంచనాలను రూపొందించుకొని దానికి సరిపడా వనరులను చూ పెట్టుకోవటానికి చేసిన ప్రయత్నంగా బడ్జెట్ కనిపిస్తున్నది. మూలధన వ్యయం, తదనుగుణంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల, ఆర్థిక అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎండమావులు గానే మిగిలిపోయేటట్లు ఉన్నాయి.


ఈమధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు 2020–-21 సంవత్సర రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ నవరత్న ఖచిత బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఆచరణ సాధ్యం కాని వనరుల సమీకరణ మీద ఆధారపడి ప్రతిపాదించినట్లు ఉన్నది. ముందే వ్యయ అంచనాలను రూపొందించుకొని దానికి సరిపడా వనరులను చూపెట్టుకోవటానికి చేసిన ప్రయత్నం గానే బడ్జెట్ కనిపిస్తున్నది. ఏ రాష్ట్ర బడ్జెట్ కైనా ప్రధానమైన ఆదాయ మార్గాలు కేంద్ర ప్రభుత్వ పన్నులో వచ్చే వాటా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు, రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకునే పన్నుల ఆదాయం, గనుల కార్యక్రమాల లాంటి ఇతరత్రా ఆదాయ మార్గాలు. రెవిన్యూ పద్దులో వచ్చే ఈ ఆదాయాలకు ప్రభుత్వం చేసే అప్పులను కలుపుకుంటే స్థూలంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లోని ఆదాయ వనరులు సమకూరుతాయి. నికరంగా చేసే ఈ అప్పు నేద్రవ్య లోటు అని కూడా అంటారు.


సాధారణంగా గత మూడు నాలుగు సంవత్సరాల ఆదాయ వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకొని ప్రస్తుత సంవత్సరానికి ఈ పద్దుల కింద ఎంత రావచ్చు అనేది అంచనా వేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం బడ్జెట్ అంచనాలు దీనికి విరుద్ధంగా పూర్తి అవాస్తవికంగా ఉన్నాయి. 2019–-20 సవరించిన పద్దులకు అనుగుణంగా ఆ సంవత్సరానికి వచ్చే రెవెన్యూ ఆదాయం రూ.1,10,000 కోట్లు. 2020–-21 సంవత్సరానికి రెవెన్యూ ఆదాయాన్ని అమాంతం రూ.50,000 కోట్లు పెంచి రూ.1,61,000 కోట్లు చూపెట్టడం జరిగింది. కరోనా మహమ్మారి ప్రభావంవల్ల జాతీయ స్థూల ఆదాయం 5 నుంచి 10 శాతం వరకు తగ్గవచ్చునని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అటువంటి పరిస్థితులలో రెవెన్యూ ఆదాయం రూ.1,10,000 కోట్ల కన్నా తక్కువ ఉండే అవకాశమే గాని ఇంత గణనీయంగా పెరిగే అవకాశం ఎక్కడ ఉండకపోవచ్చు. రెవెన్యూ ఆదాయంలోని భాగమైన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు 2019–-20 సంవత్సరానికి రూ.22,000 కోట్లు కాగా 2020–-21 సంవత్సరం బడ్జెట్ అంచనాలలో ఈ మొత్తాన్ని రూ.53,000 కోట్లుగా రెట్టింపు కన్నా ఎక్కువగా చూపించుకోవటం జరిగింది. కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వ వనరులు కూడా గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. దీనితో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు, పన్నులలో వాటా గత సంవత్సరం కన్నా తగ్గే అవకాశం వుంది గాని పెరిగే అవకాశం మృగ్యం. ఇక రాష్ట్ర ప్రభుత్వ వనరుల విషయం పరిశీలిస్తే ఆ ఆదాయ మార్గాలు తగ్గే అవకాశమే కానీ పెరిగే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే వాటిలో ప్రధానమైనవి పెట్రోల్ ఉత్పత్తులు, మద్యం, రిజిస్ట్రేషన్ చార్జీలు. కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్న తరువాత ఈ ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు లేనే లేవు. ఈ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని ప్రభుత్వ విధానంగా ప్రకటించిన నవరత్నాలులో ఒకటిగా చేర్చింది. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేయటం మొదలెడితే రాష్ట్ర సొంత వనరులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మద్యం నుంచి ఎక్సైజ్ ద్వారానే గాక వాణిజ్య పన్నుల ద్వారా కూడా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది.


ఇక ఈ రెవెన్యూ ఆదాయానికిజోడించే అప్పులను ఈ సంవత్సరానికి రూ.54,000 కోట్లుగా చూపించారు. గత సంవత్సరం ఇదే పద్దు కింద చేసిన అప్పులు రూ.49,000 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ ఆర్ బి ఎం చట్టంకింద రాష్ట్రాలకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు తీసుకోవడానికి వెసులుబాటు ప్రస్తుతం ఉన్న మూడు శాతం నుంచి 5 శాతం వరకు పెంచింది కాబట్టి ఈ అదనపు అప్పులు చేయడానికి రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. వాస్తవ కోణంలో చూస్తే ఈ అదనపు అప్పులతో కలిపి రాష్ట్ర వనరులు గత సంవత్సర సరిచేసిన అంచనాలు అయిన రూ.1,74,000 కోట్లను మించకపో వచ్చు. కరొనా తీవ్రత ఇలాగే కొనసాగితే అంతకన్నా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులలో దాదాపు రూ.50,000 కోట్ల రూపాయల అదనపు వ్యయాన్ని చూపెడుతూ తయారుచేసిన రూ.2,24,000 కోట్ల బడ్జెట్‌కు కావాల్సిన వనరులు ఎక్కడి నుంచి లభ్యమవుతాయో ఏలిన వారికే తెలియాలి.


ఇక వ్యయం పద్దులను పరిశీలిస్తే జీతాలు పెన్షన్లు వడ్డీ చెల్లింపులు వంటి పద్దులను తగ్గించే అవకాశం లేదు. పరిపాలనా సర్వీసుల కింద ఈ పై పద్దుల కు కేటాయించిన మొత్తం రూ.46,000 కోట్ల రూపాయలు. వడ్డీ కాక అసలు చెల్లించడానికి కేటాయించిన మొత్తం రూ.11,740 కోట్ల రూపాయలు. ఈ 58,000 కోట్ల రూపాయల చెల్లింపుల విషయంలో ప్రభుత్వాలకు ఎటువంటి విచక్షణాధికారాలు లేవు. ఇక బడ్జెట్ వెబ్ సైట్‌లో ప్రముఖంగా చూపించబడిన వివిధ సంక్షేమ కార్యక్రమాల మొత్తం 44,000 కోట్ల రూపాయల దాకా వస్తున్నది. ఇవేకాక ఇండ్ల స్థలాలకు 8000 కోట్ల రూపాయలు, గృహ నిర్మాణ కార్యక్రమానికి 11000 కోట్ల రూపాయలు మంత్రివర్యులు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనటం జరిగింది. ఈ కార్యక్రమాలే ఇంకొక 62,000 కోట్ల రూపాయల దాకా వస్తున్నాయి. అందుకనే ఈ బడ్జెట్ నేను మొదటిలో పేర్కొన్న విధంగా ముందు వ్యయాలను అంచనా వేసి దానికనుగుణంగా లేని వనరులను చూపెడుతూ తయారుచేసిన బడ్జెట్ లాగా కనిపిస్తున్నది.


ఇటువంటి అవాస్తవిక బడ్జెట్ అమలు చేసే ప్రక్రియలో చాలా పథకాలకు కోతలు విధింపక తప్పదు. చాలా విచక్షణాధికారం ఆర్థిక శాఖ చేతుల్లో పెట్టి నట్లు అవుతుంది. ప్రభుత్వ ప్రధాన నవరత్న కార్యక్రమాలను అమలు చేయడానికి కూడా వనరులు సమకూర్చుకోవటం సాధ్యం కాకపోవచ్చు. ఇక మూలధన వ్యయం, అభివృద్ధి మాట దేవుడెరుగు. రెవెన్యూ వనరులు భారీగా తగ్గిపోవడంతో అప్పులు చేసి రెవెన్యూ ప్రణాళికలను కొనసాగించాల్సిన పరిస్థితి వస్తుంది. రెవెన్యూ లోటు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అప్పు చేసి పప్పు బెల్లాల పంపకం భవిష్యత్తు తరాల వారి పై భారం వేసి ఈ తరంవారు పండగ చేసుకున్నట్లే. మూలధన వ్యయం, తదనుగుణంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల, ఆర్థిక అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎండమావులు గానే మిగిలి పోయే టట్లు ఉన్నాయి.



ఐ.వై.ఆర్. కృష్ణారావు 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి



Updated Date - 2020-06-27T06:28:13+05:30 IST