నిరుపయోగంగా దుకాణాల సముదాయం

ABN , First Publish Date - 2020-11-20T05:24:09+05:30 IST

గోపాలపట్నం బంక్‌ కూడలిలోని బుధవారం సంత ప్రాంగణంలోని చేపలు, మాంసం విక్రయించే దుకాణాల సముదాయం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది.

నిరుపయోగంగా దుకాణాల సముదాయం
గోపాలపట్నం శ్మశాన వాటిక పక్కన నిర్మించిన చేపలు, మాంసం దుకాణాల సముదాయం

రూ. లక్షలు వెచ్చించినా నెరవేరని లక్ష్యం

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న వైనం

గోపాలపట్నం, నవంబరు 19: గోపాలపట్నం బంక్‌ కూడలిలోని బుధవారం సంత ప్రాంగణంలోని చేపలు, మాంసం విక్రయించే దుకాణాల సముదాయం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారి సౌకర్యార్థం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు కృషితో రూ.లక్షలు వెచ్చించి అధునాతన దుకాణ సముదాయం నిర్మించారు. అయితే ఇది శ్మశాన వాటికకు సమీపంలో ఉండడంతో వ్యాపారాలు సాగలేదు. దీంతో ఈ దుకాణాలను రెండేళ్ల క్రితం వర్తకులు విడిచిపెట్టారు. ఇప్పుడు ఇది నిరుపయోగంగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. గోపాలపట్నం కూడలిలో అత్యంత ఖరీదైన ప్రదేశంలో నిర్మించిన ఈ వ్యాపార సముదాయాన్ని నిర్మించడానికి రూ.40 లక్షల వరకు ఖర్చు చేశారు. దీనిని మరో రూ.5 లక్షలతో ఆధునికీకరిస్తే ప్రభుత్వ కార్యాలయంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపడితే ప్రజాధనం దుర్వినియోగం కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


Updated Date - 2020-11-20T05:24:09+05:30 IST