Abn logo
Jan 14 2021 @ 03:18AM

అసామాన్యుడు దుర్గాప్రసాద్

నివాళి : నాగళ్ళ వేంకట దుర్గాప్రసాద్

కేవలం కళ్ళను చిత్రిస్తే చాలు వ్యక్తిత్వంతో సహా ఒక మనిషి మూర్తిమత్వాన్ని రూపు గట్టవచ్చు అన్నాడు చైనా మహా రచయిత లూసన్. ఈ రోజు లోకాన్ని శాశ్వతంగా వదలి వెళ్ళిన నాగళ్ళ వేంకట దుర్గాప్రసాద్ విషయంలో ఇది నూటికి నూరుపాళ్ళూ నిజం అనిపిస్తుంది. అతనిని తలచుకుంటే చాలు నిత్య జలాశయాల వంటి అతని కళ్లు స్ఫురిస్తాయి. అతని చూపులు ఎంత ఆర్ద్రంగా వుంటాయో అతని నిర్ణయాలు అంత దృఢంగా ఉంటాయి.


కేవలం అకాడమీలు, యూనివర్సిటీలు మాత్రమే చేయగల అనేక పనులను అతి సునాయాసంగా చేయగలిగిన కార్యశీలి. కేవలం తన కుటుంబసభ్యుల కష్టార్జితంతో తెనాలి పట్టణంలో రంగస్థల కళాకారుల కోసం సువిశాలమైన రెండు అంతస్తుల భవనం నిర్మించి ఇచ్చాడు. చరిత్రాత్మకమైన అనేక సదస్సులను నిర్వహించాడు. మార్క్సిజం మీదా, తెలుగులో దిగంబర కవిత్వం స్వర్ణోత్సవం సందర్భంగా నిర్వహించిన సదస్సులు మచ్చుకు కొన్ని మాత్రమే. అసంఖ్యాకంగా సదస్సు లను నిర్వహించాడు. నిరుపేద కళాకారులకు ఆర్థికంగా అండదండలు అందించడం అతని జీవితంలో నిత్యకృత్యం. 


ఆధునిక సాంకేతిక వనరుల ద్వారా సదస్సు ప్రయోజనాలను పల్లె ప్రాంతాలకు అనుసం ధానం చేశాడు. మన సాంస్కృతిక వార సత్వాన్ని యువతరానికి, మరీ ముఖ్యంగా విద్యార్థులకు అందించటం కోసం అతను చేసిన ప్రయోగం, కృషీ వ్యక్తులు కాదు వ్యవస్థలు, ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకోదగినవి. 


సాంస్కృతికంగా, రాజకీయంగా తెనాలి పట్టణానికి తనదైన ఒక విశిష్టత ఉంది. పలు కాలాల్లో పలు వ్యక్తిత్వాల రూపంలో ఈ పట్టణం తనను అభివ్యక్తం చేసుకుంది. గత రెండు దశాబ్దాల తెనాలి సాంస్కృతిక చరిత్ర దుర్గాప్రసాద్ ద్వారా అభివ్యక్తం అయిందనటం అతిశయోక్తి కాదు.


విద్యార్థి దశ నుంచి ప్రగతిశీల ఉద్యమాల్లో పని చేస్తూ వచ్చాడు. కేవలం 56 సంవత్సరాల జీవితంలో దుర్గాప్రసాద్ ఎన్నో పనులు చేశాడు. జీవితం తనకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేశాడనిపిస్తుంది. సాహిత్యం కోసం రంగస్థలం కోసం సాంస్కృతిక వైభవం కోసం అతను అనుక్షణం పరితపించాడు. ఈ క్రమంలో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించాడు. కిడ్నీలు పూర్తిగా దెబ్బతినేవరకూ తెలీదు. జీవన సహచరి రాజేశ్వరి కిడ్నీ దానం చేసింది. ఇటువంటి సున్నితమైన స్థితిలో ఉండి కూడా కరోనా బారిన పడిన ఒక జంటకు వైద్య సహాయం అందించబోయి తానే కరోనా బారిన పడి జీవితాన్ని చాలించాడు.


కుమార్తె పేరు కావ్య. కుమారుడు జయరాం. హెచ్‌ఎమ్‌టిలో ఇంజనీరుగా పని చేసి కార్మికుల శ్రేయోభిలాషిగా మన్ననలను అందుకున్న తండ్రి రామ కోటేశ్వరరావు చనిపోయే వాటికి దుర్గా ప్రసాద్ వయస్సు 16 సంవత్సరాలు. తండ్రి మరణం వల్ల కలిగిన మనోవేదనను అక్షరాలుగా మలిచాడు. అది స్మృతి కావ్యంగా రూపు దిద్దుకుంది.


అతనిని గురించి నిజం చెప్పినా అతిశయోక్తి అనిపిస్తుంది. అతడు ఒక మౌఖిక అచ్చు యంత్రం. అతడు ఒకానొక సంచార తాళపత్ర గ్రంథం.. తెలుగు కవిత్వం, తెలుగు నాటకం అతని నాలిక మీద నిత్యం నాట్యం చేస్తుంటాయి. 


‍స్నేహ లాలసుడు దుర్గాప్రసాద్. ఖమ్మం కవి మిత్రుడు మువ్వా శ్రీనివాసరావు ద్వారా పరిచయం. అతని ఉనికి తాలూకు మౌనాన్ని భరించటం దుర్భరం. దుర్గాప్రసాద్ లేని వెలితిని భర్తీ చేయటం తెనాలి పట్టణానికి ఇప్పట్లో అసాధ్యం.


మహానుభావులు చరిత్రపుటలలో మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వారిలో కూడా ఉంటారనటానికి దుర్గాప్రసాదే ప్రబల సాక్ష్యం. దుర్గా ప్రసాద్‌ది దిగ్విజయమైన జీవితం కాకపోవచ్చు కానీ, ఎంతో సార్థకమైన జీవితం.

ఖాదర్ మొహియుద్దీన్

Advertisement
Advertisement
Advertisement