ఔదార్యంలో అసామాన్యురాలు!

ABN , First Publish Date - 2021-05-26T09:36:58+05:30 IST

కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం. నూతన ప్రభుత్వం కొలువు తీరుతున్న వేళ... కొవిడ్‌ నియంత్రణల మధ్య కొత్త శాసనసభ్యులు, ముఖ్యమైన అధికారులు, నేతలకే పరిమితమైన ప్రమాణ స్వీకార వేడుకు ఒక మహిళ విశిష్ట అతిథిగా

ఔదార్యంలో అసామాన్యురాలు!

కష్టాల్లో ఉన్న తోటి వారికి సాయం చేయడానికి కావలసింది కోట్ల రూపాయల ఆస్తులూ, అధికారిక హోదాలూ కాదు... స్పందించే హృదయం అని నిరూపించారు సుబైదా.

కేరళకు చెందిన ఈ మహిళ తను పెంచుకుంటున్న మేకలను అమ్మి... కొవిడ్‌ బాధితులకూ, నిస్సహాయులకూ చేయూతనిచ్చారు.

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వివిఐపిగా హాజరయ్యే గౌరవాన్ని అందుకున్నారు.


కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం. నూతన ప్రభుత్వం కొలువు తీరుతున్న వేళ... కొవిడ్‌ నియంత్రణల మధ్య కొత్త శాసనసభ్యులు, ముఖ్యమైన అధికారులు, నేతలకే పరిమితమైన ప్రమాణ స్వీకార వేడుకు ఒక మహిళ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఆమె సెలబ్రిటీ కాదు... టీ దుకాణం నడుపుతూ, మేకలు పెంచుకుంటూ కుటుంబాన్ని గడుపుకొస్తున్న అతి సామాన్యురాలు. కానీ వితరణలో ఆమె ఎంతోమందికన్నా మిన్నగా నిలిచారు. ఆమె పేరు సుబైదా.


కేరళలోని కొల్లాంలో నివసిస్తున్న 61 ఏళ్ళ సుబైదా కుటుంబానికి ఆమె చేసే శ్రమే ప్రస్తుతం జీవనాధారం. ఆమె భర్త అబ్దుల్‌ సలామ్‌ ఒక టీ దుకాణం నడిపేవారు. దాని ద్వారా వచ్చే చాలీచాలని ఆదాయంతో ఇల్లు గడవడం కష్టం కావడంతో సుబైదా మేకలు పెంపకం మొదలుపెట్టారు. కొన్నాళ్ళ సుబైదా భర్త, ఆమె సోదరుడు అనారోగ్యం పాలయ్యారు. వారికి గుండెకు సంబంధించిన సమస్యలున్నట్టు వైద్యులు నిర్ధారించారు. కిందటి ఏడాది ఆమె భర్తకు హార్ట్‌ సర్జరీ చేయించాల్సి వచ్చింది. దీంతో, ఒక వైపు టీ దుకాణాన్నీ, మరోవైపు మేకల పెంపకాన్నీ ఆమే చూసుకుంటున్నారు. 


కిందటి ఏడాది కొవిడ్‌ మహమ్మారి కారణంగా టీ దుకాణాన్ని తాత్కాలికంగా మూసేయాల్సి వచ్చింది. సుమారు ఇరవై మేకలు, గొర్రెలే సుబైదా కుటుంబానికి ఆధారమయ్యాయి. ఆ సమయంలోనే తన చుట్టూ ఉన్న పేదల బాధలు చూసి ఆమె చలించిపోయారు. ‘‘నిరుడు కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో... కనీస సహాయమైనా దొరక్క ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశాను. ‘విషు’ పండుగ సందర్భంగా కొందరు పిల్లలు ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి (సిఎండిఆర్‌ఎఫ్‌)కు విరాళాలు ఇవ్వడం చూశాక... నేను ఏదైనా చెయ్యాలనిపించింది’’ అని చెప్పారు. సుబైదా. ఆమె రెండు గొర్రె పిల్లలనూ, రెండు పెద్ద మేకలనూ రూ.12 వేలకు అమ్మేశారు. రూ. 5 వేలు సిఎండిఆర్‌ఎఫ్‌ కోసం కలెక్టర్‌కు అందజేశారు. మిగిలిన డబ్బుతో పేదలకు నిత్యావసరాలనూ, ఆహారాన్నీ పంచిపెట్టారు. దీనికి ఆమె స్థానికుల నుంచి విశేషంగా ప్రశంసలు లభించాయి. 




వ్యాక్సిన్ల కోసం తన వంతుగా...

కిందటి ఏడాది చివరికల్లా కొవిడ్‌ కేసులు తగ్గి, అంతా చక్కబడిందను కుంటున్న దశలో మళ్ళీ కరోనా మహమ్మారి మరింత తీవ్రంగా విజృంభించింది. ఎక్కడ చూసినా మరణాల వార్తలే వినిపిస్తూండడం సుబైదాను ఆవేదనకు గురి చేసింది. కొవిడ్‌ను నియంత్రించడానికి వ్యాక్సిన్‌ వచ్చినా, అది అందరికీ ఉచితంగా అందుబాటులో లేదు. ఈలోగా ఉచితంగా వ్యాక్సిన్‌ పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలివ్వాలంటూ సోషల్‌ మీడియా ద్వారా కేరళలో ‘వ్యాక్సిన్‌ ఛాలెంజ్‌’ ప్రారంభమయింది. ఇది తెలుసుకున్న సుబైదా మరోసారి స్పందించారు. ‘‘కొందరికైనా వ్యాక్సిన్‌తో భరోసా కల్పించాలనుకున్నాను. అలాగే లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన ఎందరో తినడానికి తిండి లేక బాధపడుతున్నారు. అందుకే మరో నాలుగు మేకలు అమ్మేశాను. రూ. 16 వేలు వచ్చింది. సిఎండిఆర్‌ఎఫ్‌ కోసం రూ. 5 వేలు కలెక్టర్‌కు అందజేశాను. మిగిలింది పేదల కోసం ఖర్చు చేస్తున్నాను’’ అని చెప్పారు సుబైదా.


ఈ సంగతి తెలుసుకొని, ఆమెను ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ మీడియా ద్వారా అభినందించారు. తన పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.


మాట వరసకు చెప్పారనుకున్నా...

‘‘కిందటి సోమవారం (మే 17) ఉదయం కొల్లాం కలెక్టర్‌ నాకు ఫోన్‌ చేశారు. ‘‘మీకేదైనా కవర్‌ వచ్చిందా?’’ అని అడిగారు. ‘‘లేద’’ని చెప్పాను. ‘‘గురువారం (మే 20న) జరిగే కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరవడం కోసం సిద్ధంగా ఉండండి. మీకోసం ఒక వాహనం వస్తుంది’’ అని అన్నారు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ‘నేనేమిటి? అలాంటి పెద్ద కార్యక్రమానికి వెళ్ళడమేమిటి?’ అనుకున్నాను. కవర్‌ కూడా రాలేదు కాబట్టి ‘ఏదో మాట వరసకు చెప్పారేమో?’ అని సమాధానపడ్డాను. కానీ ఆ మర్నాటి ఉదయం ఒక కవర్‌ వచ్చింది. దాన్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తూ ఒక వివిఐపి పాస్‌ ఉంది. ఇటువంటి ఆహ్వానాన్ని నేనెప్పుడూ ఊహించలేదు’’ అని సుబైదా గుర్తు చేసుకున్నారు. కలెక్టర్‌ చెప్పినట్టే ఒక వాహనం ఆమె ఇంటి ముందు ఆగింది.


ఆ ప్రత్యేక అతిథిని రాజధానికి తీసుకువెళ్ళింది. ప్రత్యేక ఆహ్వానితుల వరుసలో... ముఖానికి మాస్క్‌, చేతులకు తొడుగులు ధరించిన సుబైదా కూర్చొని, కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వేడుకను తిలకించారు. ‘‘ముఖ్యమంత్రి విజయన్‌ నిర్వహించే సమావేశాలను నేను క్రమం తప్పకుండా టీవీలో చూస్తూ ఉంటాను. ఆయనను స్వయంగా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అయితే ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం మాత్రం రాలేదు. అది సరైన సమయం కూడా కాదు. ప్రజల ఆకాంక్షలను అందుకొనేలా కొత్త ప్రభుత్వం పని చేస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారామె.


కొల్లాంలోని సంగమంనగర్‌లో, ఒక అద్దె ఇంట్లో జుబైదా కుటుంబం నివసిస్తోంది. ఆమెకు ముగ్గురు బిడ్డలు. సొంత ఊరికి దూరంగా... రోజువారీ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ‘‘డబ్బు కష్టాలు మాకు అలవాటే. కానీ, చుట్టూ ఉన్నవాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు వారి కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది. ఇదంతా పేరు కోసం చెయ్యడం లేదు. కానీ, నేను ఎదురుచూడని గుర్తింపు వచ్చినందుకు సంతోషంగా ఉంది. అవసరంలో ఉన్నవారికి భవిష్యత్తులో కూడా నా శక్తి మేరకు సాయం చేస్తూనే ఉంటాను’’ అంటున్నారు సుబైదా. ఆమె తన ఉదారతతో ఎందరికో అందిస్తున్న ప్రేరణ కూడా తక్కువేం కాదు!

Updated Date - 2021-05-26T09:36:58+05:30 IST