నిర్భర్‌తో నిబ్బరమేది?

ABN , First Publish Date - 2021-06-18T08:17:50+05:30 IST

ఆత్మనిర్భర్‌ సహాయ ప్యాకేజీని పునర్‌నిర్వచించి సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎ్‌సఎంఈ) మరింత చేయూతనివ్వాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు.

నిర్భర్‌తో నిబ్బరమేది?

  • ఎంఎస్ఎంఈలకు నిరుపయోగంగా ప్రత్యేక సహాయ ప్యాకేజీ
  • సంక్లిష్టంగా రుణ ప్రకియ.. ఆత్మనిర్భర్‌ విధివిధానాలను పునర్‌నిర్వచించండి
  • పాత నిబంధనలతో పెద్ద కంపెనీలకే ప్రయోజనం
  • మార్గదర్శకాలను మార్చాల్సిన అవసరం ఉంది
  • కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌కు కేటీఆర్‌ లేఖ


హైదరాబాద్‌, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): ఆత్మనిర్భర్‌ సహాయ ప్యాకేజీని పునర్‌నిర్వచించి సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎ్‌సఎంఈ) మరింత చేయూతనివ్వాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. గత ఏడాది ప్రకటించిన ఆత్మనిర్భర్‌ సహాయ ప్యాకేజీలో ఎన్నో పరిమితులున్నాయని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది పరిస్థితులను బట్టి అప్పటికి ఆ ప్యాకేజీ సరిపోతుందని భావించామన్నారు. అయితే కరోనా సంక్షోభం రెండో దశ రావడమే కాకుండా మూడో దశ కూడా వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఆత్మనిర్భర్‌ ప్యాకేజీని మరోసారి పునర్‌ నిర్వచించాలని కోరారు. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రికి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. కరోనా సంక్షోభం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈ రంగానికి ఆత్మనిర్భర్‌ ప్యాకేజీలో మార్పులు చేయడం ద్వారా మరింత చేయూతనిచ్చే అవకాశం కలుగుతుందన్నారు. ఈ దిశలో కేంద్రం సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రం చేసే ప్రయత్నాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వమూ పనిచేస్తుందన్నారు. ఈ ప్యాకేజీ విషయంలో తమ ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాల అంచనాలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నానని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. 


కరోనా ప్రభావానికి గురైన వివిధ రంగాలను ఆదుకునేందుకు రూ. 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీని రూపొందించి ఏడాది కావొస్తోందని కేటీఆర్‌ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర తయారీ రంగానికి వెన్నెముకగా నిలుస్తున్న ఎంఎస్ఎంఈలకు ఈ ప్యాకేజీ ద్వారా లబ్థి చేకూర్చేలా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా తాను గట్టి ప్రయత్నం చేశానని ఆయన తెలిపారు. అయితే, ఈ ప్యాకేజీలో తెలంగాణలోని ఎంఎ్‌సఎంఈలకు ఉపయోగపడే అంశాలు అత్యల్పంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎంఎ్‌సఎంఈల్లో 80 శాతానికి పైగా పరిశ్రమలు లాక్‌డౌన్‌ కాలంలో తీవ్ర ఎబ్బందులు ఎదుర్కొన్నాయని, 25 శాతానికి పైగా ఎంఎ్‌సఎంఈలైతే తమ రాబడులను పూర్తిగా కోల్పోయాయని లేఖలో పేర్కొన్నారు. ప్యాకేజీలో ఎంఎ్‌సఎంఈలకు సంబంధించి ప్రధానంగా గ్యారంటెడ్‌ ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ స్కీం కోసం రూ.3 లక్షల కోట్లు కేటాయించారన్నారు. సంక్లిష్టమైన ప్రక్రియను రూపొందించడంతో దీనిని ఉపయోగించుకోవడానికి ఎంఎ్‌సఎంఈలు అనేక వ్యయప్రయాసలకు గురవుతున్నాయని వివరించారు. అన్ని ఎంఎ్‌సఎంఈల అవసరాలు ఒకే రకమైన పథకంతో తీరే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.


కరోనా సంక్షోభం ద్వారా కలిగిన నష్టాలను భరించేలా ఒక భారీ ఆర్థిక గ్రాంట్‌ ఇవ్వడం ద్వారా ఎంఎ్‌సఎంఈలను ఆదుకోవచ్చని తాను భావిస్తున్నానన్నారు. రుణభారంతో సతమతమవుతున్న ఎంఎ్‌సఎంఈ యూనిట్లు, ఇన్నోవేటివ్‌ ఎంఎ్‌సఎంఈల కోసం ఆత్మనిర్భర్‌ ప్యాకేజీలో మరో రెండు పథకాలను ప్రకటించారని, కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తెలంగాణలోనే కాకుండా, దేశంలో ఎక్కడా కూడా ఇవి ప్రారంభం కాలేదని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రుణభారంతో సతమతమవుతున్న ఎంఎ్‌సఎంఈల కోసం ప్రకటించిన సబార్డినెట్‌ డెట్‌ స్కీం అత్యంత తక్కువ రుణ మొత్తాన్ని అందిస్తోందన్నారు. అయితే ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఎంఎ్‌సఎంఈల వయబిలిటీ పైన స్పష్టత లేదన్నారు. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యంత తక్కువ రుణ మొత్తం ఆయా ఎంఎ్‌సఎంఈల అవసరాలకు సరిపోవడంలేదని, దీంతో పాటు ఇన్నోవేటివ్‌ ఎంఎ్‌సఎంఈల కోసం ప్రకటించిన కార్పస్‌ ఫండ్‌ స్కీమ్‌ మార్గదర్శకాలు ఇంతవరకు విడుదల కాలేదని పేర్కొన్నారు. 


పెద్ద కంపెనీలకే ప్రయోజనాలు

ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీలో భాగంగా కీలక రంగాలకు ప్రకటించిన పీఎల్‌ఐ పథకం ద్వారా దేశంలోని ఎంఎ్‌సఎంఈల పై పెద్దఎత్తున సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉండేదని, కానీ ప్రస్తుత పథకం కేవలం పెద్ద కంపెనీలకు మాత్రమే ప్రయోజనాలు చేకూర్చేలా ఉందన్నారు. దేశీయ ఎంఎ్‌సఎంఈలతో కూడిన ఒక సప్లై చైన్‌ ఏర్పాటు చేయాలని, భారీ తయారీ కంపెనీలకు ఒక నిబంధన రూపొందించడం ద్వారా పీఎల్‌ఐ ప్రయోజనాలను ఆయా ఎంఎ్‌సఎంఈలతో పంచుకునేలా ఈ కార్యక్రమం మార్గదర్శకాలను మార్చాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2021-06-18T08:17:50+05:30 IST