హీటెక్కిన యూపీ.. ఆ మూడు పార్టీల మధ్యే పోటీ

ABN , First Publish Date - 2021-10-31T22:22:16+05:30 IST

403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 39.67 శాతం ఓట్లతో ఏకంగా 312 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది. 2002 నుంచి బలహీనపడుతూ వచ్చిన వచ్చిన బీజేపీ.. 15 ఏళ్లకు బాగా పుంజుకుంది. దీనికి ముందు 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాల్లో 71 స్థానాలు గెలుచుకుంది..

హీటెక్కిన యూపీ.. ఆ మూడు పార్టీల మధ్యే పోటీ

లఖ్‌నవూ: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. దేశ రాజకీయాలపై ఎంతగానో ప్రభావం చూపే యూపీ.. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు ఎంతో కీలకం. మరో ఐదు నెలల్లో యూపీ అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే ఈ ఎన్నికల్లో సత్తా చాటుకొని దేశవ్యాప్తంగా ప్రభావం చూపేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ, కోల్పోయిన అధికారాన్ని రాబట్టుకోవడానికి బీఎస్పీ, ఎస్పీలు కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి పొందేందుకు కాంగ్రెస్, తమ ఉనికిని చాటుకునేందుకు ఇతర చిన్న పార్టీలు కష్టపడుతున్నాయి.


403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 39.67 శాతం ఓట్లతో ఏకంగా 312 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది. 2002 నుంచి బలహీనపడుతూ వచ్చిన వచ్చిన బీజేపీ.. 15 ఏళ్లకు బాగా పుంజుకుంది. దీనికి ముందు 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాల్లో 71 స్థానాలు గెలుచుకుంది. ఈ ఎన్నికల ప్రభావం 2017 అసెంబ్లీ ఎన్నికలపై బాగా చూపించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కలిసి పోటీ చేయడంతో బీజేపీకి గట్టి పోటీ ఎదురైంది. గత ఎన్నికలతో పోలిస్తే 9 స్థానాలు తగ్గి 62 స్థానాలు గెచుకుంది. అయితే ఓటు బ్యాంక్ బాగా పెరిగింది. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించడం బీజేపీని కలవరానికి గురి చేస్తోంది. దీనికి రైతు ఉద్యమం బీజేపీ ఓట్లను తగ్గిస్తుందని చెబుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం తక్కువగా ఉంటుందని విశ్లేషణలు వస్తున్నాయి.


ఇక రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలైన ఎస్పీ, బీఎస్పీలు 2014 నాటి నుంచి ఘోరంగా విఫలమవుతూ వస్తున్నాయి. బీజేపీ హవా ముందు కనీస స్థాయిలో సీట్లు గెలుచుకోలేకపోతున్న ఈ రెండు పార్టీలు.. ఓట్ బ్యాంక్‌ను మాత్రం జాగ్రత్తగానే కాపాడుకున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ కేవలం 5 సీట్లే గెలుచుకోగా బీఎస్పీ ఒక్క సీటు కూడా గెలవలేదు. 2019 సాధారణ ఎన్నికల్లో రెండు కలిసి పోటీ చేశాయి. అయితే ఎస్పీ అవే ఐదు సీట్లను కాపాడుకోగా బీఎస్పీ మాత్రం 10 సీట్లు గెలుచుకుంది. అయితే ఈ ఎన్నికల్లో ఇరు పార్టీల ఓట్ బ్యాంక్ స్వల్పంగా తగ్గింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ఎస్పీ.. 21.82 శాతం ఓట్లతో 47 సీట్లకు పరిమితం కాగా, జాతీయ పార్టీగా గుర్తింపు ఉన్న బీఎస్పీ 22.23 శాతం ఓట్లతో కేవలం 19 స్థానాలకు పరిమితం అవ్వడం గమనార్హం. ఈ రెండు పార్టీలు కొద్ది రోజుల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ప్రభావాన్ని చూపించగలిగాయి. ఎస్పీ ఏకంగా 747 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, బీఎస్పీ సైతం 350కి పైగా స్థానాలు గెలుచుకుంది. ఇదే ఉత్సాహంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు ఇరు పార్టీలు సిద్ధమయ్యాయి.


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, బీఎస్పీ, ఎస్పీ పార్టీల చుట్టే కొనసాగనుంది. కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్నప్పటికీ వాటి ప్రభావం అంతగా ఉండదనేది బహిరంగ చర్చలో ఉన్న అంశం. ఇక అప్నాదళ్, ఆజాద్ సమాజ్ పార్టీ లాంటి పార్టీలు తమ ఉనికి కోసం పోటీ చేయడమే కానీ ప్రధాన రాజకీయంలో వాటి ప్రభావం ఏమాత్రం ఉండదని అంటున్నారు. అయితే త్వరలో జరగబోయే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీనే మరోసారి విజయ ఢంకా మోగించనుందని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీకి భారీ స్థాయిలో సీట్లు తగ్గినప్పటికీ అతిపెద్ద పార్టీగా బీజేపీనే ఉండనుందని, అటుఇటుగా ఆ పార్టీ మెజార్టీ మార్క్ చేరుకోనుందని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి.


సర్వేలు, అంచనాలు ఎలా ఉన్నా.. ప్రతి పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ నుంచి ప్రధానితో సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాకం గాంధీ అయితే చాలా కాలంగా యూపీలోనే ఉంటూ కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ప్రియాంక చేసే కార్యక్రమాల వల్ల కాంగ్రెస్‌కు మంచి స్పందన వస్తోందని విమర్శకులు అంటున్నారు. ఇక సమాజ్‌వాదీ పార్టీ అనేక కార్యక్రమాలతో యూపీ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నిస్తోంది. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ కంటే ఎక్కువ స్థానాలు గెలిచి మంచి ఊపులో ఉన్న ఎస్పీ.. అదే ఊపులో ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఇక బహుజన్ సమాజ్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ సీట్లు తక్కువగా సాధిస్తోంది. ఓట్లతో పాటు సీట్లను పెంచుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. సంప్రదాయ ఓట్ బ్యాంక్‌ను బలోపేతం చేస్తూనే ఇతర వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Updated Date - 2021-10-31T22:22:16+05:30 IST